Facebook Twitter
చిరునామా లేని లేఖ

   చిరునామా లేని లేఖ
                              
                      

డా.ఎ. రవీంద్రబాబు


      
ఎన్ని ఊహలు మనిషిని  నాశనం చేస్తాయో కదా...! అన్నీ అంతమై పోయాక...! నీకోసం నా కలల లోగిలిలో ఓ స్వప్న సౌధాన్ని కట్టాను. ఆకాశానికి భూమికి మధ్య నువ్వూ, నేను మాత్రమే జీవించగల ప్రదేశమది...! నీ నవ్వుల్ని నక్షత్రాలుగా మార్చి ఆ ప్రదేశమంతా వెలుగుల్ని పూయించాను.నీ శరీర కాంతినే సంధ్యకు అలిమి మన ఏకాంతంలో సాంధ్యరాగాన్ని ఆలపించాను. అప్పుడు సుదారాల్లోంచి, పక్షుల కిలకిల శబ్దాల్లోంచి సుతిమెత్తగా షెహనాయ్ మంద్రంగా వినిపిస్తోంది. అక్కడ నువ్వు నేను, సృష్టి సౌందర్య పరిమళం... ధారాపాతంగా కురుస్తున్న వెన్నెల సోన... నేను మాత్రం స్పర్శకు గాఢంగా నిశ్శబ్దాన్ని నేర్పుతున్నాను.
        హటాత్తుగా కళ్లు తెరిస్తే... ఏముంది నా ముందు చీకటి...! నా చుట్టూ చీకటి... నా లోపల చీకటి... చీకటి... చీకటి... ఫెటిళ్ళమనే చీకటి.
    ఏం చెప్పను... ?నువ్వు దూరమైన రోజు నుంచీ ఈ స్వప్నాలు సైతం నన్ను వేధిస్తూనే ఉన్నాయి. ఉరితాళ్లలా మారి నా గుండెనే ఉరి తీస్తామంటున్నాయి. ఆ గుండె నిండా ఉన్నది నీవేగా...! నీ జ్ఞాపకాలేగా...! వాటినీ కోల్పోయి నేనెలా బతకగలను..? ఆఖరకు ఆ కలల్లో కూడా నిన్ను చూసుకునే బాగ్యానికి దూరమవుతానేమో...!!?
        అయినా...! దూరమనే శిక్ష ఇంత బాధను నింపుతుందా...? అసలు ప్రేమంటేనే శాశ్వత వ్యధేమో కదా...! దూరంగా ఉన్నంత సేపూ దగ్గరవ్వాలని, దగ్గరగా ఉన్నంత సేపూ దూరం కాకుడదనీ... బాధ. శాశ్వతంగా దూరమైతే.,.!? ఇలా...! నాలా...!
       ఇప్పుడు నీ గురించి ఏవో కొన్ని అనుభవాలు, అనుభూతులు రాయగలుగుతున్నాను గానీ, పది నిముషాలు గడిస్తే...! నా వల్ల కాదేమో...! ఎందుకంటావా...? ఇట్లానే నా గుండెలోంచి ఏకంగా ఈ అక్షరాల్లోకి దూకేస్తావు. ఇక కాగితం నీ ఆకారంతో నిండిపోతుంది. నా కళ్లు పూర్తి నిమీలితాలవుతాయి. హృదయం బరువెక్కుతుంది. మౌనంగా మారిపోతుంది. అప్పుడు ఇక నానుంచి నేను దూరమవుతాను. మానసికంగా నీలో లీనమవుతాను. అప్పడిక నేనే నువ్వు, నీవేనేను. సృష్టిలో తొలి పరిచయం మనదే కదా...!! ఆ క్షణాల్ని ఎవ్వరితోనూ పంచుకోవాలని ఉండదు. ఏకంగా నాలోనేను మిగిలి, కిమిలి పోవడం తప్ప...!?
       ప్రేమకు... మనిషికి... మనసుకు మధ్య ఈ బంధాల్ని పూర్తిగా విడమరిచి ఎలా చెప్పాలో నాకు ఇప్పడికీ తెలియడం లేదు. కవిత్వాలు, తత్వశాస్త్రాలు వివరించలేదు, బోధించలేదు. అదో ఆంతరంగిక సౌందర్యానికి పరాకాష్ట అయిన వ్యధా చిత్రమేమో...! ఏ చిత్రకారుడూ చిత్రీకరించలేక పోయాడు. అయినా.. ఆస్తి, ధనం, దేహం, వస్తు విపణిలో చిక్కుకున్న ఈ పాడు ప్రపంచానికి చెప్పినా అర్థం కాదు...!! బహుశా ఆత్రేయ గారిని అడిగితే బావుణ్ణు...
     "మనిషి జన్మనిచ్చి మనసు నిచ్చితివయ్యా...
      ఇంతకన్న ఏమికావలియు శిక్ష" అని దేవుడ్నే ప్రశ్నించాడు. నీవు ఎన్ని చెప్పినా నేను దేవుడ్ని నమ్మనన్నప్పుడు... నీకు వచ్చిన కోపం ఇంకా నామదిలో పదిలంగానే ఉంది. గమ్యం సినిమాలో...
      "ప్రేమను ప్రేమించే ప్రేమ
       ప్రేమకై ప్రేమించే ప్రేమను ప్రేమిస్తుంది..." అన్న
 వాక్యాలు నా గుండెను మరోసారి గెట్టిగా చరిచాయి. మరి నా జీవితంలో ఎందుకలా జరగలేదా అని...! అది సినిమా కదా...!!
     అసలు ప్రేమకు మరుపనేది ఉందా అని...?ఉంటే...! సృష్టి ప్రారంభం నుంచి ఇన్ని శరీరాలు, ఇన్ని ఆత్మలు, ఇన్ని హృదయాలు దానిలోపడి భగ్నమై... చివరకు బూడిదై... ఓటమిపాలై... ఇలా ప్రేమను బాధించేవి కావేమో కదా...
       రోజులు నాకు మౌనంగా భారంగా దొర్లుతున్నాయి. క్షణం క్షణం... నీ అధరం నుంచి వెలువడే చిరునవ్వులో కాలి బూడిదై పోవాలనే తపన. నీ ఎదురుగా నిన్నే చూస్తూ... నీ మాటల్లో మునుగుతూ... కాలాన్ని కాంతివంతంగా గడిపిన రోజులన్నీ మెదులుతున్నాయి. నువ్వు చెప్పినట్లే జీవిస్తున్నా మరణిస్తూ... నీ మాటల్ని గుర్తు చేసుకుంటూ... ఇష్టం లేక జీవితాన్ని భరిస్తూ... కొన్నిటిని ఎవరితోనూ పంచుకోలేం కదా...!  వాటిని బతుకు చివరవరకు గుండె కొసన మోయాలి. నీ జ్ఞాపకాలకున్న శక్తి అటువంటిది మరి. నువ్వన్న మాట ఈ క్షణానికీ గుర్తొస్తుంది... "మరీ అంత సున్నితంగా మనసు ఉండకూడదురా...?" ఏం చేయమంటావు...? నాకు చేతకావండ లేదు. నా మనసుకు మరోలా ఉండలేదు. క్షమించు ఇప్పటికి మాత్రమే...