Facebook Twitter
అలలు వదలని కడలి

అలలు వదలని కడలి

 


                దృశ్యాలన్నీ అదృశ్యాలవుతున్నాయి. ఎదలోని ఎద తనలోకి తాను మునగదీసుకొని నిద్రకు ఉపక్రమిస్తుంది. ప్రతి చర్య ప్రతిచర్యను కోరుకుంటుంది. ఆకాశం నీటిని ఇచ్చి మేఘాల ద్వారా మళ్లీ గ్రహించనట్లు. మనుషులు అసలు నచ్చడం లేదు. హటాత్తుగా ఈ మానవ ప్రపంచం గొప్ప అద్భుతమైన వనంగా మారిపోతే...! చెట్లు చేమలు. పక్షులు, జంతువులు, పువ్వులు, లేనవ్వును పూసుకునే మొగ్గలు, తొలికిరణాలను ముద్దాడే మంచు బిందువులు...! ఎంత బావుంటాయి. ఈ కాంక్రీట్ భవనాల మధ్య, మనుషుషులు, వారిలోని మనసులు పూర్తిగా  కాంక్రీట్ గానే మారిపోయాయి. నేనే మారలేక నా జ్ఞాపకాల వలలో చిక్కుకుని ఆత్మను తొవ్వుతున్నాను పగలు రేయి తేడా లేకుండా...
              నిద్రకు వెలియై నేనొంటరినై అన్నాడో కవి, అవును దీనంగా నా చూపులు నన్నే ప్రశ్నిస్తున్న వేళ... సమాధానాల కోసం కొత్తదనాన్ని వెతుక్కోలేక పోతున్నా, ఆశకు అనుభవాలకు మధ్య బంధించబడి శిలాక్షరంలా ఉంటున్నా...! నీకో విషయం చెప్పనా...! భూమ్మీద సూర్యప్రతాపం ఎక్కువైంది. వానలు కనుమరు గవుతున్నాయ్. నీవు ఉంటే ఎంత భాధపడే దానివో కదా...! నీవు వర్షంలో తడుస్తుంటే... నీ నల్లటి కురుల్లోదాగలేక ఎన్ని నీటి బిందువులు నక్షత్రాలై నేలపై రాలేవో...! ఎన్ని కవితలు నీ ఆనందపు పొలిమేరల్లోంచి నా సెల్ లో ప్రక్షమయ్యేవో...! ముద్దుల మాటున జల్లులు విరిసిన క్షణాలను ఎలా మర్చిపోగలం. కాలం చెక్కిలిపై నీ అధరాల చప్పుళ్లను లిఖించలేని ఈ చరిత్ర ఎంత కోల్పోయిందో కదా...! అయినా ప్రకృతి అందాలకు మైమరచిన దేవుడు దానికి మించిన సౌందరాన్ని స్పృజించాలనే కాంక్షతో స్త్రీని ఈ భూలోకం మీద సృష్టించి ఉంటాడు. నీ దేహంలో విరిసే ఇంధ్రదనసులు, విరగే నెలవంకలు, నీలికొండల మధ్య సంద్యాసమయాలు, చిరు గరికలై విచ్చే లేలేత పాదాల రవళులు, వన్నెలపువ్వులై విరిసే నవ్వుల పువ్వులు, పవిత్రమైన పూజకోసం పుష్పించే మొగ్గల వేళికొసలు, నడుమొప్పుల్లో దాగిన లతా మణులు... ఎన్నని చెప్పను.!
           గతకాలపు ప్రేమ పుటలు నీ ప్రేమని నింపుతంటే.., ప్రస్తుతం, కన్నీరై అక్షరాలను అభిషేకిస్తుంది... ప్రియా...! ఆనందం లేదు, ఆత్మతృఫ్తి లేదు, అరమరికలు లేవు, అభిషేకాలు లేవు, ఆలింగినాలు లేవు, అనురాగాలు లేవు, ఆత్మీయ స్పర్శలు లేవు, వెచ్చటి దేహంలో కాంతి పరావర్తనం చెందే క్షణాలు లేవు. వదలలేని నిశ్వాస తాళ వృంతాలు లేవు. ఘనీభవించిన రెండోజాము చీకటి పెళ్లలు తప్ప. ఇంకా భయం, చేదులాంటి భయం, తీపి లాంటి భయం... తీపికి చేదుకు మధ్య విరక్తి చెందే రుచిలేని భయం. అందుకే... మనుషులకు దూరంగానే ఉంటున్నాను. ఎదను కాల్చే వెలుగులో నాకునేను చలి కాచుకుంటున్నాను. ఆ చలిలోంచే ఈ వాక్యల విస్పోటనలు. ఎప్పటిలాగే మానవ ప్రపంచానికి అంటీ అంటనట్లు బతుకుతున్నాను. ఇమడలేని మనుషుల మధ్య మేఘాల మధ్య సూర్యుడిలా  కాలుతూ తిరుగుతున్నాను. ఏమీ తోచదు. నిస్తేజం. నిస్పృహ.
           నీలిలిట్మస్ కాగితాల మనసుల మధ్య ఏ దరికి చేరాలో తెలియదు. ఈ ప్రపంచానికి ఓ సృష్టికర్త ఉన్నాడు అంటారు. నిజంగా ఉంటే... ఈ మనుషుల మీద జాలి, దయ లేకుండా ఎందుకిలా తయారు చేస్తున్నాడు. ఆ దేవుడు కూడా మనిషిలానే ప్రేమ లేనివాడా... ఏమో...! నీవు అన్న ఓ మాట ఎప్పటికీ ఏ సత్యం... నీ నోటి నుంచి నే విన్న నీ భక్తి శ్లోకాలవలే...
        నేనెప్పుడూ నీతోనే ఉంటా... నీ లోనే ఉంటా..
         అంత ప్రేమ సాధ్యం కాదురా అంటారు ఈ మనోవృద్ధులు. శరీరాలు, ధనంలో సుఖాన్ని వెతుక్కునే అల్పజీవులు. ఎందుకు బతుకుతున్నామో తెలుసుకోలేక. సృష్టిలోని బంధాలన్నీ ఇంతే అనుకుంటారు. అల్ప మనుషులు, అల్ప సంతోషాలు. వీళ్లకు ప్రేమించడమే కాదు, ప్రేమించహబడమూ తెలియదు. రాదు అనుకుంటాను. కొద్ది గా వర్షంలో తడిసి, అబ్బా... తడిసి పోయాను, అని ఆరబెట్టుకునే మనుషులు. అహాన్ని ఎలా వీడతారు. నాది అనే భావనలోనే చిక్కుకొని దానిలోనే అందరిని కుదించి చూస్తారు. ఒక్కసారి బైటకు వస్తే ఎంత ప్రేమమయం. మనిద్దరిలా ఈ లోకం. ఎంత సుఖం... ఆత్మపరమాత్మల సంయోగంలా... నీలా నాలా...
        ఈ సాయంత్రం గాలి చల్లదనాన్ని పూసుకొని వీస్తుంది. ఇన్ని పరవాల శరీరాలలో ఒక్కరైనా దాని తాకిడికి స్పందించక పోతారా... వేటూరి అన్నాడు పరువానికి బరువైన యువతీ... ముందు నువ్వు పుట్టి తర్వాత సొగసు పుట్టీ... మొదటి వర్ణన దేహానికైతే, రెండోది ఆత్మకని నా భావన. ఈ మధ్య రవీంద్రుడి  గీతాంజలిని మరోసారి చదువుతున్నా... ఎవేవో కొత్తతెరలు నాలో లేస్తున్నాయి...! నీ కవితల్లో... నిండిన నా పూరణలే గుర్తుకు వస్తున్నాయ్. ఒక్కటి మాత్రం నిజం ప్రియా...! మనసు పుష్పించినప్పుడు, ప్రేమ అంకురించినప్పుడు, విషాదం విరహమై దావానలంలా మనలో రేగినప్పుడు... తప్పక కవిత పూస్తుంది. నీవన్నీ భావాల్లో తేలిన పారిజాతాలే... వాటిలో నిండిన నా మనసుది ఒక జీవితకాలం చాలని ప్రేమ... ...
         అలలే సముద్రానికి అలంకరణ, నీ జ్ఞాపకాల మత్తే నాలో ఆ అలల పునరుత్పత్తి.
  ఎవరో అన్న గుర్తు...
                       కెరటం నా ఆదర్శం    
                       లేచి పడినందుకు కాదు
                        పడినా మళ్లీ లేచినందుకు.
                                                 ----  అలల భాషతో

 

-  డా. ఎ.రవీంద్రబాబు