గాంధీజీ మీద ఒక శతకం
కృష్ణాజిల్లా గుడివాడ పక్కన ఓ చిన్న గ్రామం - అంగలూరు. ఊరు చిన్నదే కానీ దీని ఘనత మాత్రం అసమాన్యం. త్రిపురనేని రామస్వామి చౌదరి వంటి ప్రముఖులు ఎందరో ఈ గ్రామవాసులే! స్వాతంత్ర్య సంగ్రామంలోనూ, కమ్యూనిస్టు ఉద్యమంలోనూ ఈ గ్రామ ప్రజలు చాలా చురుగ్గా ఉండేవారు. అలాంటి అంగలూరులో దుగ్గిరాల రాఘవచంద్రయ్య అనే స్వాతంత్ర్య సమరయోధుడు ఉండేవాడు.
రాఘవచంద్రయ్య వ్యక్తిగత జీవితం గురించి తక్కువ విశేషాలే తెలుస్తున్నాయి. తెలిసినంతలో ఆయనకు గాంధీజీ అంటే వీరాభిమానం అని మాత్రం తేలుతోంది. గాంధీ పిలుపు విని ఆయన సహాయనిరాకరణోద్యమం వంటి పోరాటాలలో పాల్గొనేవారు. అలాంటి ఓ సందర్భంలో జైలుకి కూడా వెళ్లారు. నీలం సంజీవరెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి కాంగ్రెస్ యోధులు ఆయనతో సన్నిహితంగా ఉండేవారు.
రాఘవచంద్రయ్యగారికి మొదటినుంచీ సాహిత్యం మీద మంచి పట్టు ఉండేది. చదువుకునే రోజుల నుంచి అద్భుతమైన రచనలు చేసేవారు. దానికి తోడు వేదాల నుంచి పురాణాల దాకా శాస్త్రగ్రంథాలన్నింటి మీదా ఆయనకు అవగాహన ఉంది. తనకి ఉన్న పాండితీప్రకర్షతో, సాహిత్యాభిలాషతో రాఘవచంద్రయ్యగారు ఒక శతకాన్ని రాయాలని అనుకున్నారు. కానీ ఎవరి మీద రాయడం. శతక కవులంతా కూడా తమకి ఇష్టమైన దేవుళ్ల మీద శతకాలను రూపొందించారు. కానీ రాఘవచంద్రయ్యగారికి గాంధీజీనే దేవునితో సమానం. అందుకని ఆయన మీదే ఒక శతకాన్ని రాయాలని సంకల్పించారు.
అలా గాంధీగారికి ఉన్న 20కి పైగా లక్షణాలని వర్ణిస్తూ 101 పద్యాలలో ‘గాంధిజీ శతకం’ పేరుతో ఒక శతకాన్ని రూపొందించారు. హరిజనసేవ, స్వరాజ్యదీక్ష, అహింసాచరణ, శాకాహారదీక్ష, అహింస, క్షమ, సత్యం, అభయం, కారుణ్యం, నిష్కామసేవ, పితృమాతృభక్తి... ఇలా గాంధీజీలో ఉన్న గొప్ప లక్షణాలని వర్ణిస్తూ ఈ శతకం సాగుతుంది. 1941లో ముద్రించిన ఈ శతకం అప్పట్లో ఒక సంచనంగా మారింది.
ప్రస్తుతానికి ఈ శతకం దొరకడం కష్టంగానే ఉంది. ప్రభుత్వపు డిజిటల్ లైబ్రరీలో దీని ప్రతి ఉంది. ఆ శతకంలోని ఒక పద్యం మచ్చుకి…
పంచములంచుఁ బిల్చుటది పాపమటంచును బల్కి యెంతయు
న్మంచితనమ్ముతో హరిజనమ్ములు నాఁజను పేరు నిచ్చి ధ
ర్మాంచితరీతి హైందవుల యాదరణమ్మును బొందఁ జేసి ర
క్షించితి కోట్ల సజ్జనుల నెల్లరు మెచ్చఁగ నీవు గాంధిజీ!
(స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా)
- నిర్జర.
