Facebook Twitter
కాశీ పట్నం చూడర బాబూ!

 

కాశీ పట్నం చూడర బాబూ!

 


‘కాశీ పట్నం చూడర బాబూ’ అన్న వాక్యం తరచూ వినేదే! ఏదన్నా విచిత్రమైన ప్రదేశం గురించి చెప్పాలనుకున్నా, వింత విషయాన్ని పంచుకోవాలనుకున్నా ఈ మాటని వాడుతూ ఉంటారు. నిజానికి ఆ వాక్యం జానపదుల పాటలోది. ఇప్పుడంటే కాలక్షేపం కావడానికి చాలారకాల మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయి. టీవీలు, సినిమాలు, వీడియోగేమ్స్, సోషల్‌ మీడియా... ఇలా ఏదో ఒకటి మన చేతికి అందే దూరంలోనే ఉంది. కానీ ఒకప్పుడు వినోదం కావాలంటే చాలా శ్రమించాల్సి వచ్చేది. నాటకాలు, హరికథలు, బుర్రకథలు లాంటి కళారూపాలతోనే వినోదం దొరికేది.

అలాంటి సమయంలో ఓ పెట్టెకి ముస్తాబు చేసి, అందులో నాలుగు బొమ్మలు చూపించి సొమ్ము చేసుకునేవారు. దాన్ని జంతర్ మంతర్‌ పెట్టె అనేవారు. ఆ పెట్టెలో కాశీ క్షేత్రం దగ్గర నుంచీ తాజ్‌మహల్‌ వరకూ రకరకాల చిత్రాలు చూపించేవారు. పిల్లలు అలా బొమ్మలు చూస్తుండగా నేపథ్యంలో ఆ బొమ్మలకి అనుగుణమైన పాట పాడేవారు. ఆ పాటే ఇది…


పైస తమాషా చూడర బాబూ
ఏమి లాహిరిగా ఉన్నది చూడు
ఏమి తమాషాలున్నయి చూడు

కాశీ పట్నం చూడర బాబూ
కలకల లాడే గంగా నదిని
కన్నుల కఱవుగ చూడర బాబూ
హరిశ్చంద్రుడు సత్యంకోసం
ఆలిబిడ్డలను అమ్మిన చోటు
అదుగదుగదుగో విశ్వేశ్వరుడు
హర హర హర యను భక్తుల చూడు
చూచి మోక్షం పొందర బాబూ    ॥పైస॥

హస్తినాపురీ పట్నం చూడు
పాండవులేలిన పట్నం చూడు
తాజమహలును చూడర బాబు
కృష్ణదేవరాయలని చూడు
బెజవాడలో కనకదుర్గను
భద్రాచలములో రామదాసును
కన్నుల పండువుగ చూడర బాబూ
చూచి జ్ఞానం పొందర బాబూ


ఈ గేయం ప్రేరణగా వాగ్దానం అనే సినిమాలో శ్రీశ్రీ ఒక పాట రాశారు. ‘కాశీ పట్నం చూడర బాబు కల్లా కపటం లేని గరీబు’ అంటూ ఆ పాట సాగుతుంది.