స్వాతంత్ర్యం ఒకరివ్వాలా? - శారదా అశోకవర్ధన్
posted on Jan 13, 2012
స్వాతంత్ర్యం ఒకరివ్వాలా? -
శారదా అశోకవర్ధన్
నాకు స్వాతంత్ర్యం కావాలని అరుస్తే సరిపోతుందా
ఎవరి నడుగుతున్నావమ్మా?
ఎవరు ఇచ్చేవాళ్ళు?
నీ బతుకుకి నువ్వే నాయకురాలివి
నీ విజ్ఞతతో నీ మేధతో నీకు నువ్వే
నీ జీవితాన్ని నడిపించుకోవాలి
నీ జీవిత భాగస్వామిని నీకు నువ్వే
ఎంచుకునే హక్కు నీకు లేదా?
నీ పెద్దలు తెచ్చిన వ్యక్తి
నీకు నచ్చకపోతే నీవు మెచ్చకపోతే
ఆమాటే ఖచ్చితంగా చెప్పే ధైర్యం నీకు లేనప్పుడు
సంతలో పశువులా అతడు ఎదురు డబ్బుపుచ్చుకుని
నీ ముక్కుకి పసుపుతాడేసి నిన్ను లాక్కుపోతుంటే
నీ హృదయ మధుకలశాన్ని ఆనందంగా అర్పించి
అతని అధికారాన్ని నీ మనస్సుమీదా శరీరం మీదా
వాడుకోమని ఎప్పుడంటే అప్పుడు
బ్లాంక్ చెక్ ఇచ్చేసి
ప్రబంధనాయికలతో పోలిస్తే కాబోసుననుకుంటూ మురిసిపోతూ
నీకు తగిన గౌరవం దొరకనప్పుడు మాత్రం కన్నీరు కారుస్తూ
ఎవరైనా చూస్తారేమో నవ్వుతారేమో
అని నిన్ను నువ్వే దాచుకుంటూ
కాటుక కళ్ళ వెనుక కన్నీటిని కనబడకుండా వుంచి
అందరూ నిన్ను మెచ్చుకోవాలని బాధంతా భరించి
త్యాగామనుకుంటూ పరువు ప్రతిష్టల బందిఖానాలో
గొడ్డులా పడుంటే నీకు
ఎవరివ్వాలమ్మా స్వాతంత్ర్యం?
అది నీ జన్మ హక్కు!
నీ సమస్యల సుడిగుండం నుంచి బయట పడే మార్గం
నువ్వే ఎంచుకో
ఎదురీది ఒడ్డును చేరుకో
నీ శక్తిని తెలుసుకుని యుక్తిగా
నీ బాటను అడ్డుకుంటున్న ముళ్ళకంచెలను నరుక్కుంటూ
పూలబాట వేసుకో
జీవితం జీవించడానికేనని తెలుసుకో!