" ఏడు రోజులు " 37వ భాగం
రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి
అంతలోనే ఆ ఇంటివాళ్ళంతా ఒక్కొక్కరిగా ఆ గదిలోకి రాసాగారు. అందరిలోనూ హడావిడి... కంగారు! కొందరిలో తోడుగా కోపం కూడా!
భవానీశంకర్ ఎవ్వరికీ భయపడలేదు. తుపాకి ఎత్తి అప్రమత్తుడయ్యాడు. అందరూ అతడివైపు భయంగా, నిస్సహాయులుగా చూస్తుండిపోయారు.
"ఎవ్వరైనా నాకు అడ్డువస్తే కాల్చిపడేస్తాను" భయపెడుతూ క్రమంగా అందర్నీ దాటుకుని వెలుపలికి నడిచాడు. భయపడుతూనే కొందరు అతడి వెంటే వచ్చారు.
ఆ పెద్ద బంగ్లాలోని గదుల్ని దాటి పూర్తిగా బయటకు వెళ్ళేవరకు తుపాకీ గురిపెట్టే వున్నాడు భవానీశంకర్. బయటకు వెళ్ళాక ఒకపక్కగా పార్క్ చేయబడిన యమహా కనబడింది.
ఒక చేత్తో తుపాకి ఎక్కుపెట్టి మరోచేత్తో యమహా స్టార్ట్ చేసుకుని, రివ్వున ముందుకు దూసుకుపోయాడు అతడు. జరిగిన అనూహ్యపరిణామానికి వాళ్ళంతా మరబొమ్మల్లా నిలబడిపోయారు.
భవానీశంకర్ మధ్యలో ఎదురయ్యింది పోలీస్ వ్యాన్. షార్వాణీ ధరించి, టోపీ పెట్టుకుని, అచ్చు ముస్లిం కుర్రాడిలా తయారైవున్న అతగాడు... పోలీసుల్ని చూసి కూడా కించిత్ భయపడలేదు. బండిని రైల్వేస్టేషన్ వైపు పోనిస్తూ "తండ్రీ భగవంతుడా... నువ్వే నన్ను కాపాడాలి" ఆదుర్దా కొద్దీ అనుకున్నాడు.
బండి పదిహేను నిముషాల్లో రైల్వేస్టేషన్ చేరుకుంది. ప్లాట్ ఫామ్ పై ఓ రైలు చిన్నజర్క్ తో కదులుతోంది. అది ఎక్కడికి వెళ్ళే రైలు అన్న సంగతి గురించి ఆలోచించలేదు భవానీశంకర్. బండిని... రైఫిల్ ను అక్కడే వదిలేసి, వేగంగా పెరుగెట్టుకువెళ్ళే రైలు ఎక్కేశాడు.
రైలు వేగాన్ని పుంజుకుంది. తల పట్టుకుని కూర్చుండిపోయాడు భవానీశంకర్.
అతడు కూర్చున్న బోగీలోనే ఆ చివర్న గౌసియా... కమలాకర్ లు వున్నారు. కమలాకర్ న్యూస్ పేపర్ చదువుతున్నాడు. గౌసియా పడుకుని ఏదో ఆలోచిస్తోంది.
"గౌసియా..." కాసేపటి తర్వాత పిలిచాడు కమలాకర్.
"ఊ..." పలుకుతూ చెప్పింది గౌసియా.
"అక్కడికి వెళ్ళాక మరెక్కడికో వెళ్తానని వాళ్ళను ఇబ్బంది పెట్టొద్దు" చెప్పాడు.
అతడు ఆ మాట అనగానే ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
"ఏడ్వొద్దు. వాస్తవం చెబుతున్నాను. మమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లుగా వాళ్ళను ఇబ్బంది పెడితే వాళ్ళు నిన్ను విసుక్కోవచ్చు. ఇందువల్ల నిన్ను పట్టించుకునే వాళ్ళే లేకపోవచ్చు" అన్నాడు అతడు.
"మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు నాది. డబ్బులు ఎవ్వరివైనా కావొచ్చు. నేను హైద్రాబాద్ వెళ్ళడం అనవసరపు ఖర్చే అవుతుంది. కానీ నాకు ఇక్కడ వుండాలని లేదు. మీరంతా నా స్వంత కుటుంబసభ్యుల్లా వుంటున్నప్పటికీ, డాక్టర్ బాబు ఏ క్షణాన నాపై కోప్పడ్తాడో నన్న భయం... నన్ను ఇంకెవరైనా మోసం చేసి తీసుకువెళ్తారేమోనన్న భయం... నన్ను క్షణక్షణం వెంటాడుతున్నాయి. తోడుగా భవానీశంకర్ కోసం ఆశపడి, అడియాశను అందుకున్నాను కాబట్టి... అక్కడ ఎంతమాత్రం నిలవబుద్ధికావడంలేదు" చెప్పుకుపోయింది గౌసియా.
"నేను నిన్ను అర్థం చేసుకోగలను గౌసియా! కాపోతే నేను చెప్పేదే నీవు అర్థం చేసుకోవడంలేదు.
నీది పరిస్థితుల్ని అర్థం చేసుకోలేని అమాయకత్వం. నీ వయసు పిల్లలు చాలామంది ఎంతో తెలివిగా, ఎంతో చలాకిగా, ప్రవర్తిస్తుంటారు. కానీ నీలో ఆ తెలివి, ఆ చలాకీతనం ఎంతమాత్రం లేవు. నీవు చాలా అమాయకురాలివి. ఈ అమాయకత్వంతో నీవు నీ ఇష్టప్రకారం ప్రవర్తించవద్దు. వెళ్ళినచోట వాళ్ళకు అనుగుణంగా మసులుకోవాలి. వాళ్ళు చెప్పినట్లుగా వినాలి" ఆత్మీయంగా చెప్పాడు అతడు.
"అట్లాగే" తలాడించిందామె.
కమలాకర్ ఇంకేం చెప్పలేదు. గౌసియా కూడా ఇంకేం మాట్లాడలేదు. కాసేపటి తర్వాత చిటికెనవేలు చూపిస్తూ లేవబోయింది గౌసియా. ఆసరాపట్టాడు కమలాకర్.
కమలాకర్ తోడుతో టాయ్ లెట్ వైపు నడిచింది గౌసియా. భవానీశంకర్ కూర్చుని వున్న వరుసముందు నుండే ఆమె నడిచివెళ్ళింది. కానీ అతడు అలాగే తల పట్టుకుని కూర్చుని వున్నందున, ఆమెను గమనించలేదు.
ఆమె టాయ్ లెట్ కువెళ్ళి వస్తుంటే అతడు అలాగే కూర్చుని వున్నాడు. ఆమె కూడా ఎవరివైపూ చూళ్ళేదు. కాగా, ఆమె ఆ వరుస దాటి వెళ్ళబోతుండగా, "హమ్మా హమ్మయ్య" అనుకుంటూ తలెత్తాడు భవానీశంకర్. కానీ అతడు గౌసియావైపు చూళ్ళేదు. కాపోతే అతడు ద్వారం పక్కనే కూర్చుని వున్నందున, అతడి గొంతు ఆమె చెవిలోకి చేరగానే ఆమె అడుగులు అప్రయత్నంగా ఆగిపోయాయి.
తల తిప్పి ఆదుర్దాగా ప్రయాణికుల్ని గమనించింది. భవానీశంకర్ ను చూడగానే ఆమె కనుబొమలు ముడిపడ్డాయి.
"నువ్వేనా?"
"అగ్నిపర్వతపు అంచులోని హిమశిఖ రానివేనా?"
ముస్లిం యువకుడిలా వేషం ధరించిన భవానీశంకర్ వైపు ప్రశ్నార్థకంగా చూస్తోందామె. కమలాకర్ గౌసియావైపు అర్థంకానట్లుగా చూస్తుండిపోయాడు.
"శం...క...ర్..." కొన్నిక్షణాల తర్వాత మెల్లగా పిలిచిందామె.
అతడు చప్పున తలతిప్పి చూసి, ఆ వెంటనే "గౌసియా..." అంటూ కళ్ళింత చేసి ఆత్రంగా లేచి వచ్చాడు.
ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆనందమో... ఆవేదనో... అర్థంకాని తనమో... తెలీదుగానీ, ఆమె కళ్ళల్లో సకలభావాలు ఇమిడిపోయాయి. ఏదో ఆవేశం కూడా ఆమెలో పొంగిపొర్లుతుంటే అతడ్ని చూస్తూ అలాగే నిలబడలేకపోయింది.
భవానీశంకర్ కూడా ఎంతోసేపు ఆమెను చూస్తూ నిలబడలేకపోయాడు.
"గౌసియా... " మరోసారి పిలుస్తూ చప్పున వచ్చి ఆమె చేతుల్ని పట్టుకున్నాడు. అతడి కళ్ళల్లోనూ నీళ్ళు... ఆమె మీది అభిమానానికి, ప్రేమకి, ప్రతీకలుగా కనబడుతున్నాయి.
ఆలస్యం అయిందేమో అని అటు తొంగి చూసిన కమలాకర్ కి అంతా అర్థమైంది. ఇద్దర్నీ తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూ, "రామ్మా గౌసియా..." అన్నాడు.
కమలాకర్ వైపు అప్పుడు చూశాడు భవానీశంకర్. కమలాకర్ ని చూడగానే అతడిలో భయం పెరిగింది. చప్పున గౌసియాకు దూరం జరిగాడు.
"భయపడొద్దు..." అన్నాడు కమలాకర్.
భవానీశంకర్, కమలాకర్ ని చూడగానే ఎందుకు భయపడుతున్నాడో అర్థంకాక ఇద్దరివైపూ ఒకసారి కంగారుగా చూసి, "కమలాకర్ సారు చాలా మంచివాడు" చెప్పింది గౌసియా.
భవానీశంకర్ మనసు అప్పుడు కుదుటపడింది. ముగ్గురూ పక్క వరుసలోకి నడిచి కూర్చున్నారు.
గౌసియా పడుకుంటే ఆమె తల దగ్గరే కూర్చుని ఆమెవైపు అర్థంకానట్లుగా చూశాడు.
"నేను చచ్చి బతికాను" అతడి చూపుల్ని అర్థం చేసుకుంటూ తొలిమాటగా మాట్లాడింది గౌసియా.
ఆమాత్రానికే భరించలేని వాడిలా గౌసియా చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కాడు భవానీశంకర్.
రైలు సికింద్రాబాద్ స్టేషన్ ని సమీపిస్తోంది. అంతవరకూ గౌసియా పడిన అవస్థల్ని పూర్తిగా తెలుసుకున్న భవానీశంకర్ మనిషి కాలేకపోయాడు.
అతడిది గమ్యం తెలియని పయనం. ఆమె మాత్రం అక్కడ దిగాల్సివుంది. కానీ అతడ్ని వదిలి ఆమె దిగలేకపోతోంది.
"గౌసియా! నీవు వెళ్లక తప్పదు. కోలుకునే వరకూ మోహన్ వాళ్ల హాస్పటల్ లోనే వుండు. ఆ తర్వాత నీవు కోరుకున్న వాడివెంట వెళ్ళిపోదువుగాని." అన్నాడు కమలాకర్.
"వద్దు. నేను అక్కడికి వెళ్తే నాగురించి పోలీసులకి తెలుస్తుందేమో అనిపిస్తోంది. అందుకే నేను తన వెంటే వెళ్లిపోతాను." భవానీశంకర్ చేతుల్ని గట్టిగా పట్టుకుంది గౌసియా.
"గౌసియా గురించి బయటకి తెలిస్తే తన ప్రాణానికి ముప్పు కలగవచ్చు... కలగకపోవచ్చు. కానీ ముస్లింలు మాత్రం ఆమెను తిరిగి నాకోసం ముస్లింలు మాత్రం ఆమెను తిరిగి నాకోసం రానివ్వరు. మేమిద్దరం ఎక్కడికైనా వెళ్లిపోతాం. ఈ ప్రపంచానికి దూరంగా వెళ్లిపోయి ఏమతం, ఏకులం లేకుండా మనసున్న మనుషులుగా బతుకుతాం. మాకు అండగా నిలవండి." చేతులు జోడించాడు భవానీశంకర్.
"గౌసియాను ఈ పరిస్థితుల్లో వెంట తీసుకు వెళ్లి కష్టాలుపడలేవు నువ్వు. అయినా మీ ఇద్దరూ కలిసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? నీవు మగపిల్లాడివి.... ఎక్కడైనా బతకగలవు. కానీ తను ఆడపిల్ల. భద్రత లేకుండా ఈ సమాజంలో జీవించడం చాలా కష్టం." అన్నాడు కమలాకర్.
మరేం మాట్లాడలేకపోయాడు భవానీశంకర్. నిలువునా గాయాలతో వున్న తన ప్రియురాలిని వేదన నిండిన కళ్ళతో చూస్తుండిపోయాడు.
"మోహన్ వాళ్ల కుటుంబం చాలా మంచి కుటుంబంలా వుంది. వాళ్లు మిమ్మల్ని అర్థం చేసుకోగలరు. కాబట్టి గౌసియా తప్పకుండా నీకోసం వస్తుంది. ఈ విషయంలో నేను హామీ ఇవ్వగలను బెంగాపెట్టుకోవద్దు.
నీవు మెడ్రాస్ వెళ్లిపోయి ఏదైనా పని చేసుకో. అక్కడ నీవు సయ్యద్ పాషాగానే బతుకు. అదే పేరుతో నీ చిరునామా తెలుపుతూ నాకు ఉత్తరం రాయి. నీవు ఇకనుంచీ నా స్వంత తమ్ముడివే. కాబట్టి ఏ అవసరం వచ్చినా సంకోచంలేకుండా నాతో చెప్పు. నాకు చేతనైన సహాయం చేస్తాను.
ముఖ్యంగా నీవు చేసే పని ఎంతచిన్నదైనా కావచ్చు. ఆపని నిన్ను ప్రయోజకుడిగా మారిస్తే నీ పెళ్లాన్ని ధైర్యంగా పోషించగలవు. లేదంటే ఒక్క నిముషాన్ని వెనకేసుకోవడానికి నీవు ఎన్నో అవస్థల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీ భవిష్యత్తుకోసం ఒక స్థానాన్ని సంపాదించుకో. ఆతర్వాత గౌసియాను నేనే స్వయంగా తీసుకువచ్చి నీకు అప్పచెబుతాను.... సరేనా!" చెప్పుకుపోయాడు కమలాకర్.
కాసేపు ఆలోచించి 'సరే' అన్నట్టుగా తలాడించాడు భవానీశంకర్.
రైలు సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుంది. తన ప్రియుడు తనకు దూరమైపోతున్నాడన్న బాధ ఆమెను ఇక నిలవనీయలేదు. చిన్నపిల్లలా వెక్కివెక్కి ఏడవసాగింది. భవానీశంకర్ లోనూ గొంతులోనే వుంది దుఅఖం. కానీ బలవంతాన ఆపుకుంటూ ఆమెకు ధైర్యం చెప్పాడు.
"మనం తప్పకుండా కల్సుకుంటాం. ఈ ఎడబాటు కొన్నాళ్ళే!"
రైలు కొంతదూరం ముందుకు సాగిపోయి ఆగింది.
కమలాకర్ వెళ్లి ఆటోరిక్షా తీసుకువచ్చాడు.
భవానీశంకర్ జాగ్రత్తగా గౌసియాను ఆటో ఎక్కించాడు.
వాళ్ళ అనురాగాన్ని చూస్తూ నిల్చున్న కమలాకర్... భవానీశంకర్ భుజాన్ని తట్టి ధైర్యం చెబుతూ, "మీ ప్రేమ గెలిచింది. కానీ పరిస్థితులు ప్రతికూలంగా వున్నాయి. అనుకూలం అయ్యేవరకు ఓపిక అవసరం" అని, తన ప్యాంటు జేబులోంచి రెండువందల రూపాయలు తీసి అందివ్వబోయాడు.
"వద్దు" అన్నాడు భవానీశంకర్.
"ఫర్వాలేదు తీసుకో" అంటూ రెండువందల రూపాయల్ని భవానీశంకర్ చేతికి అందించి, ఆటో క్కి కూర్చున్నాడు కమలాకర్.
మరుక్షణం ఆటో ముందుకు కదిలింది. కదిలిన ఆటోలోంచి వీడ్కోలుగా చేయి వూపింది గౌసియా. భవానీశంకర్ కూడా తన చేతిని గాలిలోకి ఎత్తి వూపాడు.
వెళ్తున్న ఆటోనే చూస్తూ అలాగే చేయి ఊపుతూ నిలబడిపోయాడు భవానీశంకర్! *
