అత్తలేని కోడలు ఉత్తమురాలు
అత్తలేని కోడలుత్తమురాలు ఓలమ్మా
కోడల్లేని అత్త గుణవంతురాలు
ఆహుం ఆహుం
కోడలా కోడలా కొడుకుపెళ్ళామా ఓలమ్మా
పచ్చి పాలమీద మీగడేదమ్మా
వేడి పాలల్లోన వెన్నయేదమ్మ
ఆహుం ఆహుం
అత్తా నీచేత ఆరళ్ళెగానీ ఓలమ్మా
పచ్చిపాలమీగ మీగ డుంటుందా
వేడిపాలల్లోన వెన్న ఉంటుందా
ఆహుం ఆహుం
చిలక తిన్నపండు నేనెట్టా తిందు ఓలమ్మా
చిలకతో మాటొస్తె నేనెట్టా పడుదు
ఆహుం ఆహుం
మెచ్చి మేనరికంబు యిచ్చేటికంటె ఓలమ్మా
మెడకోసి నూతిలో వేసితే మేలు
లేకుంటె గంగలో కలిపితే మేలు
ఆహుం ఆహుం
మా తాతపెళ్ళికి నే నెంతదాన్ని ఓలమ్మ
తలదువ్వి బొట్టెడితె తవ్వంతదాన్ని
అన్ని సొమ్ములు పెడితె అడ్డంతదాన్ని
ఆహుం ఆహుం
నట్టింట కూర్చొని నగల కేడిస్తే ఓలమ్మ
ఊరుకో మనవరాల ఊరేగొస్తా నన్నాడే
ఆహుం ఆహుం
కోడలా కోడలా కొడుకు పెళ్ళామా ఓలమ్మ
కొడుకు ఊళ్ళోలేడు మల్లె లెక్కడివీ
ఆహుం ఆహుం
ముద్దుచేసిన కుక్క మూతి కఱచేను
చనువుచేసిన ఆలి చంకనెక్కేను
ఆహుం ఆహుం
మొండి కెత్తినదాన్ని మొగుడేమి చేసు ఓలమ్మ
లజ్జ మాలినదాన్ని రాజేమి చేసు
సిగ్గుమాలినదాన్ని శివుడేమి చేసు
ఆహుం ఆహుం
(తెలుగు జానపద గీతాలలో అత్యంత ప్రచారం పొందిన పాట)
