" ఏడు రోజులు " 34వ భాగం
రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి
మెల్లగా ముందుకు నడవసాగింది గౌసియా. ఆమె లోపలికి వెళ్ళిందల్లా, గౌసియా రావడం ఆలస్యం కావడంతో మళ్ళీ బయటకు వచ్చి గౌసియా పరిస్థితిని గమనించి, దగ్గరగా వచ్చి, తన చేయిని ఆసరాగా అందించింది.
ఇంట్లోకి వెళ్ళాక గౌసియాకు వాలు కుర్చీ చూపిస్తూ, "కూర్చో" అంది.
"ఆ! ఇప్పుడు చెప్పు?" గౌసియా కూర్చోగానే అడుగుతూ వెళ్ళి అక్కడున్న మరో చెయిర్ లో కూర్చుందామె.
గౌసియా తన అసలు పరిస్థితి గురించి చెప్పుకోలేదు. కేవలం హాస్పిటల్లో అతగాడు తనను మోసం చేసి తీసుకువచ్చిన కథను మాత్రం చెప్పుకుంది.
"అసలు మీది ఏవూరు? నువ్వెవరు?" అడిగిందామె.
"మాది హైద్రాబాద్. మా అమ్మా, నాన్న అక్కడే వుంటారు" చెప్పింది గౌసియా.
"ఇక్కడికి ఎలా వచ్చావు?"
గౌసియా కాసేపు మౌనం వహించి, ఆ తర్వాత ఇక తప్పదన్నట్టుగా తన కథను విపులంగా చెప్పుకుంది.
"చ్చొ చ్చొ చ్చొ" గౌసియా కథ విని జాలి పడిందామె. గౌసియా కళ్ళనీళ్లు తుడ్చుకుంది.
"ఈ చిన్నవయసులో ఆ ప్రేమలు ఎందుకమ్మా నీకు? నీది చదువుకునే వయసు. చదువుకుని జీవితంలో స్థిరపడ్డాక ప్రేమిస్తే ఆ ప్రేమకు అర్థం వుంటుంది. కాని ఈ ఎదిగీఎదగని వయసులో నీలో ప్రేమ కలిగింది అంటే, అది ప్రేమ కాదు. తెలియని తనం! ఆకర్షణ!
"ఈ ఆకర్షణలో మునిగి తెలియనితనాన్ని తెలిసినతనం అనుకుంటున్నావు నువ్వు! ఏదోలే...జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు నీ జీవితం సుగమం కావాలి. అంతేకదా?" అందామె.
అవును అన్నట్లుగా తలాడించింది గౌసియా.
"ఇంకో విషయం! ప్రేమ కారణంగానే నిన్ను ప్రేమించిన కుర్రాడు హత్యకేసులో ఇరుక్కున్నాడు. ఇందుకు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో క్షోభను అనుభవిస్తుండవచ్చు! ఒక్కసారి ఈ విషయం గురించి వాస్తవంగా ఆలోచించు"
"నిజమే" తలాడిస్తూనే అంది గౌసియా.
"మీ నాన్న చనిపోవడానికి కూడా మీ ప్రేమే కారణం! మీ నాన్న మూర్ఖుడు కావొచ్చు. దుర్మార్గుడు కావొచ్చు. కాని అతడికీ ప్రాణాలమీద తీపి వుంటుంది. ఆ తీపిని నీ ప్రియుడు చంపేశాడు" అని కాసేపాగి, "నువ్వు ఏమైనా అనుకో పాపా! మీ నాన్నను చంపేసి ఆ కుర్రాడు మంచిపనిచేశాడు. నీ తండ్రిలాంటివాళ్ళు బతకడంకంటే చావడమే మేలు! మీ నాన్నకు బాధ్యతలు వున్నాయి. కాని ఆ బాధ్యతల్ని నెరవేర్చుకుంటాడనే నమ్మకం మీ నాన్న ఒకవేళ బతికివున్నా నాకు లేకపోయేది"
"అవును"
"నిన్ను అమ్మివేసినందుకు మీ నాన్న చేసిన పనికి కూతురిగా ఇంకా ప్రేమిస్తున్నావో తెలీదు గాని... మీ నాన్నను చంపినందుకు ఆ కుర్రాడ్ని అభినందిస్తున్నాను. ఆ కుర్రాడి పరిస్థితికి ఒక తల్లిగా బాధపడుతున్నాను"
"...."
"అవునూ... ఇప్పుడు నీవు ఎక్కడికి వెళ్తావు? మీ ఇంటికి ఎలాగూ వెళ్ళలేవు. ఎవరైనా బంధువులుగాని, స్నేహితులుగాని, నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు వున్నారా?" అడిగిందామె.
"నేను ఎవ్వరి ఇంటికీ వెళ్ళను. నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసిన మోహన్ భయ్యా వాళ్ళ ఇంటికే వెళ్తాను" గౌసియా అంటుంటేనే ఇంటి యజమాని వచ్చాడు. రాగానే గౌసియావైపు ఎవ్వరు అన్నట్లుగా చూశాడు.
"మన అనుమానం నిజమేనండీ" రాగానే భర్తతో అందామె.
"అవునా?" అంటూ ఆమెకు ఎడంగా వున్న చెయిర్ లో కూర్చున్నాడు అతడు. అతని ముఖంలో ఏదో గొప్ప నిజాన్ని తెలుసుకున్నంత ఆసక్తి.
"ఈ దరిద్రపు వెధవమీద మనకు నెలరోజులనుండి అనుమానంగానే వుంది. ఇక ఈరోజు మన అనుమానాన్ని నిజంచేస్తూ ఈ పిల్లను హాస్పిటల్లో వుంటే బలవంతంగా ఎత్తుకువచ్చాడు. ముదనష్టపు వెధవ... వాడి పిండా కూడు పందులు తినుగాకా!" ఆమె గొంతులో ఆవేశం.
"నాకు ఈ మధ్యాహ్నమే వాడిపై అనుమానం వచ్చింది. కాని పెద్దగా పట్టించుకోలేదు..." అన్నాడు అతడు.
"వాడ్ని ఈ రాత్రికే ఇల్లు ఖాళీ చేయించేద్దాం! ఇట్లాంటి మోసాలు హైదరాబాద్ వంటి మహానగరాల్లోనే అనుకున్నాం. కాని ఇలాంటి వెధవలు తగలబడితే మన వూళ్లు కూడా పాడైపోతాయి" ఆమెలో ఆవేశం తగ్గలేదు.
"ఇల్లు ఖాళీ చేయించడం ఒక్కటే కాదు, వాడ్ని పోలీసులకు పట్టివ్వాలి" అతడిలో కూడా ఈసారి ఆవేశం.
"అవును అవును" దరువేసిందామె.
కాని రాత్రి ఎనిమిదిగంటలు కావొచ్చినా కూడా, గౌసియాను తెచ్చిన ఆ వ్యక్తి ఇంటికి రాలేదు. తొమ్మిది కావొస్తుంది అనగా ఐదారుమంది స్నేహితులతో కలిసి వచ్చాడు. అప్పటికి గౌసియా వాళ్ళ చల్లని నీడలో సేదతీరి పడుకునివుంది.
"వాడి దగ్గరకు వెళ్ళిరానా?" భార్యను అడిగాడు అతడు.
"ఇద్దరం కల్సివెళ్దాం" అందామె.
ఇద్దరూ కలిసి వెంటనే బయటకు నడిచారు. వాళ్ళు వెళ్లేసరికి తాగుతూ కూర్చుని వున్న మిత్రబృందం ఉలిక్కిపడి చూసింది.
"మా ఇంట్లో వున్నప్పుడు మా కుటుంబ సంభ్యుల్లో ఒకరిగా వుండాలి. కాని ఇదేంటి శ్యామ్?" అన్నాడు అతడు.
"ఆ!" ఉలిక్కిపడ్డాడు శ్యామ్ ఉరఫ్ రమణ.
"మాకు ఇలాంటి పద్ధతులు నచ్చవు" అందామె.
"మీరు ఏం మాట్లాడ్తున్నారు ఆంటీ... నాకేం అర్థం కావడంలేదు" రమణ అంటుంటేనే అతడి మిత్రులు మందుసీసాల్ని తీసి పక్కకు పెట్టేశారు.
"అన్నీ తెలిసాకే మాట్లాడుతున్నాం" ఇంటి యజమాని నిష్టూరంగా అంటుంటేనే "ఈ రాత్రిదాకా కూడా నువ్వు మా ఇంట్లో వుండడానికి వీల్లేదు. వెంటనే వెళ్ళిపో" కోపంగా చెప్పిందామె.
"అదేం ఆంటీ?" విస్మయంగా చూశాడు రమణ.
"ఏంలేదు! నీలాంటివాళ్ళకు ఎలా బుద్ధి చెప్పాలో మాకు బాగా తెలుసు" అంటూ వెంటనే బయటకు నడిచాడు అతడు. వెనకే నడిచింది భార్య.
"ఏంట్రా? మన కొంప మునిగేలా వుంది?" వాళ్ళు వెళ్ళిపోయాక మిత్రులకు మాత్రమే వినబడేలా అన్నాడు రమణ.
"వెళ్ళిపోదాం పదరా" వెంటనే ఒక మిత్రుడు సలహా ఇచ్చాడు.
"పోరా! వీళ్ళు మనల్ని ఏం చేస్తారు?" ఇంకో మిత్రుడు అన్నాడు.
"మనల్ని ఏంచేయరు? వీడ్ని చేస్తారు" మరో మిత్రుడు రమణ భుజం పట్టుకున్నాడు.
"అందుకే పదరా" అంటూనే లేచి నిల్చున్నాడు రమణ.
అంతలోనే ఆ వీధిలోని కొందరు పెద్దమనుషుల్లాంటి వ్యక్తుల్ని వెంటేసుకుని అక్కడికి వచ్చాడు ఆ ఇంటి యజమాని. వెంటే అతడి భార్య కూడా వుంది.
వాళ్ళను చూడగానే ప్రాణం పోయినంత పనయ్యింది రమణకు. అందర్నీ ఒకమారు చూసి, ఆ వెంటనే అక్కణ్ణుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు.
అతడి ప్రయత్నం విఫలమైంది. గౌసియా ప్రస్తావన తీసుకువచ్చి అందరూ అతడ్ని చివాట్లు వేశారు. తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయబోయాడు అతడు.
"పాపం అని పాముకు పాలుపోస్తే, పగతో కోరలు చాచిందంట. నీ సంగతీ అలాగే వుంది.
"ఆ పిల్లను నేను నిజంగానే హైదరాబాద్ తీసుకువెళ్ళాలనుకున్నాను. కాని నా మంచితనాన్ని ఆ పిల్ల గుర్తించలేదు"
"చాల్లేవయ్యా! నీమీద, నీ ప్రవర్తనమీద మాకు ఎప్పటినుండో అనుమానంగా వుంది. నీలాంటివాళ్ళను వూరికే వదిలిపెట్టకూడదు. పోలీసులకి పట్టించి చర్మం వొలిపించాలి" ఒక పెద్దమనిషి అన్నాడు.
"చర్మం వొలిపించడం ఒక్కటే కాదు, వీడికో వైన్ షాప్ వుందికదా, దాన్ని మొత్తం తగలబెట్టేద్దాం" ఇంకో పెద్దమనిషి అన్నాడు.
మరో పెద్ద మనిషి ఏంమాట్లాడకుండా వేగంగా రమణవైపు కదిలి, అనూహ్యంగా అతడి కాలర్ పుచ్చుకుని చెంప పగలగొట్టాడు. అతడి అహం దెబ్బతింది. తట్టుకోలేకపోయాడు. తనని కొట్టిన ఆ పెద్దమనిషిని పళ్లు కొరుకుతూ రౌద్రంగా చూస్తూ వెనక్కి నెట్టేశాడు.
ఆ తోపుకు ఆ పెద్దమనిషి వెల్లకిల్లా పడిపోయాడు. అతడు ఆ వీధి అంతటికే కాదు, వూర్లో కూడా గౌరవమైన వ్యక్తి. అంతటి వ్యక్తినే రమణ అలా నెట్టడాన్ని ఎవ్వరూ సహించలేకపోయారు. అందరూ ఒక్కుమ్మడిగా రమణమీదకు ఎగబడి దేహశుద్ధి చేయడం మొదలెట్టారు. అందులో భాగంగా అతడి మిత్రులు కూడా తన్నులు తిన్నారు.
"పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయండి" ఎవరో అన్నారు. ఆ మాట అలా వెలువడిందో లేదో ఇలా ఓ కుర్రాడు పరుగున బయటకు వెళ్ళాడు.
పదిహేను నిమిషాల్లో పోలీసులు వచ్చారు. రమణను అతడి మిత్రులను పట్టుకునివెళ్ళారు. జరిగినదంతా చూడగానే గౌసియా కాళ్ళూ చేతులు వణకనారంభించాయి.
"గురుడికి మంచి గుణపాఠం జరిగింది" అంటూ తన ఇంట్లోకి వచ్చాడు యజమాని.
"ఇప్పుడే కాదండీ, నెలరోజుల కిందట కూడా ఎవరో అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చాడంట" వెనకేవస్తూ అంది.
"ఎప్పుడు?" అతడు అర్థంకానట్టుగా చూశాడు భార్యవైపు.
"మనం బుచ్చిబాబు పెళ్ళికని విజయవాడ వెళ్ళినప్పుడు" చెప్పింది భార్య.
"అలాగా! ఎవరు చెప్పారు ఈ సంగతి?"
"ఇప్పుడు కామాక్షమ్మ చెప్తోంది"
"అందుకే తగిన శాస్తి చేశాంకదా" అతడు అంటుంటేనే పొరుగింటి విమల హడావిడిగా వచ్చింది.
"ఏంటి వొదినా? మీకు ఇంతయినా బుద్ధివుందా? ఆ రౌడీ వెధవలతో కల్పించుకోవడం ఎందుకు? ఈరోజు వాడ్ని పోలీసులకి పట్టిచ్చామని కాదు, రేపొద్దున కక్షగట్టి వాడు మనల్ని ఏమైనా చేస్తే?" రాగానే కంగారుగా అంది.
"వాడు మనల్ని ఏంచేస్తాడు?" అన్నాడు అతడు.
"అలా అనుకోవద్దు అన్నయ్యా! రౌడీనాయాళ్ళు పాముల్లాంటి వాళ్లు. ఎక్కడ పొంచివుంటారో తెలీదు. అయినా మీకు సంబంధంలేని విషయంలో కల్పించుకున్నారు. నాకు భయంగా వుంది" అంది విమల.
"సంబంధంలేని విషయం ఎందుకు అవుతుంది? మా ఇంట్లో అద్దెకు వుంటూ చేయరాని పనులు చేశాడు కాబట్టే కల్పించుకున్నాం" అన్నాడు అతడు.
"ఏమో అన్నయ్యా! వాడ్ని భయపెట్టి వదిలేసివుంటే సరిపోయేది. కాని ఏకంగా పోలీసులకు పట్టిచ్చారు? మీరు కాబట్టి అలా చేశారు. నేనైతే నాకెందుకొచ్చిన గొడవ అంటూ ఇల్లు మాత్రం ఖాళీ చేయించి వూరుకునేదాన్ని! అంతేకదా. తనకుమాలిన ధర్మంలేదు" అంటూ గౌసియా వైపు చూసి, "ఈ అమ్మాయేనా?" అడిగింది విమల.
"ఏమ్మా... ఏ తల్లి బిడ్డవోగాని, నీకోసం వీళ్ళు ఇంత హైరానా పడిపోయారు. మున్ముందు ఎన్ని కష్టాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందో ఏమో?" అంటూ గౌసియాకు చేరువగా వెళ్ళింది విమల.
గౌసియా పడుకున్నదల్లా లేచి కూర్చోడానికి ప్రయత్నించింది. "ఫర్వాలేదులే... పడుకో" అంటూ మరేదో మాట్లాడబోయింది విమల. అంతలోనే బయటనుండి పిలుస్తూ వచ్చింది ఆమె కూతురు. "వస్తున్నాను" అంటూ ఆ వెంటనే వెళ్ళిపోయింది విమల.
"చూడమ్మాయీ! ఎవరో ఏదో అంటున్నారని నువ్వు బాధ పడవద్దు. నీవు మా కూతురులాంటిదానివి" విమల వెళ్ళిపోగానే గౌసియాతో అన్నాడు అతడు.
"సరే" అన్నట్లుగా తలాడించింది గౌసియా.
