Facebook Twitter
మరణం లేని మహాచిత్రకారుడు - బాపు

మరణం లేని మహాచిత్రకారుడు - బాపు

 



మరణం మనిషిని జయిస్తే.. మరణాన్ని జయిస్తాడు కళాకారుడు. ఆ కోవకు చెందిన వారే మన ‘బాపు’. ‘బాపు’ అన్నది ఆయన బొమ్మ పేరు. బొమ్మే ఆయనను మనకు పరిచయం చేసింది.., పలకరించి మనకు దగ్గర చేసింది..,మనసులో ‘ఆయన’ బొమ్మే నిలిచిపోయేలా చేసింది. అందుకే ఆయన అసలు పేరు ‘సత్తిరాజు లక్ష్మీనరాయణ’ అన్న సంగతి అందరూ మర్చిపోయారు.., మన అభిమాన ‘బాపు’గా మనందరి గుండెల్లో మిగిలిపోయారు. ఎప్పుడో ఎనభైయేళ్ల క్రితం పశ్చమగోదావరి జిల్లాలోని నర్సాపురంలో వామనుడుగా జన్మించిన ‘బాపు’ తనదైన బొమ్మతో త్రివిక్రముడై, విశ్వవ్యాప్త కీర్తి సామ్రాజ్యానికి సార్వభౌములై..నేడు తిరిగిరాని ఊర్ధ్వలోకాలకు తరలిపోయారన్నది భరించలేని సత్యమే అయినా.., ఆయన మరణించారనుకోవడం మన భ్రమ.
‘తిని తొంగోటమే కాదు...మడిసన్నాక కాసింత కలాపోసనుండాల’ అని ‘సినిమాటిక్’గా చెప్పించినా...ఆయన మాత్రం జీవితాంతం కళాతపస్సు చేసిన ‘మౌనతపస్వి.

- ఆయన ‘గీత’ చిత్రకారులకు ఓ ‘భగవద్గీత’
- ఆయన ‘రాత’ విద్యార్ధులకు ఓ ‘వర్ణాక్షరమాల’
- ఆయన ‘చిత్రం’ భావి దర్శకులకో ‘నిదర్శనం’

‘భాపు’ మితభాషి...ఆయన బొమ్మ ‘బహువేషి’

 


‘గయ్యాళిఅత్తైనా, పక్కింటి పిన్నిగారైనా, కొత్తకోడలు వయ్యారాలైనా, అల్లరి బుడుగు పుట్టినా, అష్టవిధనాయికలైనా, దశావతారాలైనా, నవరసాలు నర్తించినా, అష్టపదులైనా, కిన్నరసాని పాటలౌనా, కూనతమ్మ పదాలైనా,  శ్రీరామదాసు కీర్తనలైనా...‘బాపు’ గీత నుంచి జాలువారి రూపు దిద్దుకోవలసిందే, ప్రాణం పోసుకోవలసిందే. ఇక సినిమాల విషయానికొస్తే...
- దర్శకుడిగా ‘సాక్షి’తో తొలి ‘సాక్షి సంతకం’ చేసినా, ఆ చిత్రం, సినిమాలు    స్టూడియోలలోనే కాదు.., ప్రకృతి ఒడిలో కూడా తీయచ్చు అనడానికి ప్రత్యక్ష ‘సాక్షి’.
- ‘ముత్యాలముగ్గు’తో తెలుగు లోగిళ్ళ రంగవల్లులు తీర్చి దాద్దాడు.
- ‘పెళ్లిపుస్తకం’తో తెలుగువారి పెళ్లి వేడుకలు మన కళ్ళ ముందుంచారు.
- ‘భక్తకన్నప్ప’కు  తెలుగు ప్రేక్షకులచే నీరాజనాలు పట్టించారు.
ఇలా చెబుతూపోతే.. ఆయన కళాసృష్టికి ఎల్లలే ఉండవు. అందుకే...
- ‘తిరుమల తిరుపతి దేవస్థానము’వారు ‘ఆస్థాన విద్వాన్’(చిత్రకారులు)గా    సత్కరించింది.
- ‘ఆంధ్ర విశ్వవిద్యాలయం’వారు ‘కళాప్రపూర్ణ’ బిరుదునిచ్చి గౌరవించారు.
- ‘శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం’వారు ‘గౌరవ డాక్టరేట్’ ఇచ్చి సత్కరించారు.
- ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం’ ‘రఘుపతి వెంకయ్య అవార్డు’తో గౌరవించింది.
- ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్టుస్’ వారు ‘లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్’తో    సత్కరించారు.
ఇలా ఎన్నో.., ఎన్నన్నో..., మరెన్నో....

ఆయన తీసిన ‘సీతాకల్యాణం’ చిత్రం ‘లండన్ మరియు ఛికాగో ‘ఫిలిం ఫెస్టివల్’కు ఎంపిక కావడమే కాకుండా.., ‘లండన్ ఫిలిమ్ ఇనిస్టిట్యూట్’ విద్యార్ధులకు పాఠ్యాంశంగా బోధించడానికి ఎంపిక కావడం మన ‘తెలుగు చలన చిత్ర రంగానికే’ గర్వకారణం.
ఇంతటి ఘనకీర్తిని అందించిన ‘బాపు’ మరణించారనుకోవడం పొరపాటు.
చివరిగా ఓ మాట.
‘బాపు’ శ్రీరామభక్తుడు. ‘రామ’ నామం ఆయన ఉఛ్చ్వాస,నిశ్వాసాలు.
ఆదికవి ‘వాల్మీకి’ రాతలో ‘రామాయణం’ కావ్యరూపం ధరిస్తే...,
‘బాపు’ గీతలో ‘శ్రీరాముడు’తో పాటు అన్ని పాత్రలు సజీవరూపాలు ధరించాయి.
బ్రహ్మగారు.., వాల్మీకికి ఒక వరం ఇచ్చారు.
          
                   ఏవ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే
                   తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి

లోకంలో పర్వతాలు నిలిచి ఉన్నంత కాలం, నదులు ప్రవహిస్తూ ఉన్నంత కాలం
రామాయణం ముల్లోకాల్లో స్థిరంగా ఉంటుంది.  అలాగే..

రామాయణం కీర్తించబడినంతకాలం...‘బాపు’గా

రు సజీవులుగానే ఉంటారు.
ఆయన అమరులు... అమృత హృదయులు.. మరణం లేని మహాచిత్రకారులు.
                              
            
  - యం.వి.యస్.సుబ్రహ్మణ్యం