స్నేహ మకరందం
స్నేహ మకరందం
మనసనే మల్లెకు మధురిమనే స్నేహం
చిరునవ్వులతో ఆణిముత్యాల సరాగాలై వర్షించి
హర్షించేదే స్నేహమనే మాధుర్య మకరందం
మెరుపులా మెరిసి స్వాతిచినుకులై కురిసేది స్నేహం
ముగ్ధమనోహరం రసానంద జీవన మకరంద సౌరభం
కష్టసుఖాలలో కలిమిలేములలో కలిసివుండేదే నిజమైన స్నేహం
విరించి, వరించి వర్షించే స్వరరాగాల ఆలాపనే తియ్యని స్నేహం
జాబిలికి కలువే ప్రియనేస్తమంట, వెన్నెలకు తారలే జిలుగంట
నిరాశనీడల్లో ఆశాలతయై అల్లుకునేదే స్నేహం
మంచులా కరిగి మానవత్వపు విలువలు పెంచేదే స్నేహం
సృష్టిలో తీయనిది, మాయనిది స్నేహం మధురము స్నేహం
మనసును అమృతవృష్టిగా చేసేదే స్నేహానందము
మనసనే మరాళాన్ని, నడిపించేదే స్నేహ పరిమళం
ప్రేయసిప్రేమలో స్నేహమున్నది,
ప్రియుని మదిలో తీయని అనురాగముంది
నిండుసభలో, ఆపదలో 'అన్న' అని ఆర్తితో పిలిచిన ద్రౌపదిని
ఆదుకున్న శ్రీకృష్ణుని, దయనే స్నేహమనే అద్వితీయం
కృష్ణా అనే పలుకులో కృప ఉన్నది,
మాధవా అనే పలుకులో మాధుర్యం ఉన్నది
పిల్లనగ్రోవి పిలుపులో, గోపికల హృదయాలను దోచే మాధువుని
మాధుర్య మకరందమే తీయని స్నేహం,
రాధహృదయంలో రవళించు అనురాగమే మాధవు మధురామృతం
గీతామకరందాన్ని బోధించిన కృష్ణుని లీలలే బ్రతుకుకు అర్ధంచెప్పే
నిజమైన స్నేహతత్వం. భక్తితో కుచేలుడు ఇచ్చిన పిడికెడు అటుకులకు
మెచ్చి సిరినిచ్చిన కృష్ణుని అనురాగమే నిజమైన స్నేహధర్మము
స్నేహదీపాలు వెలిగించు, కనులలో కోటి కాంతులను కురిపించు
మనసును మైమరపించేదే నిజమైన స్నేహ మకరందం
- గంగాపురం విజయరమణ
సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో