చెత్తకుండీ గుండె పగిలిన వేళ - శారదా అశోకవర్ధన్

చెత్తకుండీ గుండె పగిలిన వేళ - శారదా అశోకవర్ధన్   టపటప మని మబ్బుల పేగులు తెంచుకుని గాలి తాకిడికి రాలిన నీటి చుక్కలని చూసి రాని నిద్దురకోసం అలసటతో అల్లాడే పావని జోకొడితే బజ్జుంటుందేమోనన్న అమ్మ ఆశలా పుడమితల్లి పులకరిస్తూ ఒళ్ళు విరుచుకుని కళ్ళు పెద్దవి చేసి చూసింది పసిపాప బోసినవ్వులాగే హాయిగా నవ్వుకుంది! సబ్బు నురగల్లోంచి విరిస్తే సుగంధ పరిమళంలా నీటి చుక్కతో తడిసి మట్టి చిమ్ముతున్న ఆ వాసనకి తన్మయత్వంతో నేల నింగికొచ్చేసింది మురిసిపోయింది! అంతలోనే ముక్కుపుటాలదిరిపోయేటట్టు విస్తరించిపోయింది క్షీరసాగరమధనంలో ముందుగా వీచిన విషవాయువుల్లా అల్లుకుపోయింది పక్కనే రోడ్డునిండా పడున్న చెత్తకుండీలోంచి అలలు అలలుగా అగిసిపడుతున్న దుర్వాసన తల తిరిగిపోయేలా కడుపులోకి దూసుకుపోతున్న గబ్బువాసన చెత్తకుండీ ఆకారం సగం పగిలి తరుగుతూన్న చందమామ విరిగిన ముక్కలా వికృతంగా కనిపిస్తూన్నట్టుంది క్రితంరాత్రి ఎవరో ప్రముఖులకు స్వాగతం పలకడానికి ఉపయోగించుకుని తరువాత తన్ని తగలేస్తే దొర్లుకుంటూ పోయి ఫ్రాక్చరయి పడున్న వ్యక్తిలా వుంది అల్లంత దూరాన చెత్తకుండీ - ఎప్పటినుంచో అక్కడ గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్తా చెదారం తమనట్లా రోడ్డు మీదకు విసిరిపారేసి, తప్పంతా తమదే అయినట్టు ఇప్పుడు అసహ్యించుకుంటూన్న పెద్దమనుషుల ప్రవర్తన చూసి ఆవేదనతో అలమటించిపోతూ కుళ్లి కుళ్లి ఏడ్చాయి పాత రోజులు గుర్తుకొచ్చి కళ్ళు చమర్చాయి కొత్త లారీలలో తమని మోసుకుపోయే వారు ఊరిచివర ఆరుబయట అతి జాగ్రత్తగా చేరవేసేవారు ధూళితో ఆడుతూ గాలితో పాడుతూ దినకరుని వెచ్చని ఒడిలో హాయిగా తేలుతూ చక్కని ఎరువుగా మారి పచ్చని చెట్లకి తోడ్పడేవారం మేము సైతం మంచి పనికి ఉపయోగపడుతున్నామని తృప్తి పడేవాళ్లం ఆరోజుల మోజులు గాధలుగా మారిపోయాయి బాధలు మాత్రం మిగిలిపోయాయి ఇప్పుడు మాతో వుండేది చెత్తా చెదారం మాత్రమే కాదు ఘోర భయంకర పాపభూయిష్టమైన పైశాచిక శక్తి ఆవరించుకున్న కాముకుల రహస్య కామకేళీ కృత్యానికి బలిపోయిన పసికందు - కట్నపిశాచికి ఝడిసి ఆడపిల్ల అని తెలియగానే భ్రూణహత్యకు పాల్పడే పాపాత్ముల ఘాతుకానికి ప్రాణాలు పొగొట్టుకున్న చిట్టితల్లి మాంసపు ముద్ద తిన్నదీ తాగిందీ ఇమడక ఒక బీరుదాసు ఒక బ్రాందీనాధుడు ఒక విస్కీరాజు కక్కిన వాంతుల దిబ్బలు చిచ్చు పెట్టినా తగలబడని భ్రష్టుపట్టిన రొచ్చు! మమ్మల్ని పట్టించుకునే నాధులు లేరు ఎండకి ఎండుతూ వానకి నానుతూ అందరిచేతా తిట్లూ చీత్కారాలూ అందుకుంటూ కన్నీరు మున్నీరుగా రోదిస్తున్న మాది అరణ్యరోదనే! మమ్మల్ని భరించేదీ ఒళ్లో ఓపిగ్గా దాచుకునేదీ పుడమితల్లి ఒక్కర్తే - కనీసం వరుణుడు కరుణిస్తే గోతులు పడ్డ రోడ్లనిండా నీరునిండుకున్నపుడు మేమూ ఆ వరదలో కొట్టుకుపోయి తలా చోట పడితే గాలిపుణ్యమా అని జోరుగా వీచితే దూరంగా విసరబడితే ఎక్కడో అక్కడ గడిపేసి ధూళిలో కలిసిపోతామా అని మా పోరాటం నేల తల్లి ఆరాటం! ఏం పాపమో ఎవరి శాపమో వానలూ కురవడం లేదు ఆకాశ హర్మ్యాల్లాంటి భవనాలు వెలిశాక గాలివీచడం లేదు - పెళ్ళికాని ఆడపిల్లల తల్లి కలల్లాగా పుడమితల్లి కోరికలూ కరిగిపోతున్నాయి గుండె పగిలి బీటలుబారిన పగుళ్లలోంచి వెలువడే వేడి నిట్టూర్పుల బాధలను చెప్పకుందామంటే చెట్లూ చేమలూ కూడా ఎక్కడా లేవు కొండలూ బండలూ కూడా దరిదాపుల్లో లేవు గుట్టలు గుట్టలుగా పెరిగిపోయిన చెత్తలాగా గుంపులు, గుంపులుగా పెరిగిపోయిన జనాభా తప్ప - ఒంటరిగా పుడమితల్లి రోదిస్తోంది చెత్తకుండీని ఓదారుస్తూ తరతరాలుగా రకరకాల బాధలననుభవించే తరుణిలాగా ధరణికూడా రోదిస్తోంది చెత్తను మొయ్యలేక కాదు చెత్తను చీదరించుకుంటూ చెత్త మనస్తత్వాన్ని పెంచుకునే చెత్త మనుషుల గురించి ఒంటరిగా పుడమితల్లి రోదిస్తోంది!    

ఏమో! - శారదా అశోకవర్ధన్

ఏమో! - శారదా అశోకవర్ధన్   మానవుడా! మానవత్వాన్ని గుండెనిండా నింపుకుని దైవత్వం పొందిన సాధువులా జీవనాన్ని సాగించే మహామహుడా! జీవనయానంలో అలుపెరుగని ప్రయాణికుడా! ఎందుకిలా దానవుడిలా మారిపోయావ్? ఏమైంది నీ సౌందర్యారాధన కవితలో కథలలో చిరుగాలిలో చిన్న వాన చినుకులో వెలుగులో, వేడిలో, నీలి మబ్బులో, మెరుపుతీగెలో పువ్వులో, నవ్వులో, రాతిలో, నీటిలో అందాలను చేసి ఆరాధించేవాడా ఎందుకిలా మారిపోయావ్? చెట్టుకొమ్మలూ చెరువుగట్లూ ఆకాశంలోని చుక్కలూ ఆత్మను స్పందింపజేసి అలలూ అన్నీ నీకు పరిశోధనాంశాలే! ఇంద్రధనస్సూ ఇంద్రియాసక్తీ అన్నీ నీకు ఆలోచనల రేకెత్తించి పులకరింపజేసే అంశాలే అవన్నీ ఒదిలి ఎందుకిలా మారిపోయావ్ నేలతల్లి గొంతును రక్తంతో తడుపుతున్నావు కత్తులతో కుత్తుకలు కోస్తున్నావు బాంబులతో భస్మం చేస్తున్నావు తోటిమనిషిని తోడేలువై పీకుతున్నావు మానవుడా! నువ్వు మారాలి! స్వార్ధానికి కోరలు పీకి పారెయ్యాలి మానవత్వానికి మమతల పన్నీరు జల్లి    

ఇప్పుడే తెలిసింది - శారదా అశోకవర్ధన్

ఇప్పుడే తెలిసింది - శారదా అశోకవర్ధన్   అబలవూ ఆడపిల్లవూ అంటూ అందరూ నిన్ను అలుసుగచూసేవాళ్ళే పుట్టగానే పురిటి ఖర్చులూ నీకు పెట్టె ప్రతీ పైసా దండగని ఊహించుకుంటూ నిన్ను కనడం ఖర్మంటూ నీ తమ్ముడికోసం కలలు కంటూ నిన్ను ఆరడిపెడుతూ వుంటే నోరు విప్పని నన్ను చూస్తే నాకే సిగ్గేస్తోంది నవనాగరికత నన్ను చూసి నవ్వుతోంది! చిట్టిపాపగా గంపెడు ఆశలు కళ్ళనిండా నింపుకుని అమ్మ వెంట నీడలా తిరుగుతూ వంటఇంటిలో సాయం చేస్తూ మాడిన గిన్నెల్నీ మసిబారిన గిన్నెల్నీ గరగరలాడే మట్టితో తోమి తోమి రక్తం పేరుకు అరిచేతులు మండిపోతే మండే చేత్తో మాడే కడుపుతో అందరు తినగా మిగిలిన మెతుకులు గతికి బండెడు చాకిరి ఒంటిగ చేస్తూ అలుపు తెలియని అమాయకతతో బాల్యమంతా గడిపే నిన్ను ఆదుకోలేని నన్ను చూస్తే ఒళ్ళుమండుతోంది నాకే నా డిగ్రీలు నన్ను చూసి విరగబడి నవ్వుతున్నాయి పెళ్ళి పెళ్ళని ప్రేరేపించి లేనిపోని ఆశలు రేపి చదువు కాస్తా మాన్పించేసి అంతా అతనికే ఇచ్చి గుండె బరువు తీరిందంటూ సంబరపడే నీవారిని చూస్తూ 'ఇక ఆ యిల్లే నీ స్వర్గం అతడే నీ ప్రభువు' అంటూ నీతులు చెబుతూ నిను పంపిస్తుంటే కళ్లనీళ్లు దాచుకుంటూ కన్నవారిని ఒదులుకుంటూ బిక్కుబిక్కుమని నువు వెళుతూవుంటే నీ వ్యక్తిత్వం నిలబెట్టు మాటలు మచ్చుకైనా చెప్పని నన్ను చూసి నా పేరు ప్రతిష్టలు పగలబడి నవ్వాయి జాలిగా చూశాయి! నాలో రగిలిన కోపం జ్వాలై కళ్ళల్లో నిప్పులు చెరిగింది కరిగిపోయిన మరిగిపోయిన కన్నీరు చెంపలపై జారింది పెదవులు విడిపడ్డాయి పిడికిళ్ళు బిగుసుకున్నాయి అప్పడే తెలుసుకున్నాను నాలోని సబలత్వం సజీవంగానే నిలిచివుందని నా వ్యక్తిత్వం నన్ను మనిషిగా నిలబెట్టిందని అడుగు ముందుకు వేశాను! నా అనుభూతిని అందరితో పంచుకోవాలని ఆడది అబలకాదని అందరికీ చాటించాలని అడుగు ముందుకువేశాను.    

స్నేహ కృష్ణ - శారదా అశోకవర్ధన్

స్నేహ కృష్ణ - శారదా అశోకవర్ధన్   కాలేజీకెళ్ళే వారందరికీ ఆమె తెలుసు ఆమె చదువుల తల్లి కనుక - కవితలల్లే వాళ్ళందరికీ ఆమె పరిచయమే కవయిత్రి కనుక - సహృదయులందరికీ ఆమెతో నెయ్యమే స్నేహశీలి గనుక - కృష్ణకుమారిని చూస్తే ఇంకా ఏదో నేర్చుకోవాలన్న తృష్ణ పెరుగుతుంది ఆమె పలుకులు పట్టుకుచ్చుల్లా మెత్తగా ఉంటాయి హృదయాన్ని స్పందింపజేస్తాయి తెనుగు భాష తేనెమడుగులో శ్వేతకమలమై వికసిస్తుంది ఆమె కవితా స్రవంతికి నదిలోకి అలల్లా మదిలోని భావాలు అందంగా ఆహ్లాదంగా కదులుతూన్నట్టనిపిస్తుంది ఆమె సౌమ్యగుణం మమకారానికి మాటలు నేర్పుతూన్నట్టుంటుంది ఆమె మౌనం - ఆలోచనలు రేపుతున్నట్టుంటుంది ఆమె స్నేహం - తీపిని మరిపిస్తుంది అజ్ఞానాన్ని తరిమి కొట్టే వృత్తి ఆమెది విజ్ఞానానికి హారతి పట్టే ప్రవృత్తి ఆమెది అంత ఒదిగి వుండే లక్షణం ఆమెది ఆమె తలపులన్నీ సాహితీ తరంగాలే! ఇచ్చకాలకు పోదు రచ్చకెక్కదు నిగర్వి ఆమె నిత్యాన్వేషి ఆమె నిదానం ఆమె నినాదం సంస్కారం ఆమె అలంకారం    

మనసా! తెలుసా? - వడ్డెపల్లి కృష్ణ

మనసా! తెలుసా? - వడ్డెపల్లి కృష్ణ   చీకు చింతలేని చిరుత వయసును దలువ చిత్తమే పులకించు మనసా! బ్రతుకులో బంగారు ప్రాయమ్ము బాల్యమ్ము స్మృతులుగా పలికించు తెలుసా?   కన్న ప్రేమలు కడకు కన్నీళ్ళు సైతమ్ము కల్తీల మయమాయె మనసా! భ్రష్టలోకమ్ములో కల్తీల జగతిలో బ్రతుకంటే దుర్లభం తెలుసా?   లక్షణముగా కన్యలున్ననూ మగజాతి లక్షలను కోరేను మనసా! వరుడు కట్నము పేర వధువు కమ్ముడు వోవు వ్యాపార సరుకాయె తెలుసా?   బ్రాందీలు, విస్కీలు, సిగరెట్ల అలవాట్లు కలవాడె మనిషియట మనసా! ఎల్లవేళల వాటి బానిసై బ్రతికితే ఇల్లు గుల్లయ్యేను తెలుసా?   నిప్పులాంటిది అప్పు, అందుకే అది ముప్పు నిజమెరిగి మసలుకో మనసా! అప్పులెన్నో చేసి గొప్పకు పోతె చిప్పలే చివరిగతి తెలుసా?    

ముగ్గురమ్మల మూలపుటమ్మ - శారదా అశోకవర్ధన్

ముగ్గురమ్మల మూలపుటమ్మ - శారదా అశోకవర్ధన్   నవమాసాలు మోసి ఎంతో ప్రయాసకోర్చి జన్మనిస్తుంది కన్నతల్లి పొత్తిళ్లలో పొదివి పట్టుకుని గుండెలకి హత్తుకుంటూ స్తన్యమిచ్చి పెంచుతుంది తన బలాన్ని క్షీరధారగా మర్చి గోరుముద్దలు తినిపిస్తుంది చందమామని చూపిస్తూ పలుక నేర్పుతుంది అమ్మ ఆడిస్తూ లాలిస్తూ ప్రాణానికి ప్రాణంగా కవచంలా నిలుస్తుంది బుజ్జి బుజ్జి కబుర్లకి పదునుబెట్టి పాఠాలు నేర్పుతుంది పంతులమ్మై మెదడుకు సానబట్టి తన మెదడులోవన్ని నీకు సరఫరా చేస్తుంది తన పాండిత్య ప్రతిభను నీకు పంచుతుంది అమ్మ నేర్పిన నడకకీ నడతకీ మరింత వన్నె తెస్తుంది అమ్మ తరువాత అమ్మ అంతటిది పంతులమ్మ అలా అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు మరో అమ్మ కూడా వుంది - మూడో అమ్మ ప్రతి మనిషికీ ఎప్పుడో అప్పుడు తగులుతుంది తెల్లటి దుస్తుల్లో పాలరాతి బొమ్మలా వుంటుంది మనసును కూడా తెల్లగా వుంచుకుంటూ మలినాన్ని ఏరిపారేస్తుంది ఆపదలో ప్రాణ రక్షణకు వెళ్ళిన వారికి సపర్యలు చేసి కొత్త ఊపిరి పోస్తుంది చిరునవ్వుతో బాధని తొలగించి ఉపశమనం కలిగిస్తుంది పదునైన సూదిని మృదువైన మాటలతో నరాలకు గుచ్చి నవ్వుతూ ఊరడిస్తుంది ఆ అమ్మే నర్సూ ప్లస్ అమ్మ..... నర్సమ్మ! ఈ ముగురమ్మలూ జీవనానికి ఆరో ప్రాణం ఈ ముగురమ్మల మూలపుటమ్మ కనిపించని కర్పూరపు బొమ్మ మనసున్న మనిషి కే పలికే వరాలకొమ్మ ఆమె పేరు మానవత్వం ఆమె ఊరు మంచితనం ఎక్కడో అంతరాంతరాల్లో ఏదో ఒకమూల ఇసుమంత స్థలముంటే ఇమిడిపోతుంది గుండెలోపలి మమతనీ మనసు తెలిసిన మనిషినీ అయస్కాంతంలా పసిగట్టి గబుక్కున లాగేసుకుంటుంది ముగ్గురమ్మలకి మూలపుటమ్మ ఈ అమ్మ మనుగడకి మూలస్తంభం ఈ బొమ్మ! ఈ ముగురమ్మలకీ మంగళహారతులివ్వాలి అప్పుడే ఈ భూమి మళ్ళీ పుణ్యభూమిగా మారుతుంది సకల శాస్త్రాల వేదవల్లిగా మిగులుతుంది అలా జరుగుతుందంటావా మానవుడా సమానత్వ సౌభ్రాతృత్వం మళ్ళీ చిగురిస్తుందంటావా?

నానీడవే అయినా - శారదా అశోకవర్ధన్

నానీడవే అయినా - శారదా అశోకవర్ధన్   మేలుకొలుపకు నన్ను మేలు కొలుపకు నువ్వు కనుమూసి కలనైన తేలిపోనివ్వు.... ఉరుకు పరుగుల బతుకుబాటన అలసిపోయిన నన్ను అలుపు తీరేదాకా హాయిగా కాస్సేపు నిదుర పోనివ్వు... మేలుకొలుపకు నన్ను మేలు కొలుపకు నువ్వు.... కనుముండు జరిగేటి కటిక ఘోరాలెన్నో కనలేని నా కళ్ళు నిదుర వాకిట్లో నిండు చీకట్లో మైమరచి క్షణమైన మరచిపోనివ్వు మేలుకొలుపకు నన్ను మేలు కొలుపకు నువ్వు.... ఎదనిండా బెంగలు ఎండిపోయిన ఆశలు దండగ బతుకని బెంబేలు పడువేళ ఒడలు తెలియని నిదురలో బెడదలేని హాయిలో మేలుకొలుపకు నన్ను మేలు కొలుపకు నువ్వు... నా నీడమైనా నీకు నమస్కరిస్తాను నీ పాదాల మీద పడి నీకు మొక్కుతాను! స్వేచ్ఛాగీతం పాడుకోనివ్వు మనసంతా వసంతాన్ని నింపుకోనివ్వు మేలుకొలుపకు నన్ను మేలు కొలుపకు నువ్వు.... గతకాలపు జ్ఞాపకాలను నెమరువేసుకునే వేళ వడలిపోయిన చైత్రశోభల దివ్యకాంతులు వెతుక్కునే వేళ ఊహకం దని భవిష్యత్తుని గమ్మత్తుగా ఊహించుకోనివ్వు మేలుకొలుపకు నన్ను మేలు కొలుపకు నువ్వు.... నా నీడవైనా నీకు నమస్కరిస్తాను నీ పాదాల మీద పడి నీకు మొక్కుతాను!        

వినరా .... వినరా …. తెలుగోడా....! - శారదా అశోకవర్ధన్

వినరా .... వినరా …. తెలుగోడా....! - శారదా అశోకవర్ధన్ అందుకో కాలాన్ని తెలుసుకో గతకాలపు వైభవాన్ని వేసుకో భావికి బాటలు బంగారు పీటలు - ఎమ్మన్నా ఏమున్నా నీ ఖ్యాతిని పెంచుకో నీ జాతిని నిలబెట్టే నీ సంస్కృతిని నిలుపుకో నీ దేశం నీ తల్లి నీ భాగ్యం నీ జన్మే మరువకు ఈ సత్యం రత్నగర్భ నీ దేశం- ఈ రొదలూ ఈ సెగలూ ఎప్పుడూ వుండవు రాగాలూ ద్వేషాలూ కలకాలం నిలవవు కన్నతల్లి కన్నీళ్లు కాలువలై పారకముందే జన్మభూమి దిక్కులేక పగుళ్ళతో బీటలు బారకముందే పరాయి దేశపు బడాయి నీలో పూర్తిగా ఇమడకముందే ఎగురవెయ్ నీ జాతి జెండా నింపుకో ఔన్నత్వం నీ గుండెనిండా    

ఎదురు చూపులు చూడకు! - శారదా అశోకవర్ధన్

ఎదురు చూపులు చూడకు! - శారదా అశోకవర్ధన్   నీ కన్నీటికి ఎదుటి వారి మనసు కరిగిపోతుందనుకోకు నీ కష్టాలను చూసి వాళ్ళ గుండె బద్దలయిపోతుందని అపోహపడకు నువ్వు చస్తే ఈ ప్రపంచం ఆగిపోతుందనుకోకు నీ కష్టం నీదే నీ బాధ నీదే నీ బతుకు నీదే! కన్నీటిలో మునిగి జాలి పాట పాడకు ఎవరో వచ్చి నిన్ను ఉద్ధరించాలని ఎదురు చూపులు చూడకు దగాపడిన దిగులు చెందకు దీనంగా బతకకు ఉత్తేజం నీవై ఉద్వేగం నీవై ఉరిమే మేఘం నీవై మెరిసే మెరుపువు నీవై నీ వ్యక్తిత్వానికి నువ్వే నాయకురాలివై నీ శక్తికి నీవే మహారాణివై స్వేచ్చ ఏ ఒక్కరి సొంతం కాదని బతికే హక్కు అందరికీ వుందని సబలవు నీవై సర్వము నీవై వ్యాపించు! ప్రపంచానికి చాటించు!    

ప్రస్తుత ప్రస్థావన! - శారదా అశోకవర్ధన్

ప్రస్తుత ప్రస్థావన! - శారదా అశోకవర్ధన్   పోరా దండుకు పోరా ముందుకు పోరా తోసుకు వడివడిగా దోచుకుపోరా దాటుకుపోరా దూసుకుపోరా తోసుకుపోరా పోరా పోరా వేగంగా! దాడులు చేసి దోపిడి చేసి కత్తి కటార్లతో తలనరికేసి మొగాడినైతే ప్రాణం తీసి ఆడది అయితే మానం తీసి తేరగా దొరికిన సొమ్మును తీసి బ్యాంకులో ఖాతా ఓపెన్ చేసి బీదా బిక్కి చచ్చేలాగా చిన్నా పెద్దా ఏడ్చేలాగా దొరికిన సరుకును కొనిపారేసి బ్లాకులో డబ్బులు సంపాదించి మేడలు మిద్దెలు కట్టిపడేసి కార్లూ బార్లూ నడుపుతుపోతూ పోరాదండుకు పోరా తోసుకు పోరా పోరా వేగంగా! అప్పుడు చూడరా నీ తడాఖా చూస్తూ పో ఆ తమాషా సలాములు నీకే సన్మానాల్ నీకే గులాములు చేసే హంగామా నీకే రాజకీయ రంగప్రవేశానికి టిక్కెట్టులు నీకే బంగారపు బిస్కెట్టులు నీకే పట్టుదలతో సాధిస్తే మెట్టుమెట్టు అంతస్థులు నీకే ! అప్పుడు దంచేసేయ్ ఉపన్యాసాల్ చించేసేయ్ నీతి శాస్త్రాల్ దేశమంటే మనుషులు కాదని దేశమంటే మట్టి ముద్దలని తేల్చేసెయ్ ఒక్క మాటలో చచ్చు జనాభా చావనీయమని పుచ్చు సమాజం పుచ్చనీయమని కాల్చేసెయ్ కసితీరా తోటివారిని కూల్చేసెయ్ పూరికొంపలని పీకేసెయ్ చెట్టూ చేమను పెంచేసెయ్ ఆస్దీ పాస్దీ ! అయితే, ఇంత తతంగం చేసేశాక ఇసుమంతైనా పొక్కనీయక నీలోనే అన్నీ ఇముడ్చుకుని సిగ్గూ ఎగ్గూ ఒదిలేసి పట్టేసెయ్ అందరి కాళ్ళూ వేళ్ళూ బతికేసెయ్ ఎలాగో ఓలాగు అంతకన్నా ఎందుకు నీతులు నీకెందుకు నీతులు గోతులు తీసి గొంతులు పిసికే నీ కెందుకు సూక్తులు చరిత్ర వొద్దు మనుషులు వొద్దు మనిషిగ బతికే మార్గం వొద్దు పద్దులు వొద్దు హద్దులు వొద్దు నువ్వంటే నీకే ముద్దు అందుకే లేదేదీ అడ్డు పోరా దండుకు పోరా ముందుకు పోరా పోరా ఎదుగుతుపో! అయితే, ఒక్కటి మాత్రం మరవకురా ఎప్పటికీ అది సత్యంరా ఎంత దోచినా ఎంత దాచినా నువ్వూ చావక తప్పదురా మణి మాణిక్యాలెన్నున్నా మట్టిలోనె నువు కలియుటరా మంటలోనె నువు మాడుటరా వెంటరారు నీ వాళ్లెవరూ జంట గూడరు నీ స్నేహితులు గడప దాటదు నీ సతి కాటి దాటరు నీ సుతులు అంతకాడికి ఎందుకు మోసం మెలేయుట మీసం పట్టరాని పౌరుషం ఎందుకురా ఒడిగట్టుట పాపం ముడిగట్టుట పైకం అందరి మేలూ కోరే విధముగ బతికే మార్గం చూడగలేవా మానవత్వం మంట గలపక మనిషి లాగా బతక నేర్వర రారా ముందుకు రారా తోసుకు రారా దూసుకు రా.....రా...... రా......! పైసా నిలవదు ఎల్లకాలము పదవులు కావు శాశ్వతమ్ము మనుషుల్లాగా బతికేటందుకు మానవతను పెంచేటందుకు మారణహోమం మానేటందుకు కుల మత బేధం కూల్చేటందుకు భాషా భేదం మాపేటందుకు ప్రాంతీయ తత్వం పారద్రోలగ హద్దులు చెరిపి ఎల్లలు తుడిపి సమ సమాజం నిర్మించేందుకు నవ భారతం సృష్టించేందుకు దూసుకురారా దాటుకురారా తోసుకు రారా రా.... రా... రా..... రారా రారా వేగంగా రారా రారా దైర్యంగా!    

చెదిరిపోతూన్న దృశ్యం - శారదా అశోకవర్ధన్

చెదిరిపోతూన్న దృశ్యం - శారదా అశోకవర్ధన్   మామ్మకి తాతయ్యంటే పంచదార చిలకలన్నా ప్రాణం తాతయ్యకి మామ్మంటే పండు మిరపకాయ పచ్చడి కన్నా పరమ ఇష్టం గతాన్ని కనీసం రోజుకు ఒకమారైనా తల్చుకుంటారు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ పోట్లాడుకుంటారు మామ్మ పసిపిల్లలా ఉడుక్కుంటుంది తాతయ్య మాటలకి మరింత ఉడికిస్తాడు ఆమెనేడిపిస్తూ తాతయ్య కళ్ళూ ముక్కూ కాలువ కట్టి మున్సిపాలిటీ తొంగిచూడని మురికి బస్తీలా అవుతుంది మామ్మ మొహం బస్తీనంతా హడలగొట్టి బలాదూర్ తిరిగే రౌడీలా వుంటుంది తాతయ్య వైనం మామ్మ ముక్కెర మీద విసురు విసుర్తాడు తాతయ్య 'పశువు ముక్కుకు తాడేసి లాగినట్లుంది నీ ముక్కుకు ముక్కెర అంటాడు 'వయసు మళ్ళినా రంగు పూసిన ఆ దీపాలు బొద్దింకల్లా వున్నా'యంటుంది తాతయ్య మీసాలని ఏవగించుకుంటూ మామ్మ మామ్మకి బొద్దెంకంటే భయమని తెలిసి మెల్లగా కఱ్ఱ పట్టుకుని లేచి ఊడిపోతున్న పంచె సవరించుకుంటూ మామ్మ మీది కొస్తాడు తాతయ్య కొట్టడానికి కాదు ముద్దెట్టుకోవడానికి! 'బొద్దెంక మీసాలు నా దగ్గెరికి రావొద్దు' భయపడిపోతుంది మామ్మ నిజంగానే వాటిని బొద్దెంకల్లా ఊహించుకుంటూ 'ముక్కెర పట్టి లాగి మరీ ముద్దెట్టుకుంటాను మూతి కడ్డంగా ముక్కెరెందుకో' తాతయ్య మీది మీదికొస్తాడు నా వెనకాలే దాక్కునేది మామ్మ అడ్డు జరగొద్దని బతిమాలుతుంది తాతయ్య నన్ను పట్టుకుని ముద్దెట్టుకుంటాడు ముసి ముసిగా నవ్వుకుంటాడు బొద్దు మీసాలు మెలేస్తూ అసలు విషయం మీకు తెలీదు కదూ ఆ రోజు తాతయ్యా మామ్మల పెళ్ళిరోజు! అమ్మా నాన్నా కొత్త బట్టలు కొన్నారు 'కాస్త మీసాల రంగు తెచ్చిపెట్టవూ? మా మంచి బాబువి' తాతయ్యకి చెప్పకు బతిమలాడింది మామ్మ బుంగమీసాలింకా నిగ నిగా మెరుస్తాయ్ అని నవ్వుకుంటూ నన్ను తన వెంట తోడు రమ్మన్నాడు తాతయ్య బజారుకెళ్ళి ముక్కెరకు తగిలించడానికి మూడు ముత్యాల గుత్తి కొనడానికి 'మీ మామ్మకి చెప్పకేం' అంటూ ముక్కెరకి ఈ గుత్తి తగిలిస్తే మీ మీమామ్మ మొహం ఇంకా వెలిగిపోతుంది అని నవ్వుకుంటూ చేతి కర్ర పారేసి నా చెయ్యిచ్చుకు నడిచాడు హుషారుగా తాతయ్య మామ్మల మధ్య నాకంచం- అమ్మ చేసిన పిండివంటలు కేసి ఆత్రంగా చూస్తూ కూర్చున్నాను 'ఈ ముత్యాల గుత్తిని ముక్కెరకు తగిలించి గారెలు తిను చూద్దాం' గుత్తి నందించాడు తాతయ్య 'ముందు ఈ రంగుని మీసాలకు పూసుకొని రండి నిగనిగ లాడుతాయి వస్తాదు మీసాల్లా' అంది మామ్మ గర్వంగా రంగు నందిస్తూ క్షణం ఇద్దరూ నోట మాట రాక మొహమొహాలు చూసుకున్నారు బిత్తరపోయి 'బొద్డెంకల్లాంటి మీసాలు నీకిష్టం లేదని తీయించేశా పిల్లా' రంగు సీసా కేసి పకపకా నవ్వుతూ అన్నాడు తాతయ్య 'పశువుకు కట్టినట్టున్న ముక్కెర'మీకు నచ్చలేదని మార్పించేశాను' ముసిముసిగా నవ్వింది ముత్యాల గుత్తి చూస్తూ మామ్మ ఇద్దరూ పకపకా నవ్వుకున్నారు ఆ నవ్వుల్లో వెన్నెలలు పండాయి అమ్మా నాన్నల చిరునవ్వులు జీరబోయిన గొంతులో గుస గుసలాడాయి మళ్ళీ మామూలే! మామ్మ తాతయ్యల పసివాడని పసిడి జ్ఞాపకాల మధ్య కసికసిగా దెబ్బలాటలు! 'నిక్షేపంలాంటి ముక్కెర మార్చిపారేశావ్! నీమొహం చూడ బుద్ది కావడం లేదు' తాతయ్య చీదరింపు. 'సంపెంగ పువ్వులాంటి మీసాలు తీసి పారేశారు! పప్పు శుద్దలా వుంది మొహం' మామ్మ విసుగు 'పోనీలే మామ్మా నీకు బొద్డెంకలు జ్ఞాపకం రావు తాతయ్యను ముద్దెట్టుకోవచ్చు'అన్నాన్నేను 'ఆరిభడవా! అచ్చు మీ తాతయ్య పోలికే' కౌగిలించుకుంది మామ్మ 'ఓరి చిచ్చరపిడుగా!అన్నీ మీ మామ్మ మాటలే' ముద్దెట్టుకున్నాడు తాతయ్య వారి కళ్ళల్లోని కాంతి వేయి బల్బుల సమానం వారి మనస్సుల్లో శాంతి ఊహకందనంత వైశాల్యం వారి పోట్లాటల్లో కలిసి జుర్రుకున్న ఆనందం మాటలకందని మాధుర్యాల తీయదనం వారి ప్రేమలో కలిసి పంచుకున్న ఆవేశం ఆరాటం అపార్ధాలు ఆప్యాయతలు అనురాగాలు అభిమానాలు కలగలిపిన నిండైన జీవితం కదంబం మాల నుంచి నింపే పరిమళం మల్లెలు పొన్నులు మరువాలు కలగలసిన సుమహారం ఆ జీవితం పరిపూర్ణమైన సంతృప్తికి సంపూర్ణమైన నిదర్శనం నేడు పగలే దివిటీతో గాలించినా కనబడక మరుగుపడిపోయిన ఈ అదృశ్య పంత్ర చిత్రం వర్తమానంలో చెదిరిపోతున్నదేమోనని నా భయం రేపటి నా తరానికి ఈ తీపి గుర్తులు చెరిగిపోకూడదని నా ఆరాటం!

ఒంటరితనం - శారదా అశోకవర్ధన్

ఒంటరితనం  - శారదా అశోకవర్ధన్ ఒంటరితనాన్ని ఒక్కక్షణమైనా భరించలేను తుంటరుల మధ్య అంతకన్నా మనగలుగుతాను ఒంటరి రాక్షసి మనస్సుని గాలమేసి పట్టేసి పిచ్చిపిచ్చి జ్ఞాపకాల ఊబిలోకి లాగేస్తుంది నా నీడని చూసి నేనే భయపడేట్లు భ్రమింపజేస్తుంది అంతటితో ఊరుకోదు ఒక పట్టున ఒదిలిపెట్టదు గింజుకున్నా జుట్టుపీక్కున్నా ఎంత నిభాయించుకున్నా! వర్తమానపు ఆలోచనలని 'స్కాన్'చేసి పరీక్షించినట్టు మండుతున్న గుండెకి సమిధల్లా వాడుతుంది గజిబిజి ఊహలతో గందరగోళం సృష్టిస్తుంది భయపెడుతుంది బతుకుభారం చేస్తుంది ఇంత చేసే ఒంటరితనం ఎంతపిరికిదో నలుగురినీ చూస్తే చాలు ఇసుకతిన్నెలమీద రాసుకున్న రాతల్లా నామరూపాల్లేకుండా పోతుంది    

త్రిసూత్రం - శారదా అశోకవర్ధన్

త్రిసూత్రం - శారదా అశోకవర్ధన్   ఎన్ని బాధలు ఎన్ని గాధలు తలుచుకుంటే గుండె గాయం తలవకుంటే లేదు మార్గం కాలచక్రం కదిపి చూస్తే కలికి కధలను తరచి చూస్తే కతలు ఎన్నో వెతలు ఎన్నో కన్నీటి చారల పొరలు ఎన్నో! పుట్టగానే ఆడపిల్లని కన్నవారు ఉస్సురంటే చూడవచ్చిన చుట్టపక్కాల్ జాలిచూసి ఊరడించి హెచ్చవేతలు తీసివేతలు లెక్కలన్నీ చేసి చూపి గుండె మీది కుంపటంటూ గుబులు పుట్టే కబుర్లు చెప్పి హడాలగొట్టి వెళ్ళుతారు ఆ రోజు మొదలు అన్నింటా అబలవూ అరిటాకువంటూ చదువు నీకు దండగంటూ వంటపనికీ ఇంటి పనికీ ఒంటెద్దులాగా తిరుగుపనికీ అన్ని ఆమెకే అంటగట్టిరి పనిచేసే యంత్రంలాగా నోరులేని మూగలాగా మొండిగా తయారు చేసిరి పుట్టినింట్లో మెట్టినింట్లో అన్నదమ్ములు మొగుడు మరుదులు అయినవారు కానివారు అందరూ బహుగొప్పవారే ఆడదోక్కటే అలుసు ఎందుకో? కన్యాశుల్కం మహాఘోరం అది కాదట పెద్దల నేరం మూడు ముళ్ళూ వేసినట్టి మూడు కాళ్ళ ముసలివాడు ఉన్న పాతునే ఊపిరొదిలితే అది మాత్రం ఆమె ఖర్మం! పాలు గారే పసిడి బుగ్గల చిన్నారుల సింగారించి పెళ్ళితంతూ జరిపించేసి ఆయువు తీరి అతడు చస్తే సమిధలల్లే పసిడి బొమ్మల మంటవేసి తృప్తి చెందే ఘోరమైన నీతి శాస్త్రం ఆడపిల్లకే ఎందుకంట? అడగలేదు ఆడవారు కాలి నుసిగ మిగిలిపోయిరి కాస్త కాస్త కళ్ళు తెరిచి ఇప్పుడిప్పుడే మేల్కొనిరి లోకరీతిని తెలుసుకొనిరి మనిషిగా తలఎత్తుకొనిరి! ఆమె చదవని చదువులేదు చేయరాని ఉద్యోగం లేదు సమానత్వం నిరూపిస్తే సహించలేని పెద్ద మనుషులు గుటకవేస్తూ గింజుకుంటూ నోరు తెరిచి మిన్నకుంటిరి! అయినా ఏదో ఆమెకి శాపం వరకట్నం మరో ఘోరం అన్నీ వుండీ ఆరడిపడుతూ ఆత్మహత్యకూ ఘోరహత్యకూ బలైపోతున్నారు మహిళలు నడిబజారున పడుతున్నారు తల్లి ఆమె చెల్లి ఆమె ఇల్లు నడిపే ఇలవేల్పు ఆమె ఆమె పైననే అత్యాచారమా? ఆమె మీదనే అఘాయిత్యమా? కలిసికట్టుగా ఇంతులందరు కొద్దిసేపు కళ్ళు మూసుకు సమస్యలను తిరగవేస్తే అత్యాచారం అఘాయిత్యం వీళ్ళు చేస్తే ఏమవుతుంది? ఎదురుకట్నం సతీ సహగమనం వీరు కోరితే ఏం జరుగుతుంది? అందుకే యోచించి అందరు సమానత్వం పెంచుకుంటూ ఆడమగ తేడా లేక ఒకే నీతి -ఒకే భీతి -ఒకే సూక్తిగా నడిచేలాగా కొత్త చరిత్ర సృష్టించాలి ఈ త్రిసూత్రం పాటించాలి    

కృష్ణాతరంగాలు - శారదా అశోకవర్ధన్

కృష్ణాతరంగాలు - శారదా అశోకవర్ధన్   పంచె గూడకట్టు,పైన అంగీ, మెడపైన ఒకతుండు, ముచ్చటగనుండు వెండితీగల జుట్టు గాలి కెగురుచునుండు అతడే కృష్ణశాస్త్రి అమరకం! పంచె ఖద్దరు అంచు ధగధగా మెరియ పైన తెల్ల లాల్చి నిగనిగలాడ మల్లెపువ్వుల్లాగా బోసినవ్వులు విరియు అతడే కృష్ణశాస్త్రి అమరకం! వామహస్తమున చిన్న పుస్తకము దక్షిణమున నుండు నొక్క కలము గళము లేదుగనుక ఆయుధాలీ రెండు అతడే కృష్ణశాస్త్రి అమరకం! గళమున్ననాడు గానమాతని సొత్తు పలుకులకు పాటలకు అతడె మొనగాడు పాడుజబ్బు వచ్చి గొంతు మూసిననేమి? అతడే కృష్ణశాస్త్రి అమరకం! పదములు చాలునని పట్టాభిరాముణ్ణి శివుని పాదాల చెంత శిరసునుంచమని పరమేశు ప్రార్ధించిన పరమభక్తుడు అతడే కృష్ణశాస్త్రి అమరకం! గీతాంజలి వ్రాశాడు - ప్రతి తెనుగు గుండెలో గూడు కట్టుకున్నాడు ఆంధ్ర టాగూరన్న ఆశ్చర్యమే లేదు అతడె కృష్ణశాస్త్రి అమరకం! మాట్లాడలేకున్నా, మనుషులు కావాలి ముచ్చటగ అందరూ సభ తీర్చి ఉండాలి అంతకంటె ముందు నతడు కోరడు ఎపుడు అతడె కృష్ణశాస్త్రి అమరకం! భోగిగా పుట్టాడు - భోగిగా పెరిగాడు రాజలాంఛనాల రుచులు చూశాడు అపర శ్రీనాధుడన్న అతిశయోక్తి కావు అతడె కృష్ణశాస్త్రి అమరకం! ముఖస్తుతి చెయ్యడు మెప్పుకోసం ఎవ్వరినీ ప్రార్ధించడు ఏదో ఆశించి మనిషైతే గౌరవించి ఆదరించడమే తెలుసు అతడె కృష్ణశాస్త్రి అమరకం! (1968లో కృష్ణశాస్త్రిగారి యింటికి వెళ్ళినప్పుడు తనమీద కవిత్వం చెప్పమంటే ఆయన సమక్షంలో రాసియిచ్చిన కంత)

స్వాతంత్ర్యం ఒకరివ్వాలా? - శారదా అశోకవర్ధన్

స్వాతంత్ర్యం ఒకరివ్వాలా? - శారదా అశోకవర్ధన్   నాకు స్వాతంత్ర్యం కావాలని అరుస్తే సరిపోతుందా ఎవరి నడుగుతున్నావమ్మా? ఎవరు ఇచ్చేవాళ్ళు? నీ బతుకుకి నువ్వే నాయకురాలివి నీ విజ్ఞతతో నీ మేధతో నీకు నువ్వే నీ జీవితాన్ని నడిపించుకోవాలి నీ జీవిత భాగస్వామిని నీకు నువ్వే ఎంచుకునే హక్కు నీకు లేదా? నీ పెద్దలు తెచ్చిన వ్యక్తి నీకు నచ్చకపోతే నీవు మెచ్చకపోతే ఆమాటే ఖచ్చితంగా చెప్పే ధైర్యం నీకు లేనప్పుడు సంతలో పశువులా అతడు ఎదురు డబ్బుపుచ్చుకుని నీ ముక్కుకి పసుపుతాడేసి నిన్ను లాక్కుపోతుంటే నీ హృదయ మధుకలశాన్ని ఆనందంగా అర్పించి అతని అధికారాన్ని నీ మనస్సుమీదా శరీరం మీదా వాడుకోమని ఎప్పుడంటే అప్పుడు బ్లాంక్ చెక్ ఇచ్చేసి ప్రబంధనాయికలతో పోలిస్తే కాబోసుననుకుంటూ మురిసిపోతూ నీకు తగిన గౌరవం దొరకనప్పుడు మాత్రం కన్నీరు కారుస్తూ ఎవరైనా చూస్తారేమో నవ్వుతారేమో అని నిన్ను నువ్వే దాచుకుంటూ కాటుక కళ్ళ వెనుక కన్నీటిని కనబడకుండా వుంచి అందరూ నిన్ను మెచ్చుకోవాలని బాధంతా భరించి త్యాగామనుకుంటూ పరువు ప్రతిష్టల బందిఖానాలో గొడ్డులా పడుంటే నీకు ఎవరివ్వాలమ్మా స్వాతంత్ర్యం? అది నీ జన్మ హక్కు! నీ సమస్యల సుడిగుండం నుంచి బయట పడే మార్గం నువ్వే ఎంచుకో ఎదురీది ఒడ్డును చేరుకో నీ శక్తిని తెలుసుకుని యుక్తిగా నీ బాటను అడ్డుకుంటున్న ముళ్ళకంచెలను నరుక్కుంటూ పూలబాట వేసుకో జీవితం జీవించడానికేనని తెలుసుకో!    

మహిళా! ఓ మహిళా! - శారదా అశోకవర్దన్

మహిళా! ఓ మహిళా! - శారదా అశోకవర్దన్   మహిళా! ఓ మహిళా! నువ్వు లేనిదే మహి ఎక్కడుంది? భూమి లేని చోట ఆకాశం వుంటుందా? ఆకాశమే లేకపోతే చుక్కలు రెక్కలు విప్పుకుని మొలుస్తాయా? సృష్టికి ప్రతి సృష్టి చేసే శిల్పి మహిళ విశ్వ వీణలు శృతిపెట్టి జీవనరాగం పాడే గాయని మహిళ ఓర్పుకి మారుపేరు నేర్పుకి మరోపేరు మనసుకి మమతల పందిళ్ళు వేసి సమత చమురు పోసి ఆశాదీపాలు వెలిగించేది మహిళ తల్లిగా చెల్లిగా అనురాగవల్లిగా అందాల భరిణగా అపురూప లావణ్య సుందరాంగిగా మనువాడిన మనస్వినిగా బాధ్యతల నెరిగిన బందీగా బాధని గొంతు దాటనివ్వని గరలకంఠుడికి ప్రతీకగా సహనానికి సవాలుగా నిలిచేది మహిళ పరిస్థితి పామై కాటేస్తే,ఓపికకు పాతరపడితే రుధిర జ్వాలల్ని రగిలిస్తుంది మహిళ రుద్రవీణ భద్రకాళిలా మ్రోగిస్తుంది కదను తొక్కుతుంది కత్తి దూస్తుంది దీక్షాకంకణ కవచంతో లక్ష్యం సాధిస్తుంది ఉద్యోగాలు చేస్తుంది ఊళ్ళేలుతుంది గట్టి చేతులతో చట్ట సభలలో పెద్ద పీట వేసుకుంటుంది అయినా ఓడిపోతోంది పురుషాహంకార సమాజంలో వరకట్న యాగంలో సమిధగా కాలిపోతోంది నా మహిళ చాతకానితనము కాదు అది చచ్చుతనమూ కాదు అంతులేని ప్రేమామృత భాండం ఆమె హృదయం క్షమాగుణం, త్యాగం సర్దుకుపోయే స్వభావం ఆమె నైజం వాటిని బద్దలు కొట్టడం ఇష్టం లేని నా మహిళ మౌనిగా రగిలిపోతోంది బలిపశువుగా ప్రాణాలు కోల్పోతోంది ఆత్మహత్య త్యాగం కాదు హత్య గావింపబడడం పరిష్కారమూ కాదు మనస్సు చంపుకోకు మసిగా మారిపోకు కసిగా మిగలబోకు నీ పసిడి హృదయంలో విసాన్నీ విషాదాన్నీ నిండనీయకు నీ శక్తిని వినియోగించు మహిళా నువ్వూ ఈ విశాల ప్రపంచంలో ఒక మనిషి నీకూ స్వేచ్చగా బ్రతికే హక్కుందని చాటుకో నీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకో!

నాకళ్ళు! - శారదా అశోకవర్ధన్

నా కళ్ళు! - శారదా అశోకవర్ధన్   అన్నార్తుల ఆకలి మంటలు చూడలేక ఆర్తితో అలమటిస్తున్నాయి నా కళ్ళు అబలల మానభంగాలను చూసి అంధుల చీకటి బతుకుల నాదుకోలేక అలమటించిపోతున్నాయి నా కళ్ళు దుర్మార్గుల దురంతాలను చూసి దుఃఖిస్తున్నాయి నా కళ్ళు కట్నాల కోసం కట్టుకున్న ఇల్లాలిని కాల్చి చంపే కిరాతకుల్ని చూసి కన్నీరు కారుస్తున్నాయి నా కళ్ళు కడుపునిండా తిండి లేక కుప్పతొట్టెలోని ఎంగిలాకు లేరుకుంటూ కడుపు నింపుకునే కటిక దరిద్రులను చూసి కుమిలిపోతున్నాయి నాకళ్ళు వెలవెల పోతున్నాయి వెర్రిగా చూస్తున్నాయి గత వైభవాలను నెమరు వేసుకుంటూ తళతళ లాడలేకపోతున్నాయి పూరి గుడిసెలముందు మురికి కాలువల మధ్య చుక్కల్లా కొలువు తీర్చిన ఈగల గుంపుల పక్కనే కూటికీ నీటికీ కుమ్ములాడుకునే జనాన్ని చూసి జాలితో తడిసిపోతున్నాయి నా కళ్ళు కలవారి మేడ మీద అందంగా అలకరించబడ్డ పూల కుండీల్లోని అందాలను వాకిట ముంగిట రంగురంగులతో తీర్చిదిద్దిన రంగవల్లుల సొగసులను చూసి ఆనందించలేకపోతున్నాయి నా కళ్ళు ఐకమత్యం తరిగిపోయి అరాచకం పెరిగిపోయి కులం పేర మతం పేర మానవత్వానికి మానవుడు సమాధులు కడుతూ వుంటే అభిమానం ఆదర్శం అన్నీ తుడిచిపెట్టి అన్నదమ్ములు స్వార్ధంతో కుస్తీలు పడుతూవుంటే చూడలేక ఆశ్చర్యంతో గుడ్లప్పగించాయి నా కళ్ళు కలత నిండిన నా కళ్ళు క్రాంతి కోసం కాంతి కోసం శాంతి కోసం కలువ రేకుల్లా విచ్చుకుని కాచుకుకూచున్నాయి గత వైభవం తిరిగి పునఃప్రవేశం చేసి రత్నగర్భ అయిన నా దేశాన్ని పుణ్యభూమి అయిన నా పవిత్రదేశాన్ని పునీతం చేయాలని కోట్ల ఆసలు నింపుకుని ఎదురుచూస్తున్నాయి అంత వరకూ వేరేదీ చూడనని అపర గాన్దారిలా కళ్ళకు గంతలు కట్టుకుని భీష్మించుకు కూర్చున్నాయి నా కళ్ళు!    

తిమింగలం - శారదా అశోకవర్దన్

తిమింగలం - శారదా అశోకవర్దన్   మట్టి ప్రమిదలో నూనెపోసి చుట్టూ దీపాలు వెలిగించకపోయినా ఫరవాలేదు విద్యుత్ దీపాలు తోరణాల్లా వెలిగించి వినోదాలు చేసుకోకపోయినా నష్టం లేదు మనసు నిండా మమతా దీపాలు వెలిగించుకుంటే చాలు చీకటి ఊహలు ఛిద్రమైపోతాయి సూర్యుడి బాణాలకి విచ్చుకున్న పత్తికాయల్లా పగిలిపోతాయి పాపిగా మారి దుర్మార్గాన్ని పెంచుకుంటే అంతా పోగొట్టుకున్నట్టే గుట్టలుగా పెరిగిన పాపాల తుట్టలు నిన్నే కాటేస్తాయి! పచ్చని పంట చేలలో మంటలు రేపి మరుభూములుగా మార్చకు బతుకులకు చితులు పేర్చి ఏదో సాధించానని అనుకోను! చంపుతూ బతకాలన్న బ్రాంతిని వదులుకో నిజం నీ బ్రాంతిని తిమింగలమై చీలుస్తూ నిన్నే మింగేస్తుందొక రోజు దేముదివై నిలిచిపోవాలనే పిచ్చి కోరిక మానుకో మనిషితనాన్ని పెంచుతూ మనిషిలా బతకాలని కోరుకో! తీపి చేదుల జీవితంలో - వట్టి తీపినే ఆరగించాలనుకోకు చేదునే తీపిగా మార్చుకోవడం నేర్చుకో