నాకళ్ళు! - శారదా అశోకవర్ధన్
posted on Jan 12, 2012
నా కళ్ళు!
- శారదా అశోకవర్ధన్
అన్నార్తుల ఆకలి మంటలు చూడలేక
ఆర్తితో అలమటిస్తున్నాయి నా కళ్ళు
అబలల మానభంగాలను చూసి
అంధుల చీకటి బతుకుల నాదుకోలేక
అలమటించిపోతున్నాయి నా కళ్ళు
దుర్మార్గుల దురంతాలను చూసి
దుఃఖిస్తున్నాయి నా కళ్ళు
కట్నాల కోసం కట్టుకున్న ఇల్లాలిని
కాల్చి చంపే కిరాతకుల్ని చూసి
కన్నీరు కారుస్తున్నాయి నా కళ్ళు
కడుపునిండా తిండి లేక కుప్పతొట్టెలోని
ఎంగిలాకు లేరుకుంటూ కడుపు నింపుకునే
కటిక దరిద్రులను చూసి
కుమిలిపోతున్నాయి నాకళ్ళు
వెలవెల పోతున్నాయి
వెర్రిగా చూస్తున్నాయి
గత వైభవాలను నెమరు వేసుకుంటూ
తళతళ లాడలేకపోతున్నాయి
పూరి గుడిసెలముందు మురికి కాలువల మధ్య
చుక్కల్లా కొలువు తీర్చిన ఈగల గుంపుల పక్కనే
కూటికీ నీటికీ కుమ్ములాడుకునే జనాన్ని చూసి
జాలితో తడిసిపోతున్నాయి నా కళ్ళు
కలవారి మేడ మీద అందంగా అలకరించబడ్డ
పూల కుండీల్లోని అందాలను
వాకిట ముంగిట రంగురంగులతో తీర్చిదిద్దిన
రంగవల్లుల సొగసులను చూసి
ఆనందించలేకపోతున్నాయి నా కళ్ళు
ఐకమత్యం తరిగిపోయి అరాచకం పెరిగిపోయి
కులం పేర మతం పేర మానవత్వానికి మానవుడు
సమాధులు కడుతూ వుంటే
అభిమానం ఆదర్శం అన్నీ తుడిచిపెట్టి
అన్నదమ్ములు స్వార్ధంతో కుస్తీలు పడుతూవుంటే
చూడలేక ఆశ్చర్యంతో గుడ్లప్పగించాయి నా కళ్ళు
కలత నిండిన నా కళ్ళు
క్రాంతి కోసం కాంతి కోసం శాంతి కోసం
కలువ రేకుల్లా విచ్చుకుని
కాచుకుకూచున్నాయి
గత వైభవం తిరిగి పునఃప్రవేశం చేసి
రత్నగర్భ అయిన నా దేశాన్ని
పుణ్యభూమి అయిన నా పవిత్రదేశాన్ని
పునీతం చేయాలని
కోట్ల ఆసలు నింపుకుని ఎదురుచూస్తున్నాయి
అంత వరకూ వేరేదీ చూడనని
అపర గాన్దారిలా కళ్ళకు గంతలు కట్టుకుని
భీష్మించుకు కూర్చున్నాయి నా కళ్ళు!