" ఏడు రోజులు " 7వ భాగం
రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి
అనూహ్యంగా తనకోసం అరబ్బుషేకు ఇంటికి వచ్చినరోజు, గౌసియాబేగం భయపడింది.. బాధపడింది.. కలవరపడింది. అప్పుడు తల్లి ఖతీజాబీ ఇలాగే ఆశల్ని పెంచుతూ ధైర్యాన్ని అందించింది. అయినప్పటికీ గౌసియా మనసు కుదుటపడలేదు.
ప్రియుడ్ని కలుసుకున్న తర్వాత అతడు అందించిన ఓదార్పు, ధైర్యమే ఆమె మనసు కుదుటపడేలా చేసాయి. అయితే అరబ్బు షేకు తిరిగి ఇంత త్వరగా ఐదురోజుల తర్వాతే తనకోసం వస్తాడని అనుకోలేదు. తల్లిదండ్రులు ఆ విషయం గురించి ఆమెకు చెప్పనూలేదు. వాళ్ల దృష్టిలో గురించిన విషయాన్ని కూడా ఆమెకు చెప్పాల్సిన అవసరం లేదనుకున్నారు వాళ్లు. కాకపోతే తన రేటును మాత్రం తెల్సుకోగలిగింది గౌసియా. అదీ కూడా తెలియకపోయేదే. కానీ " వచ్చే డబ్బుల్తో ఏఏ పనులు చేసుకుని, ఏఏ అవసరాలు తీర్చుకోవాలి? అందుకు ఎంత ఖర్చువుతుంది?" అంటూ తల్లిదండ్రులు లెక్కలు వేసుకుంటుంటే విననట్లుగానే ఉండీ వినగలిగింది.
" షేకు వెంట వెళ్లడం నాకు ఇష్టం లేదు" ఉబికివస్తున్న కన్నీళ్లను తుడ్చుకుంది గౌసియా.
" బేటా" అంతలోనే లోపలికి వచ్చాడు సాయిబు.
కళ్లనీళ్లను మరోసారి తుడుచుకుంటూ తండ్రివైపు చూసింది గౌసియా.
కూతుర్ని అలా చూడగానే సాయిబు చీకాగ్గా ముఖం చిట్లించాడు.
" కైకు రోరి?" పళ్ళబిగువున అడిగాడు.
భయంగా చూసింది గౌసియా.
" షేకుకు సలాం చెప్పాలి. తొందరగా కొత్త సారి కట్టుకుని తయారవ్వు" అని చెప్పి, బయటకి వెళ్లిపోయాడు తండ్రి.
ఇనప పెట్టెలోంచి వారంరోజుల కిందట కొన్న ఎరుపురంగు జరీచీర తీసి కూతురుకు అందించింది ఖతీజాబీ.
చీర తీసుకుని ఒక మూలగా వెళ్లింది గౌసియా. పెద్ద చెల్లెలు జుబేదాబేగం పెట్టి కోట్.... జాకెట్ తెచ్చి ఇచ్చింది.
పదినిమిషాల్లో చీరకట్టుకుంది గౌసియ. తర్వాత అదే గదిలో ఉన్న జాలాడిలో ముఖం కడుక్కుంది.
అంతలోనే మళ్లీ వచ్చాడు సాయిబు. తయారవుతున్న కూతురిని చూస్తూ" తొందరగా" అని చెప్పి ఆ వెంటనే వెళ్లిపోయాడు.
మరో పదినిమిషాల్లో తయారయింది గౌసియా. ఆమె ముస్తాబు చౌకబారుగా ఉంది. పదిరూపాయల విలువచేసే పొడవైన లోలకులు ధరించి, రెండ్రూపాయలకు దొరికిన అత్తరు పరిమళాన్ని దూది సహాయంతో నిలువెత్తున అడ్డుకుని.. ఆ దూదిని పదిలంగా చెవిలో ఒకమూలగా దోపుకుని, ఐదురూపాయలకి కొన్న ఎర్రని లిప్ స్టిక్ ని పెదవులకి పూసుకొని, రంగు పక్కపిన్నులతో నున్నగా దువ్వి జడవేసుకుని, పాపెడలో మెరుగు అద్దుకుని, నిరుపేద ఇంటి నిండైన బొమ్మలా కనబడుతోంది.
" అయిపోయిందా?" అడుగుతూ లోపలికి వచ్చాడు తండ్రి. రాగానే కూతుర్ని చూసి " మేరీ బేటీ అచ్ఛాహై" మెచ్చుకోలుగా అన్నాడు.
ఆ సమయంలోనే తలనిండుగా కొంగువేసుకుంది గౌసియా.
" ఆ... అదీ" కూతురు ముసుగును కూడా మెచ్చుకున్నాడు తండ్రి.
" అబ్బ వెంటనే బయటకి వెళ్లు" చెప్పింది ఖతీజాబీ.
" సరే " అన్నట్టుగా తలాడించి, తండ్రి వెంటే బయటకి నడిచి, ముఖాన్ని పూర్తిగా నేలకు వంచేసి " సలాంవాలేకుం" అంటూ చేతిని నొసటికి ఆన్చి తీసి అలాగే నిలబడిపోయింది.
ఆమెను చూస్తున్న అరబ్బుషేకు కళ్లు ఆశగా మెరుస్తున్నాయి. జరీచీర చాటునున్న ఆమె అందాన్ని చూస్తూ, " ఈ రాత్రికి నిఖా చేసుకుంటాను " అన్నాడు.
" అట్లాగే " తలాడించాయి సాయిబు.
" రేపు ఉదయాన్నే ముంబాయి బయలుదేరాలి. అక్కడ నాకు కొన్ని పనులు ఉన్నాయి. కాబట్టి ఒక నెలరోజులు అక్కడే ఉండి, ఆతర్వాత దుబాయి వెళ్ళిపోతాం" చెప్పాడు షేకు.
వింటూ తలాడించాడు సాయిబు.
" మీ ఇంట్లోనే నిఖా చేసుకుంటాను. ఇందుకు మీరేమి ఖర్చు పెట్టుకోవద్దు. ఖర్చంతా నాదే" నిండుగా గాజులు ధరించిన గౌసియా చేతిని ఒకసారి మృదువుగా స్ప్సశించి వదిలేస్తూ చెప్పాడు షేకు.
అందుక్కూడా తలాడించాడు సాయిబు.
" ఇక నీ బేటీను ఇంట్లోకి పంపించు" లేచి నిల్చుంటూ అన్నాడు షేకు.
" బేటీ! లోపలికి వెళ్లు " తను కూడా లేచి నిల్చుంటూ చెప్పి, " బయలుదేరుతున్నారా?" షేకు ముఖంలోకి సవినయంగా చూస్తూ అడిగాడు సాయిబు.
"అవును" అంటూనే బయటికి నడిచాడు షేకు. వెంటే వెళ్లాడు సాయిబు. షేకు వెళ్లగానే కారుడోరు తీసి పట్టుకున్నాడు డ్రైవరు. ఎక్కి కూర్చున్నాడు షేకు.
అతడికి మరోసారి సలాం చెప్పాడు సాయిబు. అతడు గంభీరంగా తలపంకించాడు. మరుక్షణం కారు ముందుకు కదిలింది.
బయటినుండి ఇంటికి వస్తున్న భవానీశంకర్ ఆ దృశ్యాన్ని చూడగానే అప్రయత్నంగా తన అడుగుల్ని నెమ్మది చేశాడు. కలవరపడిపోతూ, ఎదురొచ్చిన కార్లోకి గుచ్చి మరీ చూశాడు.
" గౌసియాను తీసుకెళ్లిపోతున్నాడేమో" అని ఏ మూలనో పీడించిన అనుమానం, కార్లో గౌసియా కనబడకపోవడంతో ఆనందంగా మారింది.
" రక్షించావురా దేవుడా" అనుకుంటూ సాయిబువైపు చూశాడు.
సన్నగా మహమ్మద్ రఫి పాట పాడుకుంటూ చాయ్ బండి అమ్మేదిశగా వెళ్తున్నాడు సాయిబు.
" దుర్మార్గుడా" మనసులో అనుకుని, ఆ వెంటనే వెనుతిరిగి, పరుగుపరుగున కిలోమీటర్ దూరాన ఉన్న స్నేహితుడి ఇంటివైపు నడిచాడు భవానీశంకర్.
స్నేహితుడి ఇల్లు సమీపించగానే, ఆ దరిదాపులో బాలస్వామి గనుక ఉన్నాడేమోనని అటూ ఇటూ చూసి, లేడని నిర్ధారించుకున్నాక హాయిగా ఊపిరిపీల్చుకుంటూ స్నేహితుడి ఇంటి తలుపు తట్టాడు.
ఎవరు అన్నట్టుగా కిటికీలోంచి చూసి, ఆ తర్వాత తలుపుతీసింది స్నేహితుడి అక్క పర్వీనాసుల్తాన.
" ఆపా.. షిరాజ్ ఉన్నాడా?" హడావుడిగా అడుగుతూ లోపలికి నడిచాడు.
" కాలేజికి వెళ్లాడు" చెప్తూ తలుపులు దగ్గరగా వేసింది పర్వీనా.
" ఆపా.. గౌసియా వాళ్లింటికి ఆ షేకు గాడు మళ్లీ వచ్చాడు" అదే హడావుడితో చెప్పాడు భవానీశంకర్.
" అనుకున్నాను" అంటూ గుమ్మం తాలూకు పరదా సరిచేసి " షేకు వాళ్ల ఇంట్లోనే ఉన్నాడా ఇప్పుడు?" అడిగింది పర్వీనా.
" వెళ్లిపోతుంటే చూశాను"
" అలాగా!" అంటూ వెళ్లి అక్కడున్న కుర్చీలో కూర్చుంటూ " గౌసియాతో మాట్లాడాలి అనుకుంటున్నావా? అడిగింది.
" అవును ఆపా" అంటూ వెళ్లి ఆమె ఎడంగా ఉన్న మరో చెయిర్ లో కూర్చున్నాడు అతడు.
" ఈరోజు నాకు కుదరదు. కాబట్టి రేపు మాట్లాడు"
" వద్దు ఆపా! ఈరోజే మాట్లాడాలి"
" కాని ఈరోజు ఊరినుండి మా అమ్మ నాన్న వస్తున్నారు"
" అయితే కనీసం గౌసియాతో మాట్లాడి విషయాలు తెల్సుకో"
"సరే"
" ఇప్పుడే వెళ్తావా వాళ్లింటికి?"
" అంత తొందరపడ్తావేం? " చిన్నగా నవ్వింది పర్వీనా.
" నాకు కంగారుగా ఉంది" చేతులు నలుపుకుంటూ చెప్పాడు భవానీశంకర్.
" మొన్న జుమ్మా రోజు కూడా ఇలానే కంగారుపడ్డావు" అందామె.
" ఆరోజుకంటే ఈరోజు ఎక్కువ కంగారుగా ఉంది. ఎందుకంటే వాడు రెండోసారి రావడం అంటే గౌసియాని తీసుకువెళ్లే సమయం దగ్గరపడిందనే అర్ధం.
" పడనీయ్! ఈ జుమ్మాకి మీరు వెళ్లిపోతారు కదా"
" అంతలోపే వాడికి గౌసియాను తీసుకెళ్లే ఆలోచనఉంటే?"
ఆ! అదీ ఆలోచించాల్సిన విషయమే"
" అందుకే ఆపా! తొందరగా వెళ్లి గౌసియాతో మాట్లాడు"
" సాయంకాలం వరకు నీకు ఏ విషయం చెప్పేస్తాను. తొందర పడవద్దు"
"సరే" అన్నట్లుగా తలపంకించాడు భవానీశంకర్. అయినప్పటికీ అతడికి మనసులో మనసులేదు. తనకు మంత్రాలు, మాయలు, వచ్చివుండివుంటే అదృశ్యంగా వెళ్లి గౌసియాతో మాట్లాడేవాడ్ని కదా అనిపిస్తుంది. అంతేకాదు , తక్షణమే గౌసియాను తీసుకుని ఎటైనా పారిపోవాలనిపిస్తోంది. ఆమెకు తన ఒడిలో దాచుకుని ప్రపంచాన్ని మరిచి జీవించాలనిపిస్తోంది.
అందుకే పర్వీనా వాళ్ల ఇంటినుండి తన ఇంటికి వచ్చేసాక, కనీసం ఇంట్లోకి కూడా కళ్ళకుండా ఇంటి ముందు అరుగుమీద కూర్చున్నాడు.
....... ఇంకా వుంది .........
