Facebook Twitter
" ఏడు రోజులు " 24వ భాగం

" ఏడు రోజులు " 24వ భాగం

 

 

 

రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి

 

 

వెళ్లను" అంది గౌసియా.

    "నాకు కొద్దిగా పని వుందమ్మా! ఆ పని అయ్యాక వెంటనే వస్తాను" అన్నాడు ఫాదర్.

    "తొందరగా రావాలి" అంది గౌసియా.

    "వస్తాను"

    గౌసియా ఇంకేం మాట్లాడలేదు. కానిస్టేబుల్ వెంట బయటకు నడిచింది.

    "ఈ అమ్మాయి ఎక్కువసేపు ఇక్కడ వుంటే నిజాన్ని ఎట్లాగయినా తెలుసుకుంటుంది. ఈ కానిస్టేబుల్స్ కాసేపు వూరుకోండయ్యా అంటే విన్పించుకునేట్టులేరు. తను ముందే మానసికంగా బలహీనురాలు. అందుకే స్టేషన్ కు పంపిస్తున్నాం" వెళ్తున్న గౌసియానే చూస్తూ పక్కన నిల్చునివున్న ఒక పత్రికా విలేకరితో అన్నాడు ఫాదర్.

    "ఈరోజు కాకపోయినా రేపైనా నిజం తెలుస్తుందిగా ఫాదర్?" అన్నాడు విలేకరి.

    "నిజం తెల్సినా భరించుకునేలా రేపటివరకు అమ్మాయిని ప్రిపేర్ చేస్తాం" అన్నాడు ఫాదర్.

    అప్పటికి కానిస్టేబుల్ తో కలిసి బయటకి నడిచింది గౌసియా. వెనకే మరో కానిస్టేబుల్ వచ్చాడు. ఇద్దరితో కలిసి పోలీసుజీపులో స్టేషన్ కి బయలుదేరిందామె. మధ్యలోకి వెళ్లాక వెనకసీట్లో కూర్చుని వున్న కానిస్టేబుల్ అడిగాడు.

    "అమ్మాయీ! నీవు ప్రేమలో పడ్డావా?"

    "అ...వు...ను" కొద్దిగా ఇబ్బందిపడింది గౌసియా.

    "ఆ కుర్రాడు ఏం చేస్తుంటాడు?"

    "చదువుకుంటున్నాడు"

    "ఏంటో ఈ కాలం పిల్లలకు ఇంత వయసు వచ్చిందో లేదో అప్పుడే తహతాహలు మొదలౌతాయి" తనలో తానే గొణుక్కున్నాడు కానిస్టేబుల్.

    జీపు పోలీస్ స్టేషన్ ముందు ఆగింది. కానిస్టేబుల్స్ తో పాటుగా జీపుదిగి స్టేషన్ లోపలికి నడిచింది గౌసియా.

    "నీకేం భయంలేదు. ధైర్యంగా వుండు" డ్రైవ్ చేసిన కానిస్టేబుల్ ఆమె భుజాన్ని తడుతూనే గట్టిగా నొక్కాడు.

    ఆమె అతడిని పెద్దగా పట్టించుకోలేదు. వెళ్లి అక్కడ కుర్చీలో ఒక పక్కగా కూర్చుంది.

    "నీకేం అవసరం వచ్చినా నాతో చెప్పు" ఆమె వీపు నిమిరాడు అతడు.

    "సరే" తలాడించిందామె.

    "బాత్ రూమ్ వస్తోందా?" తనే అడిగాడు.

    "ఉహూ" తల అడ్డంగా వూపింది.

    "వస్తే వెళ్లు" చెప్పాడు.

    "..."

    "కాసేపైతే ఫాదర్ తో పాటుగా అందరూ వస్తారు. అంతా అల్లరిగా వుంటుంది. బాత్ రూమ్ కి ఇప్పుడే వెళ్లు" చెప్పాడు.

    "వద్దు" అందామె.

    "సరే నీ ఇష్టం" అంటూ బయటకి నడిచాడు అతడు.

    "ఏమంటోందిరా?" మెల్లగా అడిగాడు అక్కడున్న కానిస్టేబుల్.

    "వేస్టు క్యాండిడేటు" చెప్తూ వెళ్లి అతడి పక్కన కూర్చున్నాడు ఇతడు.

    "ఇదే వేరే కేసైతే ట్రైచేసి చూసేవాళ్లం. కాని ఇప్పుడు జాగ్రత్తగా వుండాల్రోయ్. లేదంటే మన కొంపలు మునుగుతాయి" మొదటి కానిస్టేబుల్ అన్నాడు.

    అంతలోనే గౌసియా డోర్ దాకా వచ్చి "సార్" పిల్చింది. ఇద్దరూ ఆమెవైపు చూశారు.

    "బాత్ రూమ్" అందామె.

    "వస్తాను పదా" అంటూ రెండవ కానిస్టేబుల్ లేచి ఆమెవైపు వెళ్లాడు.

    "మీ ఇద్దరి పేరేంటి?" అడిగింది గౌసియా.

    "నా పేరు కృష్ణ. అతడి పేరు వెంకట్" చెప్పాడు.

...... ఇంకా వుంది .........