Facebook Twitter
మంచితనం

సుమంతపురంలో నారాయణ పండితుడు, శివ పండితుడు అని ఇద్దరు విద్యావంతులు ఉండేవారు. వారు శత్రువులు కాదు మిత్రులు కారు. ఇలా ఉండగా ఆ ఊరి ఆలయానికి అర్చకుని అవసరం కలిగింది. 
నారాయణ పండితుడు తన బంధువుల్లో ఒకరిని అర్చకునిగా తీసుకురావాలని అనుకున్నాడు. అలాగే శివ పండితుడు కూడా!.  కానీ జమీందారు విద్యాదత్తుడు అనే యువకుడిని అర్చకునిగా ఆలయానికి పంపించారు. విద్యాదత్తుడు ఆలయంలో పూజలు చక్కగా చేస్తూ ప్రజల మన్ననలు పొందసాగాడు. ఊరిలో ఉన్న నారాయణ, శివ పండితుల వద్ద గౌరవంగా ఉండే వాడు. అతను అందరి వద్ద మెప్పు పొందడంతో ఆ ఇద్దరు పండితులు అసూయపడే వారు. 
విద్యాదత్తుడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. అంత కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉండేది. అందుకని ఊరిలో పూజలు, వ్రతాలు చేసి సంపాదించేవాడు. ఆ ఊరికి నాలుగేళ్ల పాటు వర్షాలు లేక పంటలు సరిగా పండలేదు. ఇదే అదను అనుకుని నారాయణ, శివ పండితులు చేరువయ్యారు.విద్యాదత్తుడిని ఊరి నుంచి పంపించాలని అనుకున్నారు. 

ఒకరోజు నారాయణ పండితుడు, శివ పండితుడు జమీందారు వద్దకు బయలుదేరారు. దారిలో వారికి విద్యాదత్తుడు ఎదురయ్యాడు. అతన్ని చూడగానే వారు ఎక్కడినుంచి రాక అని అడిగారు. జమీందారు గారి వద్దకు వెళ్ళాను అని విద్యాదత్తుడు చెప్పాడు. ఏమిటో రాచకార్యం ! హేళనగా అన్నాడు నారాయణ పండితుడు, 'మన ఆలయంలో పూజల గురించి' హేళనకు చిన్నబోతు చెప్పాడు. ఆలయ పూజల గురించి జమిందారు గారితో మాట్లాడటం ఏమిటి? గ్రామంలో మనం ముందు అనుకోవాలి కదా! అంటూ శివ పండితుడు మండిపడ్డాడు. వారి వారి ఇరువురి దురుసుతనం చూసి "జమీందారు గారు మీతో మాట్లాడతామని చెప్పారు" అంటూ గబగబా వెళ్ళి పోయాడు విద్యాదత్తుడు.  
"వీడి గర్వాన్ని అణచాలి" అనుకుంటూ ఇరువురు జమీందారు దగ్గరకు వెళ్లారు. వారు వెళ్లేసరికి జమీందారు గారు ఎవరితోనో మంతనాలు జరుపుతున్నారు ఇద్దరూ బయట చాలా సేపు వేచి ఉండవలసి వచ్చింది. 
ఇంతలో దివాను రామబ్రహ్మం బయటకు వచ్చాడు "ఒకేసారి ఇద్దరు పండితులు వచ్చారు ఏంటి విశేషం? అని ప్రశ్నించాడు". మా గ్రామంలో నాలుగు సంవత్సరాల నుంచి వర్షాలు లేక పంటలు పండటం లేదు అల్లాడిపోతున్నాము అని చెప్పాడు నారాయణ పండితుడు అవునన్నట్లు శివ పండితుడు తల ఊపాడు. 
అయితే ఏం చేద్దాం? అడిగాడు దివానం. "వెంటనే ఆలయ పూజారిని  మార్చాలి" తెలియజేశాడు శివ పండితుడు. ఏం, ఎందుకు ప్రశ్నించాడు దివాను. అతను సక్రమంగా పూజలు చేయడం లేదు అన్నాడు నారాయణ పండితుడు. అవునవును ఆ విద్యావంతుడు సొంత పనులు చూసుకుంటూ ఏదో నామమాత్రంగా పూజలు చేస్తున్నాడు అంటూ శివ పండితుడు వత్తాసు పలికాడు. దివాను పకాలున నవ్వాడు. 
కిందటి వారమే జనమంతా ఇక్కడకు వచ్చారు. మా అర్చకుడు బాగా పూజలు చేస్తున్నారు అందుకే మేమంతా ప్రాణాలతో ఉన్నామని చెప్పారు అని అన్నాడు. వాడికి ప్రజల దగ్గర నటిస్తూ ఆకట్టుకోవడం తెలుసు ఇద్దరూ చెప్పారు. నిన్ననే మీ అర్చకుడు విద్యాదత్తుడు వచ్చాడు. వర్షాల కోసం వ్రతాలు చేయాలి. కరువు తొలగాలంటే వరుణయాగం అవసరం వ్రతాల వల్ల గ్రామ సుభిక్షం అవుతుంది అందుకు తగినవారు గ్రామంలోని నారాయణ, శివ పండితులని మీ గొప్పతనం చెప్పాడు మరి మీరేమంటారు? ఎదురు ప్రశ్న వేశాడు దివాను. 
"ఇద్దరూ పండితులు బిక్క మొహాలు వేస్తూ" సరే అవునవును అన్నారు. అప్పుడే జమీందారు అక్కడికి వచ్చారు . ఆయన వారితో "మీరు గ్రామ కరువు గురించే మాట్లాడుతున్నారా! వచ్చేవారం ఏర్పాట్లు చేయండి" అన్నారు జమీందారు గారు. 
"మీరు అనుమతిస్తే నేను స్వయంగా వెళ్లి అక్కడ యజ్ఞయాగాదులు చేయిస్తాను. వీరిద్దరూ మహాపండితులు కదా! అంటూ జమీందారు ఆజ్ఞ కోరాడు దివాను. సరే అంటూ జమీందారు అనుమతించారు. 
పండితులు చేసేదిలేక తిరుగుముఖం పట్టారు తరువాత విద్యాదత్తునితో కలిసి మెలిసి ఉండసాగారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా చివరికి విద్యాదత్తుడి మంచితనమే అతడిని గెలిపించింది.