గురువే దైవం

 గురువే దైవం     తెలియని లోకంలో పయనించే మనిషికి దారిచూపే చుక్కాని బాల్యపు అడుగులకు అందమైన అమ్మపలుకులు అందించి ఆనందం నింపుతాడు నీతికథలతో నియమాలను ఆటపాటలతో ఆరోగ్యం ఎదుగులకు ఊతమవుతాడు సుతిమెత్తగా దండిస్తూ తప్పొప్పులను తెలుపుతాడు మంచే విజయమని మదిలో నిలుపుతాడు భయాలను బాధలను స్నేహితుడై తరుముతాడు భవిష్యత్తు నిర్మతై నిలుస్తాడు విశ్వజ్ఞానమందించి విశ్వసనీయత పెంచుతాడు విజయంలో ధైర్యమై నిలబడతడు ఓపికతో నేర్పుగా సందేహాలను తీర్చి విద్యార్థుల మదిలో శాశ్వతమై మిగులుతాడు విద్యార్థులు విజయంతో తానానందం పొందుతాడు శభాష్ అంటూ వెన్నుతట్టే ప్రోత్సాహం ఎప్పుడో తన విద్యార్థి సంస్కారంతో నమస్కరిస్తే కులాసాలతో పొంగిపోతాడు తన విద్యార్థి భవిష్యత్తులో స్థిరపడి తారసపడితే హిమాలయమదిరోహించిన వీరుడైన సంబరం ఎందరికో భవితనిచ్చి బతుకులలో వెలుగుపంచే గురువుకెపుడు మనసారా వందనం   సి. శేఖర్(సియస్సార్)

గురువు

గురువు   ( పాటవెలదులు)    చదువు-సంధ్య నేర్పి శక్తి తోడ,   బతుకు బండి నడుపు బాట చూపి,   జ్ఞాన మిచ్చు దాత జగతి గురువు!   గురువు మొక్క బతుకు గురుతు తెలియు!  అక్షరాల మాల లల్ల తెలిపి, అంకె గారడీల శంక తీర్చి,   జంకు లేక బ్రతుకు సాగ నేర్పు!  గురువు మొక్క బతుకు గురుతు తెలియు!   మంచి-చెడుల నడుమ మర్మ మెల్ల,   ఎంచి చూపు నొజ్జ యీశ్వరుండు!   పంచు జ్ఞాన విద్య పరమ ప్రీతి!  గురువు మొక్క బతుకు గురుతు తెలియు!    శిలను  శిల్పముగను  జేయు శిల్పి!  మట్టి బొమ్మకు ఘన మహిత గూర్చు! అపర బ్రహ్మ శాస్త యవని లోన!  గురువు మొక్క బతుకు గురుతు తెలియు!     తనదు కనుల జూపు ధరణి నంత,    కొండ అద్ద మందు కూర్చి నట్లు!   తీర్ప రాని ఋణము దేశికునిది!  గురువు మొక్క బతుకు గురుతు తెలియు!     గురువు కన్న శిశువు గొప్ప నొంద,  కించ పడడు, తనకు కీర్తి యనును,  కన్న తండ్రి వలెను కరుణ జూపు! గురువు మొక్క బతుకు గురుతు తెలియు!      బ్రహ్మ, విష్ణు, శివుల ప్రతిమ గురువు!    సకల దైవ రూపి చదువులయ్య!   భక్తి సేవ జేయ ముక్తి దొరకు!  గురువు మొక్క బతుకు గురుతు తెలియు!                   కుసుమ. ఉప్పలపాటి. 

నేటి కవిత్వం

  నేటి కవిత్వం   కవిత్వం కాలానుగుణంగా తనరూపం మార్చుకుంటుంది ప్రాచీనం నుండి ఆధునికందాకా కవిత్వం రెండంచులుగల ఖడ్గమే ప్రశంసలతో ముంచెత్తగలదు విమర్శతో విల్లెక్కుపెట్టగలదు నేటితరం సైతం పోతనలా హలంపట్టి కవిత్వాన్ని నిలబెట్టగలరు కవిసార్వభౌముడిలా కనకాభిషేకాలతో తులతూగనూగలరు యథారాజా తథాప్రజా పాలకపక్షం ప్రతిపక్షం కవిపక్షమేదో అదే ఆయన కవిత్వం నేడొస్తున్నది గుండెలోతుల్లో దాచుకున్న అగ్నిపర్వతంలాంటిది ఉప్పొంగిన లావాలా  సమాజాన్ని కడిగేది కవిత్వమొక సముద్రం ఎవడి గుండెఘోషలు రేగే అలజడులకు వెరవక స్వేచ్ఛగా వాడినిపిస్తడు స్వార్థంతో రాసే కవిత్వం నిలవదిక్కడ సారం నిండినదే జీవంపోసుకుని అందరి గుండెల్లో సజీవమై నిలబడతది కవిత్వం నిజాయితీ నిండినదై నిఖార్సైనదయినపుడే చిగురువేస్తూ చైతన్యదీప్తులు నింపేదయ్ నవసమాజ నిర్మాణానికై కవికలం పాటుపడాలీ.. సి. శేఖర్(సియస్సార్)

కాలం నీడలో..

కాలం నీడలో.. కాలమింతలామారి మనుషులపై విషంగక్కుతున్నదేమిటో ఊహించైనా ఉండరెవరు ఇన్నేండ్లెన్ని ఒడిదుడుకులెదురైనా నిబ్బరంగా నిలవడ్డడు విజయం సాధించిన సాహసికుడు మనిషి కానీ కనిపించిన ప్రతిదాన్ని  పాడుచేస్తూ ప్రకృతికి వర్ణనకందని కీడుచేసీ ఎవరెస్టు తీరం చేరినా ఇంకా ఏదో చేయాలనే  అంతరిక్ష దారుల్లో రహస్యాలు ఛేదించనా ఏంలాభం? మనిషి ప్రాణం నిలబెట్టడం తరంకాలేదెవరికి కాదుకూడా భూమి సారాన్ని పీల్చే జలగలా తన జీవాన్ని జీవనాన్ని దహనం చేస్తున్నడు మనిషి ఎంతెదిగిన భూమి పాదుల్లో సత్తాలేదాయే విజ్ఞానం వికసించినా వినియోగమైతే వినాశనానికే మానవత్వం చచ్చిన మనిషి నేడు స్వార్థంపై సవారిచేస్తూ పయనమెటో తెలియని ఆధిపత్యం అదెప్పుడు అంధకారం బయటపడని అగాధం మనుషులు చెట్లతో చెలగాటమాడి కృత్రిమమైన ప్లాస్టిక్ వనాలు మొలిపిస్తున్నరు అరచేతిలోకి సాంకేతికజ్ఞానం రెండంచుల ఖడ్గమై మెదళ్ళను తొలిచేసి అయేమయంలోకి నెట్టి మనిషి దశల ఎదుగుదలలో కళ్ళు మూసుకుపోయి కామాంధులౌతున్నరు బదులు ఎన్ని పూలు మానాలు కోల్పోయి అనాథశవాలవుతున్నయ్ ఎన్నో సంఘటనలు కంచికి చేరని కథలే కరోనాకు వర్షం తోడై కంగారుగా తనవంతు నష్టం జరిగించె దేశమేదైనా  పేదవాడే నరకం చూసే నష్టజాతకుడు కూడుకోసం గూడుకోసం బతుకంతా వెట్టిచాకిరి అతివృష్టి అనావృష్టికి కొట్టుకుపోయో ఎముకలగూడు ఎటుతోచక బతుకు పయనం ముగించి పరలోకం పయనమాయే పాపఖర్ముడు సి. శేఖర్(సియస్సార్),  

ఇంకా ఊబిలోనే...!

ఇంకా ఊబిలోనే...!     అతడు ఇంకా ఊబిలోనే ఉండిపోయిండు ఏ ఆపన్నహస్తం అందించినా నిస్సహాయత నీడలోనే తలదాచుకుంటున్నడు అతడు తనదైన లోకంలోనే విహరిస్తున్నడు బయటి ప్రపంచాన్ని చూడలేక తనదైన అస్తిత్వమాయాజాలంలో పడి  కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నడు అతడు మనోక్లేశంతో మధనపడుతున్నడు అక్కున చేర్చుకునే ఆసరా లేదని బొమ్మను అడ్డుపెట్టుకుని బొరుసుతో ఆటలాడుకుంటున్నడు అతడు ఇంకా మగత నిద్రలోనే ఉంటూ మందబుద్ధితో పైశాచికలాడుతున్నడు కొత్త ప్రపంచం ఆహ్వానిస్తున్నా తనదైన లోకాన్నే కలగంటున్నడు నిజమే... అతడి స్వప్నం ఫలించాలని ఉన్నా బంధనాలేవో బందీని చేస్తున్నవి లోకాన్ని జయించాలని తపనపడుతున్నా ఒంటరి దుఃఖమేదో నిలువెల్లా దహిస్తున్నది అవును....అతడు ఒంటరి ప్రపంచపు నావికుడు ఏకాంతాన్ని కోల్పోతున్న నిస్సహాయుడు ఫలించని రంగుల రాజ్యాన్ని  కలలుగంటున్న కలలబేహారుడు అవును... అతడింకా ఊబిలోనే ఉండిపోయిండు ఆసరాలేక దిక్కుమొక్కూ చూస్తున్నడు.          - డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్

జీవిత సత్యం

  జీవిత సత్యం     నవరంధ్రముల ఖజకములో పంచ వాయువులు ఉన్నంత వరకే కదా..! వ్యక్తి విలువ..!!   హృదయానికి చిల్లు..అదే నీ జీవితానికి శాపపు విల్లు..!! ప్రాణం ఉన్నంత వరకు చిరునవ్వు వెదజల్లు..!! అందరి ప్రేమను భద్రించు నీ హృది పొదరిల్లులో..!!   తప్పులను ఒప్పుకొని పరమాత్మ యందు క్షమ ప్రార్థనతో మోకరిల్లు..!! జీవితం ఇంకా అయ్యెను అందమైన హరివిల్లు..!!   తనువు అణువు అణువులో కృతజ్ఞతా భావాన్ని నింపుకో నువ్వు..!! నీ నవ్వు నవ్వులో పసిడిపువ్వు అదే మాకు పసిడి పువ్వులపంట అవ్వు ..!!   శపించిన శఠించిన..!! విఘ్నాలు కలిగించిన..!! అవరోధాలే సృష్టించిన..!! అన్నింటిని పెకలించు..!! సాగు సాగు మున్ముందుకు నీ బాటలే కావాలి మాకు విజయ మార్గములు ఓ నేస్తం..!! జాని.తక్కెడశిల    

అలకకో లేఖ...

    అలకకో లేఖ      ఓయ్.. ఎందుకో ఆ అలకలు? కులుకులొలికే ఆ మోముకి అలకలు కూడా అందమేనని అబద్దానికి అందెలు తొడిగి పరుగులిడించలేను. ఉన్నదే చెప్తానని నీకు తెలుసు. రోజుకో మారు మారేలా చంద్రునితో నిన్ను పోల్చలేను. ఋతువుకోలా రూపం తొడిగే ప్రకృతితోనూ, అలానే క్షణానికో అలనిచ్చే సంద్రంతోనూ, రాగానికో అందానిచ్చే సరిగమలతోనూ, పొద్దున్నే పూసే పూలతోను, రాత్రికి మాయమయ్యే మేఘంతోను కూడా..! పోల్చడానికి వీలుకాని బంధాన్ని అక్షరాల విల్లుతో భావుకత లక్ష్యాన్ని ఛేదించే విలుకాడునీ కాదు. నువ్వున్నావని, నీలోనూ నేనున్నానని అదే అర్ధంతో అద్భుతాలను సృష్టించగలననీ చెప్పను. నాలా నేనున్నాననే కదా నాలోకొచ్చి నన్ను నీలోకి తీసుకోని, నీ నవ్వులనలా అంటించిపోయావు! మరిప్పుడు కొత్తగా నీ అలకనెలా మాన్పగలను? రాయడం రాని నాకు, నీ మదిననే కలాన్నిచ్చి కాలమనే తెల్లకాగితాన్ని నాకు నన్ను వెదుక్కునేలా చేసావ్! ఇదిగో ఒకటే చెప్తున్నా విను.., చిన్న ముల్లుని నేనయ్యా.., మనమనే గడియారపు దర్పణ బంధనంలో! నీవన్నదేంటో దానిలో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదనుకుంటా.. నేను! నీ గమనంతోనే నా ఉనికి. కాలమాగినా.. అలా నిశ్చలంగా నీతోనే ఉండిపోతా! ఏదేమైనా రోజుకి రెండుకి సార్లు నిజాన్ని చూపించగలంగా స'మాయ'న్ని అనే నిజంలో బ్రతికే చిరు ఆశ ని! ప్రకృతిని మారనివ్వు పృధ్వినవుతా! సంద్రానవ్వు నిశ్శబ్దపు మధ్యలో నుంటా! చందురునివవ్వు చిక్కటి మచ్చనవుతా! మురిపించే మేఘానివవ్వు మెరిసారే ఆ క్షణాన్ని అవుతా!! నువ్వు నీలా ఉండు నేను నీలా అవుతా..! కాలానికో దిక్సూచిలా అవుదాం.. కాలమే మనదనపించే శాసనాన్నవుదాం.. కలంనేనైతే సిరా నువ్వై కమ్మటి కవితమౌదాం.. మనం మనలా ఉందాం! కొంతమంది కనే కలలా ఉందాం! అలకతోనే ఉనికనుకుంటే పలుకు రాని పదార్దాలెన్నో అలకలో ఉన్నట్లే కదా...!! రాయడం రాదు, రాయేయడమూ రాదు! మూగ కలం పలికిన తడబాటు జవాబనుకో నీకు ఇది! నీలోకి వస్తున్నా.. స్వాగతించు మరి!! - Raghu Alla  

రాతిగుండెగల తాజమహల్!

  రాతిగుండెగల తాజమహల్!       తాజమహల్ పడగొట్టండోయ్! వెన్నెలరాత్రుల్లో కలగా సౌందర్య సాగరపు అలగా మా పీడిత హృదయాల్చీల్చీ మా ఎత్తిన తలలను వాల్చీ దరిద్రులను హేళనచేస్తూ మానవులను చులకన చేస్తూ ఆకాశంవైపుకు చూపే ఈర్ష్యలతో హృదయంఊపే తాజమహల్ పడగొట్టండోయ్! ధ్వంసాన్ని ధిక్కరించిన కాలాన్ని వెక్కిరించిన శిల్పులను విస్మరించిన ప్రభుస్మృతులనే వరించిన ఈ ద్రోహిని దండించండోయ్! ఈ పాపం పండించండోయ్! మొగ్గలుగా తుంచిన సుమాలు పచ్చవిగా నరికిన ద్రుమాలు జగమెరుగని ప్రేమగాధలూ దరిద్రతా మిశ్రమ బాధలూ ప్రభు ప్రేమల కుళ్ళు వాసనలు మాకవి బీభత్సకల్పనలు మా కెందుకు షాజహాన్ ప్రణయం మానవ శ్రమ మింగిన ప్రళయం ఈ కుళ్ళిన విలాస చిహ్నం కర్దయ మోహపాశ చిహ్నం తాజమహల్ పడగొట్టండోయ్! రాయిరాయి విడగొట్టండోయ్! అది అతీత శవదుర్గంధం ముందడుగిడు కాళ్ళకుబంధం అది ఐశ్వర్యపు వెటకారం గృహహీనుల హాహాకారం తాజమహల్ పడగొట్టండోయ్! రాయిరాయి విడగొట్టండోయ్! మన శ్రమతో నిర్మింపబడేదీ మనలనే వెక్కిరించేదీ ప్రపంచమందుండదు ఏదీ ప్రేమకు గురుతీ పన్నీరా! వెచ్చని బాధల కన్నీరా! రాతిగుండెగల తాజమహల్! ప్రేమగురుతు గావీశిలలు. తాజమహల్ పడగొట్టండోయ్! రాయిరాయి విడగొట్టండోయ్!     - ఆలూరి బైరాగి (చీకటి నీడలు)    

అనంతాల అనుభూతి

అనంతాల అనుభూతి   అనంతాలలో నువ్వు అర్దంతెలీని దూరంలో  నేను ఒంటరిగా.... నన్ను పిచ్చిదంటోంది కాంతం ఈ లోకం.. నువ్వు చెప్పు నీకు నేను పిచ్చివాడిలా కనిపిస్తున్నాన?? నీ మాటే కదే నాకు వేదవాక్కు ఊహ తెలిసిన దగ్గరనుండి నువ్వే కదా నాలోకం బావ, బావ అంటూ  నా చుట్టూ తిరిగి అల్లరి పెట్టే నీ కొంటె చేష్టలు... గమ్మత్తైన కబుర్లు  గున్న మామిడి తోటలో నీతో ఆడిన ఆటలు తీయని ఊసులు... ఎన్నాళ్ల బంధమే మనది నీకంటే ముందు పుట్టినందుకు వరస కలిసినందుకు  మన పెద్దవాళ్ళు నిన్ను మానసికంగా ఎప్పుడో నా దాన్ని చేసేసారు... ఏ మాట తప్పావుకదా... హరిశ్చంద్రుడు చెల్లెలివి మరి.. మరి ఈ మాట ఎందుకు తప్పావు కాంతం... నా కంటే ముందు వెళ్ళిపోయి  నన్ను ఒంటరి వాడిని చేసేవు... నీ విలువ తెలియాలనా... లేదా ఇది నీ అలక పాన్పులో ఒక భాగమా?? చెప్పు కాంతం... క్షణం కూడా మౌనంగా ఉండలేని నువ్వు... ఇప్పుడు ఎందుకింత మూగనోము నోచావు... అవునులే నీకు చిన్నప్పటి నుండి కొంచం బడాయి ఎక్కువే... నీ పుల్ల ఐసు నేను తినేసానని చిన్న మావయ్య ఇంట్లో ఆ రోజు ఎంత గొడవ చేసేవు... మళ్ళా నే వెళ్లి సుబయ్య తాత దగ్గరనుండి వడ్డీతో సహా  మూడు ఐసులు, నాలుగు బెల్లం కడ్డీలు ఇస్తే కానీ  నీ మొహంలో నవ్వు రాలేదు... పోద్దు నీ బడాయి... ఈ వయసులో అంత  మురిపిస్తే ఎలాగే కాంతం... ఒక్క మారు చూడవే నా వంక... చుట్టూ ఉన్న వాళ్ళు  నువ్వు ఇంకో లోకం వెళ్లిపోయవంటున్నారే... భూమి మీదకి ప్రతివాడు ఒంటరి గానే వస్తాడు  కానీ మనిద్దరం  జంటగానే వచ్చామనే  భ్రమలోనే ఉన్నా కాంతం... నీ శరీరం వీడిందేమో  ఈ మయాలోకం నుండి... నీ ఉనికి, నీ తలుపు కాదు అవి ఎప్పుడూ నాతో  శాశ్వతం గానే ఉన్నాయి కాంతం... మనిద్దరి శరీరాలు వేరు కానీ ఆత్మలు ఒకటే..  నా మనసు ఎప్పుడు నిత్య వసంతమే కాంతం  నీ ఊహల చిగుర్లు  నా మదిలో వాడిపోనంత వరకు... ఈ పిచ్చిలోకానికి ఏమితెలుసు మన జ్ఞాపకాల పూదోటలో ఇద్దరం ఎప్పటికి ఒకరికి ఒకరు తోడుగా పయనించే బాటసారులం అని... "మృత్యువు మనిషిని చేరిపేయకలదు కానీ మనసుని, దాంట్లో దాచుకున్న  జ్ఞాపకాలను మాత్రం కానే కాదు" -రేణుక సుసర్ల

చల్ మోహనరంగ

  చల్ మోహనరంగ     రంగారు చెట్టుమీదా - బంగారు గోరువంక వినీపించే కతలు విందాము పదరా చివురాకూ పళ్ళెరములో - మివుల పండిన పండ్లు సవిరించీ ఆరగింతము పదరా పొగడ పూవులు గోసి - పొందుగనే దండ గుచ్చి దండ నీమెడాను వేసుకురారా చిరిమంచు కోటలోన - గురుతైన మంచెమీద శిరిపాట పాడుదాము పదరా చల్ మోహనరంగ చుట్టు తుమ్మెదలు గూడి - గట్టి బాజాలు పాడి అట్టిట్టు తిరుగుచున్నవి కదరా కొనమావి కొమ్మలందు - గొనబైన రామచిలుక ధనము లందించుచున్నది కదరా గుబురైన చింత మీద - కబురు తెచ్చేటి చిలుక సొగసైన గూడు కట్టెను కదరా చల్ మోహనరంగ నీవుపోయే దారిలోని - నిలువుటద్దముల లోన నీదురూపు నిలిచిపోయెను గదరా చిరునవ్వూ నవ్వితేనూ కురియూ పువ్వుల వాన చిరునవ్వాసించి యుంటిని గదరా శనివారం సంతలోన పనిబూని సంతలోన నినువెదకి పరుగెత్తి పట్టుకొంటిని కదరా బొండుమల్లె పూలదండ నిండుగా నీ మెడనువేసి నిండారా కౌగిలింతును రారా చల్ మోహనరంగ చీకటి రాత్రినాడు - కోక నల్లది కట్టుకోని చీకట్లో కలిసిపోయితి గదరా ఊడలమర్రి క్రింద - మోడైన తుమ్మ చూచి చీకట్లో ఝడుసుకొంటిని గదరా గట్టు దాటి పుట్టదాటి ఘనమైన యడవి దాటి అన్నిదాటి అరసి తరలితి గదరా ఒంటిగా పోవద్దు వద్దని - పైటబట్టి లాగగానే పైటజారి సిగ్గుబడితిని గదరా పొడుపు కొండలమీద - నిడుపైన చందమామ నీలాగె నిలువబడెను గదరా నేనొంటిగాను పోతే - నీవు నా వెంట వస్తే నీడ జూచి జడుసుకొంటిని గదరా చల్ మోహనరంగ (చల్ మోహనరంగ అనే పదం తెలుగునాట ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. నిజానికి ఇది ఒక జానపద గేయంలోని మకుటం. ఈ పాటలోని కొంతభాగం ఇది. కృష్ణశ్రీగారు సేకరించిన పల్లెపదాలు అనే గ్రంథం నుంచి ఇది తీసుకోబడింది)

నన్నెక్కనివ్వండి బోను

  నన్నెక్కనివ్వండి బోను     నల్లకోట్లు నీలిరంగు నోట్లతో ఒక దేశం ఒక కోర్టులో ఫైసలా అయ్యే కేసు కాదు నాది నన్నెక్కనివ్వండి బోను నలుగురి నమ్మికతో 'అమ్మా ' అని పిలవడం తప్ప నవమోసాలు మోసిందెవరో ఎవరికైనా ఏమి తెలుసంటున్నాను సృష్టికర్తనే వెక్కిరిస్తోన్న పాపిష్టిని మీలో మిమ్మల్ని ప్రశ్నించుకొమ్మంటున్నాను అంటున్నాను అంటాను అనుకుంటూనే వస్తున్నాను మనిషిమీద నమ్మకం పోగొడుతున్న మీరు దేవుడిమీద ప్రమాణం చేయమంటారెందుకు? దోషికి నిర్దోషికి ఒకటే సూత్రం వల్లించిందే వల్లించి వాదిస్తారు ఫీజు కుడితి కుండలో న్యాయాన్ని ఎలుకలా ముంచేస్తారు మీ ఉద్యోగాలకు ప్రమాణాలేమిటి? ఎక్కనివ్వండి నన్ను బోను కలాలు కాగితాలు సర్దుకోండి లా బుక్కుల్లో నా సందేహాలు వ్రాసుకోండి న్యాయానికి దేశాలేమిటి? యెల్లలేమిటి? మనిషీ, రక్తం ప్రాణం ముఖ్యం లింగ భేదాలు వాదాలు తప్పితే మందిర్, మస్జిద్, చర్చి, మతాధికారుల మతాలు యెందుకు? ఆకలి, కామం, కలలూ, కన్నీళ్లు, మనిషిలోని మర్మజ్ఞానమంతా ఒక్కటే దేశమేదైతేనేం? మట్టంతా ఒక్కటే అమ్మ యెవరైతేనేం? చనుబాల తీపంతా ఒక్కటే బిక్కముఖాలతో చూస్తారేం? పిచ్చివాణ్ణిగా కేసు పుటప్ చెయ్యండి నన్నెక్కనివ్వండి బోను తిన్నయింటి మర్యాదెంచని నాకు బుద్ధుల్లో పెద్దల సహజాతాలేమై యుంటాయ్? మంచి మనసు పరిమళాలు విశ్వవ్యాప్తి కాకపోవు భావితరం గుర్తించకపోదు జగత్ప్రళయ కావ్యంలో తపనాగ్ని జ్వాల నిలుస్తోంది అణువణువున అగ్నికణం చల్లారక రగులుతోంది తీర్పు మీది జైలు మీది ... నన్నెక్కనివ్వండి బోను! (దిగంబర కవులలో ఒకరైన చెరబండరాజు రాసిన ప్రసిద్ధ కవిత ఇది)  

కవితాకోపం

  కవితాకోపం     పాడను, పాటలు పాడను వాడను, పదాలు వాడను వేడను, దేవుళ్ళను దెయ్యాలను వేడను. ఓడను, రాజుకు ధనరాజుకు రారాజుకు ఓడను గోడను, ధనవంతుల కనక సౌధ మున కివతల వణకే నిరుపేదల అడుసు గుడిసె గోడను. నన్ను చూచి ఎందుకొ మిన్నాగులు ఇట్లా పారాడుతు జీరాడుతు వస్తుంటాయి? నన్ను చూచి ఎందుకొ పున్నాగలు ఇట్లా తారాడుతు, గోరాడుతు పూస్తుంటాయి? ఇది లోకం నరలోకం నరకంలో లోకం నరలోకం. ఏనాడో తెలుసు నాకు ఈ నిరీహ నీరవ నిస్స్వార్థ నిర్ధన నీచ నీచ మానవునికి నిలువ నీడలేదు జగతి. లేదు లేదు విలువ లేదు రక్తానికి ప్రాణానికి శ్రమకూ సౌజన్యానికి రచయితకూ శ్రామికునికి రమణీ రమణీయ మణీ హృదయానికి విలువలేదు, విలువ లేదు. (దాశరథి కృష్ణమాచార్య రాసిన అగ్నిధార కవితా సంపుటిలోని ‘కవితాకోపం’లోని కొంతభాగం)  

చెప్పుడు మాటలు

చెప్పుడు మాటలు   కలతలకే పెద్ద తల  కల్పనకే కల ఈ చెప్పుడు మాట  చప్పుడు కాకుండా ఉండే మాట  చలించని మనసును ఉగ్వేదాలకు దారితీసే మాట  చక చక పరుగులు తీసే మాట  చిన్నా పెద్దల నోట వినే మాట ప్రతీ పూట "చెప్పుడు మాటలు విన్నావో అంతే సంగతి " తర తరాలను దూరం చేసేను ఓ చెప్పుడు మాట  స్నేహాలను శత్రుత్వాలుగా మార్చేను ఈ "చెప్పుడు మాట " తల్లి దండ్రులు , గురువులు చెప్పిన మాట లు ఎప్పటికీ సత్యం  కల్లమాటలు జోలు మాని "మంచిని చెప్పే మాటలు " ఆచరించిన  దైవము నిను మెచ్చంగా !! సమాజమునకు "పెద్దల మాట చద్ది మూట " యే గానీ "చెప్పుడు మాటలు" కానే కాదురా !! ఇకనైనా ఎల్లరు చప్పుడు చేయక చెప్పుడు మాటలు జోలు పోకండి !! - దివ్య చేవూరి

నీకోసం సిగరెట్ వెలిగించా!

నీకోసం సిగరెట్ వెలిగించా!       నీకోసం నీకోసం ఈసిగరెట్ వెలిగించా! గాలిలోన తేలిపోవు ఉంగరాల పొగను నేనుచూస్తుంటే నీవు నన్ను చూడాలని నేనది గమనించి అటేచూచినపుడు నీవు ఎటో చూడాలని చూపులతో దోబూచులు ఆడాలని ఈసిగరెట్ వెలిగించా నీకోసం. నీకొరకై నే నేమీ రాజ్యాలు గెలువలేదు, సప్తసముద్రాలు దాటి పెనుగొండలు తొలువలేదు, నలుదిక్కుల కోళ్ళుగాగ భూసింహాసనము నీవు ప్రతిష్ఠింప రారాజుల మౌళిరత్నరోచిస్సుల నీ మెత్తటి పాదాలకు అభిషేకం చేయలేదు. నీ కీర్తి పూజకొరకై పాటలపూలైనా కోయలేదు. లేనివాణ్ణి; నా దగ్గర ఏమున్నది ఇచ్చేందుకు? నా నెత్తురు గడ్డకట్టి; కన్నీరులు ఆవిరిగా యింకిపోయి ఈ సిగరెట్ పొగలో నీ సాన్నిధ్యపు సెగలో కటికబ్రతుకు బండరాయి కరిగేందుకు ఈ సిగరెట్ వెలిగించా నీ కోసం, నా కోసం. జీవిత జాగరంతో వాడిన నీ మసక కనుల ముందునిలచి నర్తించే ఈ చిరుపొగ ఉంగరాలు కాలుని భాండారంలో దొంగిలించి తెచ్చిన యీ నీ తియ్యని సాన్నిధ్యపు లఘు క్షణాలు అదృష్టం ఏమరి యిచ్చిన వరాలు అందుకనే ఈ సిగరెట్ వెలిగించా నీ కోసం! శూన్యములో కలుస్తోన్న సిగరెట్పొగ పరుగిడు కాలపు వడిలో నన్ను వీడుతున్న నీవు రెప్పపాటులో ఇక మిగలదు ఏమీ; కాని జీవితపు శూన్యం నింపేందుకు మళ్ళీ వెలిగిన నా సిగరెట్ పొగలో నీ జ్ఞాపకాల సువాసనలు గుబులుకొంటయ్! నీకొరకై వెదుకుతున్న కండ్లల్లో నీసాన్నిధ్యపు నీడలలముకొంటయ్. ఒకసిగరెట్ వెలిగిస్తా మరల నేను నీకోసం! (బైరాగి రాసిన కవితల సంపుటి ‘చీకటినీడలు’ నుంచి)    

అలిగిన మేఘం...

అలిగిన మేఘం...     అలిగి వెళుతోవున్న మేఘం అంచున పరిగెడుతూ ఎవరో బతిమాలుతూ ఉన్నారు కాసేపటికి లోకం కళ్ళు మూసుకుంది గుడ్డిదీపం ఒకటే నవ్విన చప్పుడు మేఘం కల చెదిరిందేమో కనీసం దానికి చెప్పుండాల్సింది చీకటి పరుగులు మోస్తో మరెవరూ వెనకాలే ఉండబోరనీ తూర్పు అంచున రోజుకో ప్రసవం నెత్తుటి కిరణాల పారాక్సిజమ్తో ఉరిపోసుకున్న చీకటి , రెక్కలు కొట్టుకుంటూ విలవిల్లాడి ఇక పోయింది ఆపలేని ఒత్తిడిలో బండరాళ్ళను పగలగొట్టాలన్న ఆవేశంతో ఒక అల కుంచెల ఊపిర్లు అలుముకున్న రంగు చుక్కలూ చిత్రం కార్చిన ఆనందభాష్పాలే కదూ! ఏడుస్తావే.. అది మరి నవ్వో, ఏడుపో మనసు అణచలేని అవ్యక్తభావమెుకటి ఉన్నట్టుండి కళ్ళల్లో జారిందేమో ఏ చీకటికీ అందని మేఘమెుకసారి చెంపల మీద నుంచి జారుతూ మెరిసింది -సరిత భూపతి  

జ్ఞాపకానికి మరణం లేదు..

జ్ఞాపకానికి మరణం లేదు చికటి రాజ్జపు చిట్టడివిలో అంతటా నిశ్సబ్దం ఈ క్షణమే తట్టుకోలేకుంటే మబ్బుతునకల ఆఖరి చారికను అదృశ్యం చేస్తూ చికటి కమ్మేసి విలయతాండవం ఆడుతుంటే ఇక ఈ రాత్రిని భరించటం ఎలా----- ఇంత విషాదపు స్పర్స మునుపెన్నడూ స్ప్రుసించలేదే పేగుల్ని మెలిపెట్టేసి గుండెని పిండేసి భయానక నుత్యం భ్రమింపజేసే ఈ ఒక్క క్షణం కాసేపు స్రుష్టిని ఒడిసి పెడితే సంబరమే|| చివరి మజలి ఇంత కఠినమా---- కరుణా రాహిత్యమై కన్నీరు మున్నీరు రోదనై యమదండయాత్ర దిక్కరించలేని కళ్ళల్లో ఇంత దురవస్థ చూపుల్లో ఇంత అచేతనం ఎన్నడూ దరిచేరలేదే!! మానవ జన్మ వీట్కోలు పలుకుతుంటే దేహం విలవిల సృష్టికర్తకి అర్ధం కాలేదా? ఏమీచేయలేని అశక్తత చేతుల్ని కట్టిపడేసిన ఆ క్షణం బహుశా దురదృష్టానికి ప్రతీక! తుది శ్వాస ఓ చేదునిజం నిశ్చల భయాల నిర్వికార స్వప్నమై ముక్కలుగా వేరుచేసి విసిరేస్తూ తేలికైపోతే---- నిర్జీవం జీవమై నాన్న సజీవమై ఎప్పటికి సజీవమై కళ్లు తెరచి అదే చిరునవ్వుతో -----! అదే పంచెకట్టు అదే తుండువా అదే ఠీవీ భౌతికానికే మరణం జ్ఞాపకానికి మరణం లేదు/రాదు భగవంతుని చేరుకున్న వారందరికి నా కవిత అంకితం.. -Manohara Kummaragunta