" ఏడు రోజులు " 13వ భాగం
రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి
ఆమె కళ్ళల్లో భయం... కంగారు...ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో అటూ ఇటూ చూస్తోంది.
"గౌ...సి...యా" దగ్గరగా వెళ్ళి పిలిచాడు తను.
అంతకు క్రితం దాక కళ్ళను మాత్రమే తెరిచి వుంచిన ఆమె బురఖా ఇప్పుడు ఆమె ముఖాన్ని స్పష్టంగా చూపెడుతోంది.
"ఆ... ఆ" తనని చూసి ఆమె ఏమీ మాట్లాడలేక పోయింది.
"తప్పిపోయావా?" తెలుగులోనే అడిగాడు.
అవును అన్నట్లుగా తలాడించింది తను.
"నేను ఇంటికే వెళ్తున్నాను వెళ్దాం పదా" అన్నాడు.
ఆమె తల అడ్డంగా ఊపింది.
"తప్పిపోయావుకదా! ఈ జనాల్లో మీ వాళ్ళు కనబడ్డం చాలా కష్టం అందుకే వెళ్దాంపదా"
"వద్దు మా అబ్బా తిడతాడు"
"ఇట్లాంటి పరిస్థితిలో కూడా మీ అబ్బాకు భయపడతావేం? అక్కడ ఏం జరిగిందో తెల్సా? ఎవర్నో కత్తులతో పొడిచి చంపేశారు" చెప్పాడు.
"హా!" హడలిపోయిందామె.
"నాకు కూడా వెళ్ళిచూసేవరకు ఆ సంగతి తెలియదు" అన్నాడు.
"చంపేసారా? నేను ఏదో మామూలు గొడవ అనుకున్నాను" ఆమె గొంతు వణికిపోయింది.
"అందుకే నా వెంట వచ్చేయ్"
ఆమె అటూ ఇటూ చూసి సందేహించింది.
తను ఆమెతో మాట్లాడ్డం అది తొలిసారి కాదు చిన్నప్పటినుండి ఏదో ఒకటి మాట్లాడుతూనే వున్నాడు కాని గౌసియా పెద్దపిల్ల అయ్యాక ఆమెతో తను ఎప్పుడూ మాట్లాడలేదు అదే తొలిసారి.
"నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తాను" అందామె.
"నీ ఇష్టం" అంటూ అక్కడ్నుంచి తప్పుకున్నాడు తను కాని తన మనసు అందుకు ఒప్పుకోలేదు.అందుకే ముందుకు వెళ్ళినట్టే వెళ్ళి తిరిగి వెనక్కి వచ్చాడు.
అప్పుడు ఎవరో మోటార్ బైక్ కుర్రాడు గౌసియాను లిఫ్ట్ అంటూ వేధిస్తున్నాడు. ఆ కుర్రాడి ముఖకవళికలు చూడగానే ముస్లిం అని అర్ధమౌతున్నాడు.
"గౌసియా" పిలిచాడు తను.
తనను చూడగానే ఆ కుర్రాడు చప్పున మౌనంగా వాహనాల మధ్యవున్న ఇరుకు మార్గం గుండా తన బండిని కాసింత ముందుకు పోనిచ్చాడు.
"వేధిస్తున్నాడా?" అడిగాడు.
"అవును" అన్నట్టుగా తలాడించిందామె.
"హిందువుల్లోకంటే ముస్లిం మఠంలో ఐక్యత ఎక్కువ అని చాలామంది అనుకుంటారు. కానీ ఆ ఐక్యతను పాడుచేసే ఇట్లాంటి వెధవలు కూడా వుంటారు" తనలో తను అనుకుంటూ ఆ కుర్రాడివైపు కోపంగా చూసి మరి ఇప్పుడైనా నా వెంట వస్తావా?" అని అడిగాడు.
"వస్తాను" అన్నట్టుగా తలాడించిందామె.
తర్వాత ఇద్దరూ కలిసి వాహనాల్ని తప్పించుకుంటూ జాగ్రత్తగా ముందుకు నడవసాగారు. అదే సమయంలో వాహనాల్ని దారి మళ్లించారు. బందోబస్తుగా వచ్చిన పోలీసులు.
"నేను నీ వెంట వస్తున్నానుగానీ మా అబ్బాకు తెలిస్తే నన్ను కొడతాడేమో అని భయంగా వుంది" వెళ్తుంటే భయపడింది గౌసియా.
"తిడతాడా? కొడతాడా?" అడిగాడు తను.
"రెండూ చేయచ్చు" చెప్పింది.
"అయితే ఒక్కతినే వచ్చాను అని చెప్పేయ్..." చెప్పాడు.
"ఏమో!" భయంగా తనలో తనే అనుకుంది.
తను మాత్రం ఇంకేం మాట్లాడలేదు. కొంతదూరం వెళ్ళాక తనే మళ్ళీ అంది.
"మా అబ్బా సంగతి మన గల్లీ జనాలకు తెలియందికాదు. నేను ఈ వెళ్ళడం మా ముస్లిం అబ్బాయితో అయితే పెద్దగా ఇబ్బంది వుండదు. కానీ నువ్వు హిందువువు కదా!"
అప్పుడు తెలిసింది తనకు. ఆమెలో మత భేదం లేదని. సామరస్యాన్ని ఆమె ఇష్టపడుతోందని అందుకే అన్నాడు.
"నీకు ఈ మతాలమీద విసుగు పుట్టినట్టుంది"
"మతాల మీద విసుగు పుట్టలేదు. ఈ మనుషుల మీదే విసుగు" అంది.
"అయితే నీ మనస్సూ నా మనస్సూ ఒక్కటే" అన్నాడు.
"అంటే?"
"నాక్కూడా నీకు మల్లే ఈ మనుషుల్ని చూస్తే విసుగు మఠం పేరుతో మానవతను మరిచే ఈ రాతి హృదయాల మీద విసుగు"
ఆమె చిన్నగా నవ్వింది.
"ఎందుకు నవ్వుతున్నావు?" అడిగాడు.
"మీ హిందువుల్లో కూడా మంచివాళ్ళు వుంటారా? అని!"
"అయ్యో అదేంటి?"
"మా అబ్బా మాకు చిన్నప్పటి నుండి హిందువులంతా మంచివాళ్ళుకాదని చెప్పాడు. మంచిగా మాట్లాడినా లోపల విషం వుంటుందని చెప్పాడు ఆ అభిప్రాయమే మాలో బలంగా నాటుకుపోయింది"
"మీలాంటివాళ్ళకు మా హిందువులమీద ఎలాంటి అభిప్రాయం వుందో మా హిందువుల్లో కూడా కొందరికి ముస్లింల మీద అదే అభిప్రాయం వుంది"
"అలాగా!?"
"అవును మరి"
"మా ఇంట్లో మా అబ్బా ఒక్కడికే మత పిచ్చి నాకూ, మా అమ్మకు, మా చెల్లెళ్ళకు అందరితో మాట్లాడాలి అని వుంటుంది"
"అయినాగాని మాట్లాడే అవకాశంలేదు. కాని ఒక్క విషయంలో మాత్రం నాకు ఆశ్చర్యం అన్పిస్తోంది."
"ఏ విషయం?"
"నీవు తెలుగు స్పష్టంగా మాట్లాడ్తున్నావు"
"నీకు ఉర్దు రాదా?"
"వచ్చు"
"నాకూ అలాగే తెలుగు వచ్చు"
"అలా అని కాదు, మా హిందువుల్లో చాలామందికి ఉర్దూ వస్తుంది. కాని మీ ముస్లింల్లో చాలామందికి తెలుగురాదు"
"అదీ నిజమే"
అది మొదలు ఆమెమీద తనకు మరింత అభిమానం పెరిగింది. ఆమెకూడా తన సేహాన్ని కోరుకుంది. కాబట్టే ఎప్పుడైనా కలుసుకున్నప్పుడల్లా మాటలు కలిపింది. అలా మొదలైన తమ తియ్యని స్నేహం తననుండే ప్రేమగా మారింది. ఆమెతో తన మాటలు కలవకపోయి వుండుంటే ఆకర్షణ గానే ఆమె మీది తన అభిమానం మాసిపోయి వుండేది. కాని కలిసిన మాటలు తమ మధ్య ప్రేమాంకురాన్ని ఇంత బలంగా నాటుతాయని అప్పట్లో తను అనుకోలేదు.
చార్మినార్ సంఘటన తర్వాత కొన్ని రోజులకు సిరాజ్ వాళ్ళింట్లో దావత్ జరిగింది. పర్వీన్ ఆపా కొడుక్కి సున్తీ చేసి ఆ దావత్ ను ఏర్పాటు చేశారు. అది రాత్రి సమయం.
తను, తన ఫ్రెండ్స్ అందరూ ఆ దావత్ కు వెళ్ళారు. సాయిబు ఏదో పనిమీద వూరెళ్ళినందున గౌసియా వచ్చింది. అక్కడ మళ్ళీ తమ మాటలు కలిశాయి. ఆమె ఎవ్వరికంట పడకుండా భయపడుతూ చాటుగా తనతో మాట్లాడింది.
"నాకేమో నీతో మాట్లాడాలి అన్పిస్తుంటుంది. కాని ఏదో భయం" అంది.
"మాట్లాడ్తేనే అంత భయమా?"
"పరిస్థితులు అట్లా వున్నాయి మరి"
"సరేగాని నీతో ఒక మాట"
"ఏంటీ?"
"నీకు తెలుగు చదవడం వచ్చా?"
"తెలుగూ రాదూ, ఉర్దూరాదు"
"నిజమా?"
"నిజం"
"ఆ అలాగా" అంటూ ప్రేమలేఖని పిడికిట్లోనే నలుపుకోసాగాడు తను.
"ఏంటీ?" తనే అడిగింది.
"ఏం లేదు" అన్నాడు.
"ఏదో చెప్పాలనుకుంటున్నావు?"
"పోనీ నీకు ఎవ్వరైనా తెలుగు చదవగల ఫ్రెండ్స్ వున్నారా?"
"వున్నారు"
"అయితే వాళ్ళతో ఈ లెటర్ చదివించుకో" చెప్తూనే లెటర్ ను ఆమెకు అందివ్వబోయాడు అతడు.
"ఏం రాసావు?" కనుబొమలు ముడిచింది.
"చదివించుకో నీకే తెలుస్తుంది" చెప్పాడు.
"అట్లాంటి ఇట్లాంటి రాతలు కావుకదా?" అనుమానంగా అంది.
"ఏమీ లేవు"
"ఎందుకంటే నీవు ఏదైనా రాయకూడనిది రాస్తే ఆ పిల్ల మా ఇంట్లో చెప్పేస్తుంది ఆ పిల్ల నోట్లో మాట దాగదు"
ఆమె ఆ మాట మాట్లాడగానే తన చేతిని చప్పున వెనక్కి తీసుకున్నాడు తను.
"ఏం రాశావు?" అడిగిందామె మళ్ళీ.
కాసేపు మౌనం వహించి తర్వాత అటూ ఇటూ చూసి నెమ్మదిగా చెప్పాడు తను.
"రాశాను"
"ఏందీ?"
"నువ్వు ఏమీ అనుకోవుకదా?"
"ఏమీ అనుకోను"
"ఒట్టు"
"అల్లామీద ఒట్టు"
"ఆ... ఆ లవ్... లెటర్"
ఆమె విస్మయంగా చూసింది.
"నేనంటే నీకు ఇష్టం లేకపోతే ఈ విషయం గురించి మీ ఇంట్లో చెప్పవద్దు" భయపడ్డాడు తను.
"...."
"బయటకు చెప్పొద్దు ప్లీజ్"
"..."
"ఏదో రాశాను పొరపాటు అయింది"
"..."
"చెప్పొద్దు" అంటూనే ప్రేమలేఖను ముక్కలు చేయబోయాడు.
"సునో" వారిస్తూ అంది.
ఏంటన్నట్లుగా చూశాడు తను.
"నువ్వే ఈ విషయం గురించి ఎవ్వరితో చెప్పొద్దు" చూపులు వాల్చి అంది.
ఆమె మనసు తనకు అర్ధమయ్యింది. ఆశ్చర్యంగా చూస్తూ చప్పున ఆమె చేయి పట్టుకున్నాడు.
ఆమె చిరునవ్వు నవ్వింది. తనూ నవ్వాడు అంతలోనే సిరాజ్ గొంతు క్రింది నుండి వినబడింది.
"రేయ్... శంకర్"
"వెళ్ళిపోదాం" వెంటనే అన్నాడు.
"హూ..." అంగీకారంగా తల ఊపింది.
"ముందు నువ్వు వెళ్ళు" చెప్పాడు.
ఆమె ఆ వెంటనే డాబా దిగి క్రిందికి వెళ్ళింది. ఆమె వెళ్ళిన తర్వాత తను నెమ్మదిగా మెట్లు దిగసాగాడు.
ఆమె ఒడియాల కోసమని డాబామీదకు వచ్చింది. తను అదే సమయంలో బల్బుల్ని గోడవారగా సరిచేయడం కోసం డాబామీదకు వచ్చాడు కాని ఇద్దరూ వచ్చిన పని చేసుకోలేదు.
"ఏంట్రా? మిద్దెమీదకు ఎందుకు వెళ్లావు? ఏం చేసి వస్తున్నావు?" క్రిందికి వెళ్ళగానే అడిగాడు సిరాజ్.
"అరెరే..." తలను చిన్నగా కొట్టుకున్నాడు తను.
"వెళ్ళు" అన్నాడు సిరాజ్.
తను మళ్ళీ డాబా మీదకు వెళ్ళాడు. గౌసియా కూడా మళ్ళీ వచ్చింది పరిస్థితికి ఇద్దరూ నవ్వుకున్నారు.
ఆ రోజు తన జీవితంలో అపురూపమైన రోజు ఆ గడియలు తన జీవిత పుస్తకంలో మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి.
...... ఇంకా వుంది .........
