Facebook Twitter
" ఏడు రోజులు " 18వ భాగం

" ఏడు రోజులు " 18వ భాగం

 

 

 

రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి

 

 మిగతా ఇద్దరు యువకులతో కలిసి లోపలికి నడిచిందామె అది ఇరుకుగా ఉన్న ఒక గది మాత్రమే బయటనుండి ఇల్లు ఎంత పాతగా వుందో లోపల అంతకన్నా పాతదిగా వుంది.
    
    నిల్చుని గదంతా ఒకసారి పరికించి చూసిందామె ఒక పక్కగా చిన్న చెయిర్ లో కుప్పగా వేయబడిన బట్టలు, ప్యాంట్లు, చొక్కాలు, లుంగీలు, తగిలించివున్న హ్యాంగర్లు, ఒక కిరోసిన్ స్టవ్వు, ఐదారు వంటపాత్రలు, ఒక ప్లాస్టిక్ నీళ్ళబిందె, ఒక చాప, రెండు దుప్పట్లు, రెండు సూట్ కేసులు ఇంతకుమించి ఆ గదిలో ఇంకేమీ లేవు.
    
    "బ్యాచిలర్స్ ఇల్లు ఇలాగే వుంటుంది. ఆలస్యం చేయకుండా నువ్వెళ్ళి స్నానం చేసిరా" ఇందాకటి యువకుడే మళ్ళీ చెప్పాడు.
    
    "అదిగో అదే బాత్ రూమ్" ఆ గదికి మరోపక్కవున్న తలుపులు తెరిచి చూపించాడు ఇంకో యువకుడు.
    
    "నాకు బట్టలు లేవు" అందామె.
    
    "మా బట్టలు వేసుకో" చెప్తూనే తెల్లని జుబ్బా పైజామా తెచ్చి ఇచ్చాడు మరో యువకుడు.
    
    ఆ బట్టలు తీసుకుని వెళ్ళి స్నానం చేసి అలాగే తన బట్టల్ని కూడా పిండి ఆరవేసుకుని ఇరవై నిముషాల్లో ఇంట్లోకి వచ్చింది గౌసియా అప్పటికి ఆ యువకులు వంట మొదలెట్టారు.
    
    ఆమెవెళ్ళి ఒక పక్కగా కూర్చుంది షేకు గుర్తొచ్చాడు. అందాకా స్థిరంగా వున్న ఆమె మనసు షేకు గుర్తుకు రాగానే భయంతో కంపించి పోయింది.
    
    "భయపడుతున్నావెందుకు?" గమనించి ఒక యువకుడు అడిగాడు.
    
    "షేకు గుర్తొచ్చాడు" చెప్పింది.
    
    "వాడిని చంపేశావుకదా? ఇంకెందుకు భయపడాలి?"
    
    "దెయ్యమై వస్తాడేమో అన్పిస్తోంది"
    
    ఆమె ఆ మాట అనగానే ఆ ముగ్గురు పగలబడి నవ్వారు. ఆమె వాళ్ళని అదోలా చూసింది.
    
    'నా భయం నాది నేను భయపడుతుంటే వాళ్ళకు నవ్వువస్తుంది ఏమిటి? మనసులో అనుకుంది.
    
    "వాడు దెయ్యమై వచ్చినా నిజంగానే బతికి వచ్చినా మేము వుండగా వాడు నిన్నేం చేయలేడు. నీవు నీ గురించి చెప్పుకోగానే మాకు జాలివేసింది అందుకే మరేం అడగకుండా నేరుగా నిన్ను మా ఇంటికి తీసుకువచ్చాం ధైర్యంగా వుండు" ఉల్లిపాయలు తరుగుతున్న యువకుడు చెప్పాడు.
    
    వాళ్ళు ఆమెకు ఒక సమయంలో మంచి వాళ్ళుగా ఒక సమయంలో నమ్మదగని వాళ్ళుగా తోస్తున్నారు. మొదట వాళ్ళపై దురభిప్రాయం ఏర్పడింది కాబట్టి వాళ్ళు మంచి మాటలు మాట్లాడుతున్నా ఆమెకు నమ్మకం కుదరడంలేదు.
    
    వాళ్ళు తనని భయపెట్టడంవల్లే వాళ్ళ వెంట రాగలిగింది. అక్కడ వుండటం తనకు ససేమిరా ఇష్టంలేదు. కాని ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి.
    
    "నీ పేరేంటి?" అడిగాడు ఒక యువకుడు.
    
    "గౌసియాబేగం"
    
    "నా పేరు నవీన్, వీడి పేరు గిరిధర్, వాడి పేరు రాజేష్" పరిచయం చేసుకున్నాడు.
    
    "నీకు వంటపని వచ్చా?" అడిగాడు రాజేష్.
    
    "వచ్చు" చెప్పిందామె.
    
    "అయితే ఇంకేం? ఎప్పటికీ మాదగ్గరే వుండిపో..." అన్నాడు నవీన్.
    
    'వుండలేను' అన్నట్లుగా తల అడ్డంగా వూపిందామె.
    
    "పాపంరా! రేపు పొద్దునే హైద్రాబాద్ రైలు ఎక్కిద్దాం" అన్నాడు గిరిధర్.
    
    "ఈ రాత్రికి ఇక్కడే వుంటుందా?" అదో రకంగా కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు రాజేష్.
    
    "వుండాల్సిందే కదా" కన్నుగీటాడు నవీన్.
    
    గమనించిన గౌసియాబేగానికి సిక్స్త్ సెన్స్ శంకించింది.
    
    "ఇక్కడ్నుంచి ఎలాగైనాసరే పారిపోవాల్సిందే" మనసులో నిర్ణయించుకుంది.
    
    "మాలో ఎవరు అందంగా వున్నారు గౌసియాబేగం?" అడిగాడు గిరిధర్.
    
    "ముగ్గురూ బాగున్నారు" చెప్పిందామె. ఆ మాట ఆమె మనస్ఫూర్తిగా చెప్పలేదు ఏదో ఒకటి అన్నట్లుగా చెప్పేసింది.
    
    "అందరూ మనల్ని ఇలాగే అంటారు. అద్దం కూడా ఇలాగే చెప్తోంది. ఫోటోలు కూడా ఇలాగే చెప్తున్నాయి. మరి మనం వచ్చి ఏడాది కాలమైనా సినిమాల్లో కాదు గదా, కనీసం టీవీలో కూడా మంచి వేషం ఒక్కటి కూడా రాదేంట్రా?" నిరాశపడిపోతూ అన్నాడు రాజేష్.
    
    "మనకూ వుంటుంది గుడ్ టైమ్" అన్నాడు గిరిధర్.
    
    అందాకా వాళ్ళని చదువుకోడానికి వేరే ప్రాంతం నుండి వహ్చిన విద్యార్ధులు అనుకుందామె కాని వాళ్ళు ఎవరూ అనేది ఆమెకు అర్ధమైపోగానే ఆమెకు మరింత భయంవేసింది. ఎందుకంటే... ఎప్పుడైనా సినిమా చూడాలనిపించి తెల్సినవాళ్ళ ఇంటికి టీవీకి వెళ్తామంటేనే, తమ అబ్బా వెళ్ళనిచ్చేవాడు కాదు. వాళ్ళ సినిమాలు కూడా మంచివికాదు. చూస్తే చెడిపోతారు" అని చెప్పేవాడు.
    
    ఆ మాట తనలోనే కాదు, తన చెల్లెళ్ళ ల్లోనూ బలంగా నాటుకుపోయింది. అయినప్పటికీ తమకు సినిమాలంటే ఇష్టమే. కాని సినిమావాళ్ళంటేనే ఇష్టంలేదు. 'వీళ్ళను చెడ్డగా చెప్పిన అబ్బానే మంచి వాడు కాదు' అనుకుంటూ కాసేపటితర్వాత నెమ్మదిగా లేచి నిలబడింది గౌసియాబేగం
    
    "ఎక్కడికి?" అడిగాడు రాజేష్.
    
    "నా బట్టలు ఆరాయో లేదో చూసివస్తాను"
    
    "వెళ్ళువెళ్ళు" అన్నాడు రాజేష్.
    
    ఆమె రెండో గుమ్మంవైపు నడిచింది. వెళ్తున్న ఆమెవైపు పెదవి కొరుక్కుంటూ చూసాడు గిరిధర్.
    
    "భలే దొరికిందిరా! రాత్రి సాంతం ఎంజాయ్ చేసుకోవచ్చు" ఆమె వెళ్ళిపోగానే మిత్రులకి మాత్రమే వినబడేలా అన్నాడు నవీన్.
    
    "మనం ఎంజాయ్ చేసుకున్న తర్వాత పుష్పావతక్కకు అప్పజెప్పేస్తే మనకు అంతో ఇంతో ముట్టజెప్తుంది" అన్నాడు గిరిధర్.
    
    "రేయ్... నీ బుర్ర బాగా పనిచేస్తుందిరా" మెచ్చుకోలుగా అన్నాడు రాజేష్.
    
    బయటికి వెళ్ళిన గౌసియాబేగం, గుమ్మానికి సమీపంగా తాడుపై ఆరవేసిన తన బట్టల్ని త్వరగా ఆరే ఉద్దేశ్యంతో దూరందూరంగా జరుపుతున్నదల్లా... లోపల్నుంచి వినబడిన మాటలకు ఉలిక్కిపడింది.
    
    వాళ్ళు ఇంకా ఆమె గురించే మాట్లాడుతున్నారు. వాళ్ళు చిన్న స్వరంతోనే మాట్లాడుతున్నప్పటికీ బయటికి స్పష్టంగా వినబడుతున్నాయి మాటలు.
    
    'అబ్బా ఒకసారి అమ్మేసాడు మళ్ళీ వీళ్ళు కూడా నన్ను అమ్ముకుంటారు? అల్లా... నన్ను ఆడపిల్లగా ఎందుకు పుట్టించావు?' గుండెలపై చేయివేస్కుని దైన్యంగా ఆకాశంకేసి చూస్తూ అనుకుంది గౌసియా.
    
    "ఆ పిల్ల నిజంగా హత్య చేసిందంటే నమ్మబుద్దికావడంలేదురా! చూస్తుంటేనేమో అమాయకురాలే! తనకు అన్యాయం జరుగుతున్నా తెగించేంత సాహసం కనబడ్డం లేదు. కాని హత్యచేసినట్టు రక్తపుమరకల్ని చూసాం??" అన్నాడు రాజేష్.
    
    "అవన్నీ మనకు అనవసరం మనక్కావల్సింది ఆడపిల్ల కోరిక పుట్టినప్పుడల్లా కొనుక్కోలేక చచ్చిపోతున్నాం. ఇప్పుడా బాధ తీరింది అంతే చాలు" అన్నాడు గిరిధర్.
    
    "ఇప్పుడైతే పుష్పావతక్కకు అప్పజెప్పాల న్నావు?" తాలింపు వేసాడు నవీన్.
    
    "డబ్బుకోసం అప్పజెప్పాల్సిందే అలాగే అవసరమైనపుడు మనదగ్గరకి పంపించాలని మాట్లాడుకోవాలి కూడా" అంటుంటేనే గిరిధర్ గొంతులో అదోకైపు.
    
    "అబ్బ! ఇన్నాళ్ళకు మన సమస్యకు మార్గం దొరికింది అటు డబ్బుకి డబ్బూ వస్తుంది ఇటు సుఖానికి సుఖమూ దొరుకుతుంది. అదృష్టవంతులమేరా మనం" నవీన్ గొంతులో సంతోషం.
    
    అప్పటికి గౌసియాబేగం భయంతో బిర్ర బిగుసుకుపోయింది. ఇంకొక్కక్షణంకూడా తను అక్కడ వుండటం మంచిదికాదని భావిస్తూ అప్రయత్నంగా గుమ్మంవైపు చూసింది.
    
    వాళ్ళ మాటల్లో వాళ్ళువున్నారు. ఇప్పట్లో  వాళ్ళు వెలుపలికి వచ్చే సూచనలు కనబడ్డం లేదు.
    
    ఆమె ఇక ఏమాత్రం జాప్యం చేయలేదు.
    
    అక్కడ్నుంచి పారిపోయేందుకు తనకు అనువైన మార్గం ఏమైనా దొరుకుతుందా అన్నట్లుగా అటూఇటూ చూసింది. తక్కువ వైశాల్యంలో వున్న ఖాళీ స్థలానికి ప్రహరీ గోడ మాత్రం చాలా ఎత్తుగా వుంది. బాగా ప్రయత్నిస్తే ఎక్కిదుమకవచ్చు కాని ఆ ప్రయత్నించే సమయం తనకు లేదు.
    
    చేతులు నలుపుకుంటూ బాత్ రూమ్ వైపు తిరిగింది. అక్కడోచోట మూతవున్న నీళ్ళ డ్రమ్ము ఒకటి పెట్టబడివుంది. దానిమీదకు మెల్లగా ఎక్కి ప్రహరీగోడమీదకు ఎక్కవచ్చు.
    
    "అల్లా! నన్ను రక్షించు" మనసులో అనుకుంటూ, మరోసారి గుమ్మంవైపు చూసి వాళ్ళు ఎవ్వరూ తనని గమనించడం లేదని నిర్ధారించుకుని, వడివడిగా డ్రమ్ముదగ్గరికి వెళ్ళి, చప్పుడు చేయకుండా డ్రమ్ము మీదకి ఎక్కి అట్నుంచి ప్రహరీగోడమీదకి జాగ్రత్తగా ఎక్కి క్షణంకూడా ఆలస్యం చేయకుండా అవతలకి దూకింది.
    
    ఆ విసురుకి శరీరమంతా ఒక్కసారిగా కదిలింది. తోడుగా అరికాళ్ళు పగిలినట్టుగా అన్పించడమే కాకుండా, మోకాళ్ళ చిప్పలు పగిలిపోయాయి.
    
    "మా..." బాధగా అంటూనే లేచి దులుపుకుంటూ వేగంగా ముందుకు నడిచింది.

...... ఇంకా వుంది .........