Facebook Twitter
మహాకవి శ్రీశ్రీకి అక్షర నివాళి

మహాకవి శ్రీశ్రీకి అక్షర నివాళి

- డా.ఎ.రవీంద్రబాబు

           

 

శ్రీశ్రీ రెండక్షరాల సంయోజనం. ఆధునిక తెలుగు కవిత్వ శబ్ద ప్రభంజనం. కవి అంటే కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడని సగర్వంగా చాటిన కవి. మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అని మనిషే కవిత్వ చిరునామా అని కవిత్వాన్ని నిర్వచించిన కవి. ఆయన తన కవిత్వం గురించి చెప్పుకుంటూ నేనొక దుర్గం...నాదొక స్వర్గం... అనర్గళం, అనితర సాధ్యం నా మార్గం అన్నాడు. ఆధునిక తెలుగు కవిత్వానికి దిశదశ  శ్రీశ్రీ... ఆధునిక కవులకు మార్గదర్శి శ్రీశ్రీ. అందుకే తెలుగు కవిత్వాన్ని శ్రీశ్రీ ముందు శ్రీశ్రీ తర్వాత అని విభజించాల్సిన అవసరం ఉందన్నారు విమర్శకులు.
              శ్రీశ్రీ అసలు పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. మారుతున్న సమాజానికి అనుగుణంగా కవిత్వం మారాలని, తన భావాలను మార్చుకున్న శ్రీశ్రీ 1910, ఏప్రిల్ 30 న విశాఖపట్నంలో జన్మించాడు. నిజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. ఆకాశ హర్మ్యాలను, అగాథ లోతలను చవిచూశాడు. పలు సాహిత్య ఉద్యమాలకు వెన్ను దన్నుగా నిలిచాడు. పదండి ముందుకు పదండి అంటూ ప్రోత్సహించాడు.
            ఎనిమిదో ఏటనే చిట్టిపొట్టి పదాలతో కందపద్యాన్ని రాసిన శ్రీశ్రీ, తర్వాత పురిపండ అప్పలస్వామితో కలిసి కవితాసమితి స్థాపించాడు. తొలిరోజుల్లో ప్రభవ అనే ఖండకావ్యాన్ని వెలవరించారు. మద్రాసులో బి.ఎ. పూర్తి అయ్యాక అబ్బూరి రామకృష్ణారావు సహచర్యంతో దేశదేశాల కవిత్వాన్ని అధ్యయనం చేశాడు. బతకడం కోసం అనేక ఉద్యోగాలు చేశాడు. 1933లో టైఫాయిడ్ తో బాధపడి కోలుకున్న శ్రీశ్రీ మరోప్రపంచం మరోప్రపంచం అనే గీతాన్ని అయిదు నిముషాలలో పూర్తి చేశాడు. తర్వాత రచించిన అన్ని కవితలతో కలిపి 1950 నాటికి మహాప్రస్థానం పుస్తకాన్ని ప్రచురించాడు. తెలుగు సాహిత్యంలో ఈ పుస్తకం మైలురాయిగా నిలిపోయింది. యువ కవులకు నేటికీ దిక్సూచిగా నిలిచింది. తర్వాత శ్రీశ్రీ ఖడ్గసృష్టి, మరోప్రస్థానం, సిప్రాలి, చరమరాత్రి, అనంతం, వివిధ వ్యాసాలు... వంటివి ఎన్నో రచించాడు. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) అధ్యక్షునిగా పనిచేశాడు. విప్లవ రచయితల సంఘం (విరసం) లో కూడా చాలా కొలం కొనసాగాడు.
           నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను. నేనుసైతం భువన ఘోషకు వెర్రిగొంతుక విచ్చి మ్రోశాను అని జీవితాన్ని సమాజం పరం చేశాడు శ్రీశ్రీ. శ్రీశ్రీ కవిత్వంలోని ఎన్నో వాక్యాలు జనం నాలుకల మీద నర్తిస్తున్నాయి. పత్రికల్లో పతాక శీర్షికలై వెలుగుతున్నాయి. ప్రపంచమొక పద్మవ్యూహం, కవిత్వమొక తీరని దాహం అన్నా కదిలేది కదిలించేది... పెను నిద్దర వదిలించేది... కావాలోయ్ నవకవనానికి అన్నా... కాదేది కవితకనర్హం అన్నా అది శ్రీశ్రీకే సాధ్యం. చరిత్రను సరికొత్త పంథాలో నిర్వచిస్తూ పరస్పరం సంఘర్షించిన శక్తుల్లో పుట్టిందన్నాడు. వ్యథార్థ జీవుల యదార్థ దృశ్యాన్ని తన కవిత్వంలో ఆవిష్కరించాడు. కార్మిక లోకపు కళ్యాణం, శ్రమిక లోకపు సౌభాగ్యం తన కవిత్వం అని చాడాడు. ఆకాశపు టెడారిలో కాళ్లు తెగిన ఒంటరి ఒంటె లాగుంది జాబిల్లి అని సరికొత్తగా ఊహించాడు.
             శ్రీశ్రీ పదాల్ని, మాటల్ని కత్తులూ, ఈటెలూ, మంటలుగా చేశాడు. ఉద్రేకాలు, యుద్ధాలుగా మార్చాడు. తెలుగు కవిత్వానికి వాడిని వేగాన్ని ఇచ్చాడు. సింధూరం రక్తచందనం, బంధూకం, సంధ్యారాగం, పులి చంపిన లేడి నెత్తురూ, ఎగరేసిన ఎర్రని జెండా... కావాలోయ్ నవకవనానికి అని అభ్యుదయాన్ని కాంక్షించాడు. సరికొత్త ప్రతీకల్ని, పదబంధాల్ని సృష్టించాడు. పాతపదాల నడ్డి విరగ్గొట్టి శ్మశానాల వంటి నిఘంటువులను దాటాడు. వ్యాకరణాల సంకెళ్లు తెంచాడు. అందకే శ్రీశ్రీ గేయాల్లో అంతర్లయ తొణికిసలాడుతుంది. మాత్రఛందస్సుతో అవి పరుగెత్తుతాయి. చెలం లాంటి వాళ్లే శ్రీశ్రీ కవిత్వాన్ని ప్రపంచపు బాధ అన్నారు. రక్తం నెత్తరు కలిపి ఈ వృద్ధ ప్రపంచానికి శ్రీశ్రీ సరికొత్త టానిక్ తయారు చేశాడు అని చెప్పారు.
               శ్రీశ్రీ పాటల రచయిత కూడా... తెలుగు సినీ ప్రపంచానికి ఎన్నో మధురమైన గీతాలు అందించాడు. పాడవోయి భారతీయుడా అన్నాడు. తెలుగు వీర లేవరా అని అల్లూరి సీతారామరాజు విప్లవోద్యమాన్ని స్తుతించాడు. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండాలని భావగీతాన్ని రచించాడు. అందుకే సినీ పాటల్లో కూడా ఆయన వాణి చెరగనిది. తెలుగు కవిత్వానికి అంతర్జాతీయ దృక్పథాన్ని కలిగించిన శ్రీశ్రీ  20వ శతాబ్దం నాది అని సగర్వంగా చెప్పుకున్నాడు. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది ఏదీ లేదన్నాడు. కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిల్లా- హీనంగా చూడకు అని అన్నీ వస్తువులు కవితామయమేనోయ్ అని చాటాడు.
            ఆకాశపుదారులెంట వెళ్లిపోయే జనగన్నాథ రథచక్రాలను భూమార్గం పట్టించాడు. కనపడలేదా మరో ప్రపంచపు అగ్నికిరీటపు ధగధగలు, ఎర్రభావుటా నిగనిగలు, హోమజ్వాలల భుగభుగలు అని ప్రకటించిన శ్రీశ్రీ జూన్ 15, 1983లో మరణించాడు. ఆయన మరణించినా ఆయన కవిత్వం బతికే ఉంది. ఎందరో అభ్యుదయ వాదుల్లో నిలిచే ఉంది. ఇంకా రాత్రి చీకట్లో, లోకం నిద్రలో భయంకర స్వప్నాలు కంటో దీనంగా పలవరించే సమయాన ఉషాగమనాన్ని గుర్తించి స్వాగతించిన వైతాలికుడు శ్రీశ్రీ... అందుకే ఆ మహా కవి వర్థంతి సందర్భంగా అక్షర నీరాజనాలు.... ఇవి...