Facebook Twitter
ఆమె జీవితంలో ఒక రోజు

ఆమె జీవితంలో ఒక రోజు

 

 


తెల్లారితే చెయ్యాల్సిన పనులు కలల్లోనూ వెంటాడుతుంటే
నిద్దర చాలక బరువెక్కిన ఆమె కళ్ళల్లోనే పొద్దు పొడిచినట్లుంటుంది
చెమటతో తడిసిన ఆమె పల్చని దేహం
టేబుల్ మీద పేర్చిన వంటకాల్లో ఘుమఘుమలాడుతుంది

ఇంటిల్లిపాదినీ తృప్తిపరిచే క్రమంలో
ఎన్నిసార్లు గెలిచినా ఆమె ఓడుతూనే ఉంటుంది
ఆరేసిన బట్టల్లో, కడిగిన గిన్నెల్లో, తుడిచిన నేలల్లో
తన జీవితంలో లేని మెరుపులు వెతుక్కుని మురుస్తుంటుంది

ఇల్లంతా సర్వాంతర్యామిలా తిరుగుతూ పని చేసే ఆమె
అరడజనుసార్లు మోగేదాకా ఫోనెందుకెత్తవని గద్దించిన
భర్తకు చెప్పడానికి సరైన సమాధానం లేక
మాస్టారిముందు లెక్క తప్పు చేసిన పిల్లాడిలా తడబడుతుంది

అలసిన సూర్యుడు పడమటి పక్కన వాలినారు ఘడియలక్కూడా
మర్నాడు కుటుంబానికి కావాల్సినవమర్చడంలోనే ఉంటుంది
యమధర్మ రాజొచ్చినా రేపటి వంటయ్యాకా రమ్మని బతిమాలుతుంది
అలసిన దేహాన్ని పక్కపై వాల్చినపుడు మగని ఒంటివేడి చల్లార్చడంకోసం
ఆమె మరోసారి తనను తాను వెలిగించుకుంటుంది

వేలికొసలతో సున్నితంగా తెరిచి ఆపాదమస్తకం తడిమే కలువ కనుల స్పర్శకై
ఏళ్ళతరబడి వేచిన నేస్తం అలిగి అలమరలో ముడుచుక్కూర్చుంటుంది
తనని మీటుతూ పలికించే గమకాల పులకరింతలకోసం వేచిన
మరొక నేస్తం ఈజిప్షియన్ మమ్మీలా పేటికలో భద్రంగా నిద్ర పోతుంది
పెళ్ళికి ముందు పుట్టిన చిత్రరాజం మాసిన గడ్డంతో గోడకి ఉరేసుకుంటుంది

రోజూ తనని వెక్కిరించే వీటివంక చూసే తీరికే లేక చీకట్లో ఒంటరిగా నిట్టూర్స్తుంది.
కొత్తగా తలలో మొలిచిన తెల్ల వెంట్రుకామెను చూసి పకపకా నవ్వుతుంది.

- శారద శివపురపు