Facebook Twitter
అక్షర తపస్వి దాశరథి రంగాచార్య

 

అక్షర తపస్వి దాశరథి రంగాచార్య

 


                              
                

ప్రజా ఉద్యమంలో పుట్టి పురాణాలను, వేదాలను అన్వేషించి సామాన్యులకు అందించిన అక్షర తపస్వి. మార్గం ఏదైనా సంపూర్ణ మానవుని దర్శించాలని జీవనఉద్యమాన్ని, సాహిత్య ఉద్యమాన్ని సాగించిన తెలంగాణ పోరుబిడ్డ. మానవునిలో సహజంగా ఉండాల్సిన ప్రేమ, కారుణ్యం, జాలి, దయ లాంటి ఉత్తమ గుణాలకోసం రచనలు చేసిన వ్యక్తి. ఆయన రచనలే కాదు, జీవితం కూడా విలక్షణంగా సాగింది. ఆయనే ప్రముఖ రచయిత దాశరథి రంగాచార్య.
         రంగాచార్య వారిది ఒకప్పటి నిజాం రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో ఉన్న చినగూడూరు. వేంకటాచార్య, వేంకటమ్మలకు దాశరథి 1928, జూలై 24న జన్మించాడు. చిన్ననాడే గడీల్లో దొరల అకృత్యాలను పసికట్టాడు. బానిస బతుకుల్ని, ఆడబాపల అసహాయతల్ని కళ్లారా చూశాడు. వారి కుటుంబం తర్వాత ఖమ్మానికి వచ్చింది. చిన్నప్పుడు ఆరో తరగతి చదువుకునే రోజుల్లో నిజాం ప్రవేశపెట్టిన యూనిఫారం కు వ్యతిరేకంగా విద్యార్థులను కూడగట్టి సమ్మెకు దిగాడు దాశరథి. దాంతో అతనికి నిజాం రాష్ట్రంలో విద్య లేకుండా పోయింది. నాటి గ్రంథాలయోద్యమంలో పాల్గొన్నాడు. తర్వాత రంగాచార్య 17వ ఏటనే నిజాం వ్యతిరేకపోరాటం పాల్గొని అరెస్టయ్యాడు. స్వయం కృషితో చదవి బి.ఎ. పూర్తి చేశాడు. ఉపాధ్యయుడిగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించాడు. 1956 తర్వాత హైదరాబాదులోని మున్సిపల్ కార్పోరేషన్ లో ఉన్నతోద్యోగిగా పనిచేసి విరమణ పొందాడు. రంగాచార్య అన్న కృష్ణమాచార్య ప్రముఖ కవి. నిజాంను ఎదిరించి నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చాటిన కవి.
           రంగాచార్య సంస్కృతం, తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్ధూ భాషల్లో ప్రవీణుడు. కథ, కవిత, నవల, జీవిత చరిత్ర, విమర్శ, అనువాదాలలో విశేష కృషి చేశారు. తెలంగాణ జన జీవితాన్ని రచనలుగా మలచారు. చారిత్రక వాస్తవ పరిస్థితులకు వీరి రచనలు ఛాయాచిత్రాలు లాంటివి. 73 ఏళ్ల వయసులో మూడు ఇతిహాసాలను, నాలుగు వేదాలను సంస్కృతం నుంచి వచన తెలుగులోకి అనువదించిన ఘనుడు రంగాచార్య. 1963లో శ్రీ మద్రామయణముతో ప్రారంభమైన వీరి రచనా వ్యాసంగం ఎన్నో విలువైన సాహితీ రత్నాలను తెలుగు వారికి అందించింది. చిల్లరదేవుళ్లు, మోదుగపూలు, జనపదం, పావని నవలలు తెలంగాణ చరిత్రకు నిలువెత్తి సాక్ష్యాలు. రానున్నది ఏదినిజం, శరతల్పం, దేవదాసు ఉత్తరాలు, బుద్ధ భానుడు, రణభేరి వీరి సాహితీ విలక్షణకు దార్శనికాలు. చతుర్వేద సంహిత, అమృతోపనిషత్తు, అమృతంగమయ, శ్రీ శంకర చరితామృతం భారతీయ తాత్విక చిత్రన తెలిపే భాష్యాలు. ఇక జీవనయానం వీరి జీవిత చరిత్ర లాంటిది. సుమారు 76 ఏళ్ల వయసులో అమృతంగమయ నవలను పూర్తి చేశారంటే వీరి సాహిత్యపిపాస ఎలాంటిదో అవగతం అవుతోంది.
             అభిమానులు, సాహితీ సంస్థల వాళ్లు వీరి కృషికి ఘనసత్కారాలు చేశారు. గోపీచంద్ అవార్డు, గుప్తా ఫౌండేషన్ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం వారి విశిష్ట పురస్కారం వీరికి వచ్చిన అవార్డులలో మచ్చుతునకలు మాత్రమే. యువకళావాహిని అక్షర వాచస్పతి బిరుదు నిచ్చింది. నేడు రంగాచార్య అక్షర వాచస్పతిగా వెలుగులీనుతున్నారు. వీరి రచనలపై పలు విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి.
            ఒకవైపు ఆధ్యాత్మిక మార్గాన్ని, విప్లవ పంథాని రెండూ రెండు కళ్లగా స్వీకరించిన దాశరథి జీవన ప్రస్థానంలో ఎన్నో మలుపులు. మరెన్నో మైలురాళ్లు. నేటి రచయితలకు, యువకులకు జీవిత పాఠాలు. మానవీయతను ఆవిష్కరించే రచనా నిధులు.

ఇన్ని విలువైన అరుదైన జ్ఞాప‌కాల్నీ వ‌దిలి వెళ్లిపోయిన దాశరథి రంగాచార్య ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని మ‌న‌సారా కోరుకొంటూ..తెలుగువన్ నివాళులర్పిస్తుంది.

  - డా.ఎ. రవీంద్రబాబు