Facebook Twitter
అమ్మకే జీతం ఇవ్వాల్సి వస్తే...?

 అమ్మకే జీతం ఇవ్వాల్సి వస్తే...?
 

-కనకదుర్గ         

                                                                                  


"మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ" - మన శాస్త్రాలల్లో కూడా కన్న తల్లికే మొదటి స్థానం ఇచ్చింది.  కన్న తల్లి తర్వాతే ఎవ్వరయినా.  ఒకమ్మాయికి వివాహం జరిగి భర్తతో కాపరానికి వచ్చాక మొదటిసారి గర్భవతి కావడం అప్పటినుండి ఆమె శరీరంలో ఒక చిన్న పాపో, బాబో ప్రాణం పోసుకోవడం మొదలు పెట్టాక శరీరంలో, ఆమె మనసులో ఎన్నో మార్పులు వస్తుంటాయి.  పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో తీపి కలలు.  ఇప్పటిలా ఆడపిల్లయితే గర్భస్థ శిశుహత్య చేయించే అవకాశాలు లేనప్పుడు మొగపిల్లాడు పుట్టినా, ఆడపిల్ల పుట్టినా ఆనందించేవారు.  ముఖ్యంగా తల్లికి ఎటువంటి భేధాలు వుండవు, ఎవరు పుట్టినా ఆరోగ్యంగా, సంతోషంగా, తన వొళ్ళో కేరింతలు కొట్టాలని కోరుకుంటుంది.  సృష్టికే మూలం అయిన స్త్రీ శిశువునే పుట్టకముందే పొట్టన పెట్టుకునే రోజులు వస్తాయని అప్పటివారు వూహించి కూడా వుండరు. 
మదర్స్ డే ముఖ్యంగా అమెరికాలో ఎక్కువగా జరుపుకుంటారు, మే నెలలో రెండవ ఆదివారం.  అలాగే ఫాదర్స్ డే, గ్రాండ్ పేరంట్స్ డే (స్కూల్స్ లో), ఫ్రెండ్షిప్ డే, సెక్రటరీస్ డే, నర్సస్ డే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వున్నాయి.  కానీ మదర్స్ డే ప్రపంచీకరణ తర్వాత త్వరగా ఇతర దేశాలకు ముఖ్యంగా అబివృద్ది చెందుతున్న దేశాలకు ప్రాకిపోయింది.  ముందు జరుపుకోలేదు కదా ఇప్పుడు ఎందుకు జరుపుకుంటున్నాం? అని కొంతమంది ప్రశ్నించుకుంటారు.  కొంతమంది ఆధ్యాత్మిక గురువులు పాశ్చాత్యదేశాలనుండి వచ్చిన ఈ ’రోజులను,’ ముఖ్యంగా అమ్మల దినం, నాన్నల దినం జరుపుకోనవసరం లేదు, మన సంస్కృతిలో తల్లిని, తండ్రిని ప్రతి రోజు గౌరవిస్తూనే వుంటాం కాబట్టి. 

అమ్మ, ఆయి, మాద్రే, మమ్మీ, మమ్మా, మాయి, మామ్, హహోయా, మమోచ్కా, ఏ భాషలో పిలిచినా అమ్మ ప్రేమ, ఆప్యాయతా, అనురాగం, మమత ఎక్కడయినా ఒక్కలాగే వుంటాయి.  ఇప్పుడు చూడండి నైజీరియాలో ఆడపిల్లల్నిఎత్తుకెళితే ఇతర దేశాల వారు కూడా వారిని వెదికి తీసుకురావడానికి సాయం చేయడానికి ముందుకు వచ్చాయి.  వాళ్ళని ఎత్తుకెళ్ళినప్పట్టినుండి తల్లులు, ఏడ్చీ, ఏడ్చీ, తిండి తిప్పలు లేకుండా, నిద్ర కూడా లేకుండా రోడ్డు మీద కెళ్ళి వారి నిరసన తెలియజేస్తున్నారు, తమ పిల్లల్ని వెదకడంలో ప్రభుత్వం జాప్యం చేసినందుకు.
మదర్స్ డే చాలా హంగామా చేస్తారు అమెరికాలో.  కొత్తగా తల్లి కాబోతున్న తల్లికి, గర్భవతికి భర్త మంచి బహుమతులిస్తాడు.  కాలేజిల్లో చదువుకుంటున్నవారు, వేరే ప్రదేశాల్లో వుద్యోగాలు చేస్తున్న పిల్లలు తల్లులకు మంచు గిఫ్ట్స్ తీసుకుని ఆ రోజంతా తల్లితో గడపడానికి వస్తారు. వృద్దాశ్రమాల్లో వుండేవారిని చూడడానికి కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మనవలు, మనవరాళ్ళు, మునిమనవలు అంతా కలిసి వచ్చి వారితో గడిపి వెళతారు.  ఒకోసారి మరీ దూరంగా వుంటే రావడం కుదరక పోతే వృద్దాశ్రమాల్లో వుండే వృద్దులు పిల్లల కోసం రోజంతా ఎదురు చూస్తూనే గడిపేస్తారు.  ఆ ఆశ్రమంలో వారు వారి సంతోషం కోసం రక రకాల కార్యక్రమాలు చేసినా వారి చూపు మాత్రం పిల్లల కోసం ఎదురు చూస్తూనే వుంటాయి.  

అమ్మ అంటే కడుపులో వున్నప్పుడే బిడ్డతో అనుబంధం ఏర్పడి, భూమ్మీద పడినప్పటి నుండి కంటికి రెప్పలా కాపాడే తల్లి భాధ్యతలు రోజు రోజుకి పెరిగి పోతున్నాయి.  సూపర్ వుమన్ పేరిట, మల్టీ టాస్కింగ్ స్త్రీలు బాగా చేయగలరనే పేరుతో ఇటు ఇంట్లో, అటు వుద్యోగాల్లో పురుషులకు ఏ మాత్రం తక్కువ కామని వారికంటే కూడా ఇంకా ఎక్కువే చేయగలమని నిరూపించుకుంటున్నారు నేటి స్త్రీలు.  ఇక గృహిణుల విషయానికొస్తే వారు ఇంట్లో వుంటారు వారికేం సమస్యలుంటాయి అనుకుంటారు చాలా మంది.  కొంతమంది పిల్లల్ని కానీ, భర్తలని కానీ మీ అమ్మ, లేదా భార్య ఏం చేస్తుంటారు? అని అడిగితే, వెంటనే, మా అమ్మ ఇంట్లోనే వుంటుందండీ, ఏం చేయదు, మా ఆవిడ ఇంట్లోనే వుంటుంది ఏం చేయదు, షి ఈజ్ జస్ట్ ఏ హౌజ్ వైఫ్ అంటారు చాలా మంది.  ఒక గృహిణి, తల్లిగా, భార్యగా, కోడలిగా, ఒక ఇంట్లో ఎన్ని పనులు చేస్తుందో తను చేసే పనులను విభాగాలుగా విడగొట్టి చూస్తే అందరూ ఒక్క వుద్యోగం చేస్తే గృహిణులు ఒక్క రోజులో ఎన్ని వుద్యోగాలు చేస్తున్నారో తెలుస్తుంది. 

మొట్టమొదటగా ఒక ఇంట్లో ప్రతి ఒక్కరికి అన్నీ అమర్చి పెట్టడం, అందరి రూమ్స్ లో అన్నీ సరిగ్గా వున్నాయా లేదా, ఏమైనా లేకుంటే పిల్లలకు చదువుకునే డెస్క్ పాడయిపోతే కొత్తది తెప్పించి పెట్టడం లాంటివి, ఇలా అందరికీ అమర్చి పెట్టడం చేస్తారు ఒక హౌజ్ కీపర్ గా (Housekeeper).   ఈ హౌజ్ కీపర్ పనుల్లో ఇల్లు రోజు శుభ్రం చేయడం, పసి పిల్లలుంటే వారిని చూసుకోవడం అంటే బేబి సిట్టర్ గా లేకపోతే ఒక డేకేర్ సెంటర్ పని కూడా చేస్తున్నారన్నమాట. కాస్త పెద్ద పిల్లలయితే రోజు వారితో హోం వర్క్ చేయించడం, వారు పియానో, వయోలిన్, సంగీతం కానీ, కూచిపూడి,కానీ నేర్చుకుంటుంటే వారు రోజు మర్చిపోకుండా ప్రాక్టీస్ లు చేయించడం, వారిని రోజు ఆ క్లాసెస్ కి తీసుకెళ్ళడం, తీసుకురావడం చేస్తారు. అలాగే పిల్లలు  స్పోర్ట్స్ లో వుంటే సాకర్, టెన్నిస్, జిమ్ నాస్టిక్స్, బాస్కెట్ బాల్ ఏ ఆటలో వుంటే ప్రాక్టీస్ లకి తీసుకెళ్ళడం, శనివారాలు గేమ్స్ కి తీసుకెళ్ళడం చేస్తారు.   ఇలా ఒక టీచర్ గా(Teacher), డ్రైవర్(Driver) పని కూడా చేస్తున్నారన్న మాట.  ఒకోసారి తల్లులందరు కలిసి ఒకరోజు అందరి పిల్లల్ని ఒకరు, మరో రోజు మరొకరు తీసుకెళ్లే పద్దతి, కార్ పూలింగ్ (Carpooling) చేస్తుంటారు.  శనివారాలు గేమ్స్ తల్లి ఒకరిని ఒక గేమ్ కి తీసుకెళ్తే, తండ్రి ఒక గేమ్ కి తీసుకెళ్తారు. 

ఇక వంట విషయానికొస్తే పొద్దున బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్, వారి వారి అవసరాలను బట్టి చేయాల్సి వుంటుంది.  పర్యావరణ కాలుష్యం వల్ల చిన్నప్పటి నుండే పిల్లలకి రక రకాల అలెర్జీల వల్ల వారికి ఏది పడుతుందో, ఏది పడదో, అలాగే ఇంట్లో ఎవరికైనా డయబెటిస్ వుంటే వారికి వేరే రకంగా, అందరికి కావాల్సినట్టుగా చేయాలి,  మధ్య మధ్యలో పిల్లలకి తినడానికి స్నాక్స్ చూసుకోవడం చేస్తారు కాబట్టి ఇది వంట మనిషి చేసే పని కిందకి వస్తుంది, (Cook).
స్కూల్స్ నుండి వచ్చే మేల్స్ చూడడం, ప్రెండ్స్ తో టచ్ లో వుండాలంటే కూడా మేల్స్ పంపిస్తూ వుండాలి, స్కూల్ కి వలంటీర్ వర్క్ కుడా ఇంటినుండే ఇంటర్నెట్ ద్వారా చేస్తారు కొంతమంది స్త్రీలు.  చాలావరకు బిల్స్ అన్నీ ఆన్లైన్ ద్వారా కట్టడం, ఏవైనా అర్జెంటుగా కొనాలన్నా బయటకు వెళ్ళి షాపింగ్ చేసే సమయం లేకపోతే ఆన్లైన్ లోనే ఆర్డర్ చేస్తారు, పెద్ద పిల్లలకు హోం వర్క్ కి ఇంటర్నెట్ సాయంతోనే చేయిస్తారు.  ఈ విధంగా కంప్యూటర్ ఆపరేటర్ (Computer Operator) గా కూడా పని చేస్తూనే వుంటారు.
బట్టలు వాషింగ్ మెషిన్ లో వేయడం, డ్రయర్ లోకి మార్చడం, డ్రై క్లీనింగ్ బట్టలకి కిట్స్ తీసుకొచ్చి ఇంట్లోనే డ్రయర్లో చేస్తారు, ఇలా అయితే చీప్ గా అవుతుందని.  ఆ తర్వాత ఇస్త్రీ తప్పకుండా చేయాల్సిన కుటుంబాల్లో స్త్రీలు ఆ పని కుడా చేస్తుంటారు.  ఇలా వీరు లాండ్రీ ఆపరేటర్ (Laundry Operator) గా కూడా పని చేస్తున్నారు.

పిల్లలు కాని, పెద్దలు కానీ జబ్బు పడితే వారికి తగ్గే వరకు జాగ్రత్తగా చూసుకుంటూ నర్సింగ్ (Nursing) పని కూడా చేస్తుంటారు కదా!
పిల్లలు స్కూల్లో కానీ, బయట పిల్లలతో కానీ గొడవ పడడమో, లేకపోతే వారిని ఎవరైనా ఏడిపిస్తూ రోజూ విసిగిస్తుంటే దాంతో పిల్లలు ఇంట్లో చురుగ్గా వుండలేరు. ఈ విషయాలు తల్లులకే త్వరగా తెలుస్తుంది.  మెల్లిగా విషయం అడిగి తెలుసుకుని, వారిని దగ్గరకు తీసుకుని, వారి వయసుని బట్టి రక రకాల ఉదాహరణలు ఇస్తూ, కథలు చెబ్తూ, వారికి వారు పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో ధైర్యం ఇస్తూ చెప్పాలి.  లేదా స్కూల్లో వారి ఫ్రెండ్స్ వేరే ప్రదేశాలకు వెళ్ళిపోతున్నా, అనుకోకుండా క్లోజ్ ఫ్రెండ్ ఏదైనా జబ్బు చేసి పోవడమో, ఎక్సిడెంట్ లో పోవడమో జరిగితే వారి దు:ఖం తగ్గే వరకు వారికి ధైర్యం చెబుతూ జాగ్రత్తగా చుసుకోవాలి.  ఇలా వారు కౌన్స్ లర్ (Counselor) చేసే పనిని కూడా చేస్తున్నారు. 
ఈ పనులన్నీ సక్రమంగా జరిగేట్టుగా చూస్తూ ఇంట్లో అందరూ వారి వారి పనులు ఏ ఇబ్బందులు లేకుండా చూసుకుంటుంది కాబట్టి తల్లి ఇంటికి ఒక సి.ఈ.ఓ(C.E.O)
అందరికీ అన్నీ అమర్చి పెట్టడం అయితే చేస్తారు కానీ పిల్లల్ని పికప్ లు, స్పోర్ట్స్ కానీ కళల క్లాసులకి డ్రాప్ చేయడంలో మునిగిపోయిన వారు కారులోనే వారి లంచ్ కానిచ్చేస్తారు, అదీ ఒక ఆపిల్ పండో, అరటిపండో తినేసి.
ఇక బీద వాళ్ల విషయానికి వస్తే తల్లులు ఎంత కష్ట పడి పని చేసినా ఒకోసారి అందరికీ ఒక్క పూట కూడా తినడానికి వుండదు.  అలాంటి సమయంలో తల్లి వున్నదేదో పిల్లలకు పెట్టేసి తను కడుపునిండా నీళ్ళు తాగేసి పడుకుంటుంది.  ఇలాంటి త్యాగాలు చేయడం తల్లులకి మామూలే. 

ప్రతి ఏడాది ఇంటర్నెట్ లో సాలరీ.కామ్ వారు ఒక గృహిణికే తను చేసే పనికి కనక జీతం ఇవ్వల్సి వస్తే ఏడాదికి ఎంత ఇవ్వవలసి వస్తుంది అన్న విషయం మదర్స్ డే సమయానికి విడుదల చేస్తారు.  ఈ ఏడాది ఎంత లెక్క కట్టారో చూద్దామా?  ఒక గృహిణికి ఏడాదికి $118,905 డాలర్లు ఇవ్వాల్సి వుంటుందని నిర్ణయించారు.  ప్రతి ఏడాది తల్లుల పనులు పెరుగుతున్నట్టే ఈ జీతాల లెక్క కూడా పెరుగుతుంటుంది, ఈ ఏడాది చూపించిన సంఖ్య గత సంవత్సరం కన్న $5,000 డాలర్లు ఎక్కువుంది. 
ఎవరైనా ఒక గృహిణి, తల్లి నిస్వార్ధంగా చేసే పనికి లెక్కలు కట్టి జీతాలిస్తారా అని ముక్కున వేలు వేసుకునేవారు చాలామందే వుంటారు.  ఒక తల్లి ఎంత మంది పిల్లలనయినా నిస్వార్ధంగా పెంచే పనికి మనం విలువ కట్టలేము.  ఆమె అనురాగం, ప్రేమల ముందు ఎంత డబ్బు ఇచ్చినా తక్కువే అవుతుంది.  పిల్లల సంతోషం కోసం వారిని విదేశాలకు పంపి, పిల్లలు ఎపుడైనా అమ్మ నీకేం కావాలంటే మీరు మర్చిపోకుండా ఫోన్ చేస్తుండండి చాలు అంటారు. వారు చేసిన పనులకు బదులుగా ఏ తల్లి అయినా ఎపుడైనా ఏదైనా కోరుకుంటుందా?
వూళ్ళో వుంటే అప్పుడపుడు కనిపించడం, ఫోన్ చేసి ఎలా వున్నావమ్మా అని పలకరించడం, మనవలు, మనవరాళ్ళు అప్పుడపుడు కనిపించినా చాలు అనుకుంటారు.  తల్లులు ఏమీ కోరుకోరు ఇలాగే వుండాలి వారి ప్రేమానురాగాలు అనుకుంటారు చాలా మంది.  కానీ ఒకోసారి అవసరం వున్నా, మందులకి కానీ జబ్బు చేసి ట్రీట్మెంట్ కి డబ్బులు అవసరం పడినా కూడా, వృద్దాప్యంలో కొన్ని జబ్బులు వస్తే తగ్గవు ఒకోసారి ప్రాణాంతకం అవుతాయి, అలాంటపుడు పిల్లలు తన దగ్గర వుండాలని ఆ కన్నతల్లి మనసు కొట్టుకుంటుంది కదా!  అలాంటపుడు కుడా ఆవిడ మౌనంగా వుండిపోతే పిల్లలు ఈ పొజిషన్ లో వుండడానికి కారకురాలయిన తల్లికి తీరని బాధే కదా! 
కాబట్టి ఆలోచించండి! ఒక్కరోజు మదర్స్ డే జరుపుకోవడం ఒక్క ఫోన్ కాల్ చేసి చేతులు దులుపుకోవడం అవసరమా, లేక రోజు కాకపోయినా అపుడపుడు వెళ్ళి ఆమెకు కనిపించడమో, ఆమెని తమ దగ్గర తీసుకొచ్చి వుంచుకుని ఆమె రుణం తీర్చుకోవడం మంచి పద్దతో ఆలోచించండి, అఫ్ కోర్స్ ఎంత చేసినా తీరే రుణం కాదు ఇది. 

"అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట..."  "అమ్మ అని కొత్తగా మళ్ళీ పిలవాలని తుళ్ళే ప్రాయమే మళ్ళీ రావాలని...."  "అమ్మా లాంటి చల్లనిది లోకం ఒకటి వుందిలే..." "అమ్మను మించిన దైవం వున్నదా?..."