Facebook Twitter
సంతృప్తి

ఒక రాజ్యంలో ఓ అత్యంత తెలివైనవాడుండేవాడు. అతని పేరు సుబ్బన్న. తెలివైనవాడే కానీ తృప్తి, ఆనందం అనే మాట తెలీని వాడు. ఎవరిని చూసినా తానే వాడికంటే గొప్ప అనుకునే  నైజం. దీంతో సుబ్బన్న అహంభావి అనేవారు కొందరు. ఇవేమీ పట్టించుకునేవాడు కాదు సుబ్బన్న. రాజ్యంలో ఓ గుడి కట్టారు. అది రాముల వారి ఆలయం. ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాలకు వెళ్లి ఆనందించాలని సుబ్బన్న అనుకున్నాడు. తన ఊరు దూరం అయినా కాలిబాటన, బండిలో ఇలా ఉత్సవ స్థలానికి చేరుకున్నాడు. మొదటి రోజు రాజుగారు వచ్చారు. అందరూ ఆసీనులై ఉండగా.. ఇద్దరు కళాకారులు వచ్చి పాటలు పాడారు. ఆ పాటలు విని తన్మయత్వం చెందాడు. తాను కూడా అలా పాడితే బావుండునని అనుకున్నాడు. ఎంతో బాధపడ్డాడు. తానూ అలా గాయకుడిని అయితే బావుండును అనుకున్నాడు.
రెండో రోజు రాజుగారి ముందు కవులు వచ్చి పద్యాలు పాడారు. పండితులు మాట్లాడారు. వారిలా పద్యాలు రాయలేకపోతినే అనుకున్నాడు. కొన్ని పద్యాలు అర్థమై ఎంతో సంతోషపడ్డాడు. నేను కూడా పండితుడిని అయితే వీరి భాష వచ్చి ఉండేది కదా అని వగచాడు. రానే చివరి రోజు వచ్చింది. మూడో రోజు రామాలయం దగ్గర రామాయణం బొమ్మలు, ఎన్నో విశేషాలను కళాకారులు చిత్రించారు. కాన్వాసుల మీద రాళ్లమీద రామాయణగాథ వివరించబడింది. ఆ బొమ్మలు చూసి నేను కూడా ఇలా గీసి ఉంటే అందరి మెప్పు పొందేవాడిని కదా.. అనుకున్నాడు సుబ్బన్న. బాధతో కోపంతో ఇంటికి పయనమయ్యాడు. మూడోరోజు రాత్రి ఓ ఆశ్రమంలో బస చేశాడు. అక్కడ ముగ్గురు కనపడ్డారు. ఒకడు గుడ్డివాడు, రెండోవాడు చెవిటి, మూడో వాడికి కళ్లు లేవు. అది చూసి సుబ్బన్న ఆశ్చర్యపోయాడు. ‘వీళ్లు ఈ రాముడి గుడి ఉండే ఊరిలోనే ఉన్నారు. అయితే ఏ కళలనూ ఆస్వాదించలేకపోతున్నారే. వారి కంటే నేనే నయం కదా’ అనుకున్నాడు. వెంటనే అతనికి ఆత్మసంతృప్తి కలిగింది. ఎంతో ఆనందపడ్డాడు.
నిరంతర ఆనందం బాహ్యపరమైన కోరికలలో లేదు. ఉన్నా అది తాత్కాలికమే. శాశ్వతమైన ఆనందం మన హృదయంలోనే ఉంది. మన ధ్యాస ఎప్పుడూ బహిర్ముఖంగానే ఉంటోంది. అందువల్లే అంతరంగంలో నెలకొని ఉండే నిరంతర ఆనందాన్ని ఆస్వాదించలేకపోతున్నాం. మనిషి మానసిక ఒత్తిళ్లకు లోనైనప్పుడు ఉపశమనం కోసం ప్రత్యామ్నాయ మార్గాలవైపు దృష్టి సారిస్తాడు. కొంతమంది వ్యసనాల వెనక, మరి కొంతమంది ఆధ్యాత్మికత వైపు పరుగులు పెడుతున్నారు. అవసరార్థం తెచ్చి పెట్టుకున్న ఏ కొత్త అలవాటైనా ఎక్కువ కాలం కొనసాగదు.

ఈ లోకంలో సదా దాతవై వర్ధిల్లు అన్నారు వివేకానంద. తన వద్ద ఏమీ లేకపోయినా ఇవ్వాలనే భావన కలిగి ఉంటే లేమి అనేది ఉండదు. లేమి లేకపోవడం సంతృప్తికి చిహ్నం. నిజ జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలన్నీ మనకు కొత్త పాఠాలు బోధించే అధ్యాపకులే. ఉదాహరణకు- ఒంటరిగా ఉండాలంటే భయం అనుకోండి... ఒంటరిగా ఉండే పరిస్థితి ఎదురైనప్పుడు ఏదో ఒక వ్యాపకం కల్పించుకొని ఇతరులతో కలిసి ఉండేందుకు ప్రయత్నిస్తాం. తద్వారా ఒంటరితనం వల్ల కలిగే భయాన్ని తాత్కాలికంగా పోగొట్టుకుంటాం. కానీ, సంతోషాన్నీ సమస్థితిని కోల్పోతాం. ధైర్యంగా ఎదుర్కోగలిగే మనో పరిపక్వత అలవరచుకుంటే, ఏకాంతంలో ఉండే ఆనందం అనుభవంలోకి వచ్చి మనోబలం దృఢపడుతుంది. నిశ్శబ్దంగా మౌనంగా ఉండటం, మాటల పొదుపు వల్ల సంతృప్తి లభిస్తుంది. మాటలో కాఠిన్యం ఆవేశ కావేషాలు వ్యక్తి కర్కశ స్వభావాన్ని తెలియజేస్తాయి. వాదోపవాదాలకు అవకాశం ఇవ్వకుండా క్లుప్తమైన సరళమైన మృదు సంభాషణతో భావాలను వ్యక్తీకరిస్తే వాచక సంతృప్తి కలుగుతుంది. 

ఒక మంచి పని చేస్తే దాని ద్వారా ఎనలేని మానసిక సంతృప్తి కలుగుతుంది. అది ఉన్నవారి మొహాలు ప్రశాంతంగా ఉంటాయి. అలాంటివారు క్షమాగుణం కలిగి ఉంటారు. మాటల్లో, చేతల్లో సంతోషం సంతృప్తి కలిగి ఉండటం ఆధ్యాత్మిక సాధనలో తొలిమెట్టుగా భావిస్తారు. చీకటి లేని వెలుగుకు విలువ లేదు. అలాగే కష్ట నష్టాలు లేకుండా వచ్చే సంతోషానికి సంతృప్తి ఉండదు. అది ఎక్కువసేపు నిలవదు. ఓర్పు సహనాలతో పరిస్థితులను ఎదుర్కొంటూ తద్వారా వచ్చే విజయంలోనే అసలైన సంతోషం సంతృప్తి లభిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఇతరులకు సహాయపడటం, క్రమశిక్షణ కలిగి ఉండటం, మనసును నియంత్రించుకోవడం వల్లనే జ్ఞాన మార్గంలో పయనించగలం. అది అలౌకిక సంతోషాన్ని సంతృప్తిని ఇస్తుందన్నది బుద్ధుడి మాట.

సత్యశీలుడు, సుగుణావతి దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉండేవాళ్ళు. పిల్లలు బుద్ధిమంతులు. వాళ్ళు ఆస్తి పరులు, డబ్బుకు ఏ లోటూ ఉండేది కాదు. ఆరోగ్యం మహత్తరంగా ఉండేది; అన్నీ బాగానే ఉండేవి కానీ ఏదో తెలీని అసంతృప్తి వాళ్లని పీడించేది. 'భగవంతుడిని సేవిస్తే సంతోషం వస్తుంది' అని భార్యభర్తలిద్దరూ పూజలు చేసేవాళ్ళు, తీర్థయాత్రలు చేసేవాళ్ళు, పుణ్యక్షేత్రాలు దర్శించేవాళ్ళు, ఉత్సవాల్లో పాల్గొంటుండేవాళ్ళు. అయితే కేవలం ఆయా సందర్భల్లో మాత్రమే వాళ్ళ మనసుకు ఉల్లాసంగా, తన్మయంగా అనిపించేది. ఆ తరువాత మళ్ళీ వాళ్ళు యధా ప్రకారం అసంతృప్తికి గురయ్యేవాళ్ళు. అట్లానే 'గ్రంథ పఠనం' వల్ల సంతృప్తి వస్తుంది అని ఎవరో చెబితే కొన్నాళ్లపాటు వరస పెట్టి ధార్మిక గ్రంధాలు చదివించుకున్నారు; పురాణ కాలక్షేపాలు అవీ చేయించారు కానీ మళ్ళీ యథాప్రకారం అసంతృప్తే.

ఆ సమయంలో వాళ్ళకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన గురువుగారు వాళ్ల ఊరికి వచ్చారు. సత్యశీలుడు,సుగుణవతి ఆయన్ని దర్శించుకొని తమ సమస్య చెప్పుకున్నారు. ఆయన  "చూడు నాయనా! మనిషి సంఘజీవి. 'తనతో బాటు, తన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి' అని కోరుకుంటాడు ఎప్పుడూ. అందు వల్లనే, తను ఒక్కడూ సుఖంగా ఉన్నంతమాత్రాన మనిషికి సంతృప్తి రాదు. ఈ సమాజంలో ఎంతో మంది రకరకాల కష్టాలకు లోనవుతున్నారు. వైద్యం చేయించుకునే శక్తి లేక ప్రాణాలు కోల్పోతున్నారు; జ్ఞానపిపాస ఉన్నా యువకులు చాలామంది చదువులు కొనసాగిం చలేకపోతున్నారు. పలువురు బ్రతుకు తెరువు లేక కష్టపడుతున్నారు. వాళ్లకు మీ చేతనైనంత సాయం, మీ చేతనైన రీతుల్లో చేయండి. అప్పుడు చూడండి ఎంత తృప్తి కలుగుతుందో" అని అన్నారు.

గురువుగారి మాటల్లోని సత్యాన్ని అర్థం చేసుకున్న సత్యశీలుడు-సుగుణవతి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తమ గ్రామంలో రోగుల కోసం ఒక వైద్యశాల, యువతరం విద్యను కొనసాగించేందుకు గాను పాఠశాల, కళాశాల నిర్మించారు. ఊళ్ళో అందరికీ బ్రతుకు తెరువులు చూపే వ్యవస్థలు ఏర్పరచారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే కుటుంబాలకు సాయం చేసి, నిలద్రొక్కుకునేట్లు చూసారు. వృద్ధులకు గౌరవాన్నీ, ప్రేమను పంచే కేంద్రాలను ఏర్పాటు చేసారు. ఇక అటుపైన వాళ్ళకు అసంతృప్తి అన్నమాటే గుర్తు రాలేదు!