ఒంటరితనం - శారదా అశోకవర్ధన్
posted on Jan 13, 2012
ఒంటరితనం
- శారదా అశోకవర్ధన్
ఒంటరితనాన్ని ఒక్కక్షణమైనా భరించలేను
తుంటరుల మధ్య అంతకన్నా మనగలుగుతాను
ఒంటరి రాక్షసి మనస్సుని గాలమేసి పట్టేసి
పిచ్చిపిచ్చి జ్ఞాపకాల ఊబిలోకి లాగేస్తుంది
నా నీడని చూసి నేనే భయపడేట్లు భ్రమింపజేస్తుంది
అంతటితో ఊరుకోదు ఒక పట్టున ఒదిలిపెట్టదు
గింజుకున్నా జుట్టుపీక్కున్నా
ఎంత నిభాయించుకున్నా!
వర్తమానపు ఆలోచనలని 'స్కాన్'చేసి పరీక్షించినట్టు
మండుతున్న గుండెకి సమిధల్లా వాడుతుంది
గజిబిజి ఊహలతో గందరగోళం సృష్టిస్తుంది
భయపెడుతుంది బతుకుభారం చేస్తుంది
ఇంత చేసే ఒంటరితనం ఎంతపిరికిదో
నలుగురినీ చూస్తే చాలు
ఇసుకతిన్నెలమీద రాసుకున్న రాతల్లా
నామరూపాల్లేకుండా పోతుంది