గునసాని ప్రవీణ్, యార్లగడ్డ శివరాం, లింగాల హరిప్రసాద్, టి.శ్రీధర్ రెడ్డి, కుకునూర్ వినోద్, యడం బాలాజీ, భూమిరెడ్డి యుగంధర్, రాహుల్ కోనేరు, చిత్తలూరి శ్రీనివాస్, శ్రీనివాస్ రాహు, కొనుగంటి రమణరెడ్డి, గాలి నాగేందర్, ఆత్మకూరు వినోద్, పెదపర్తి శ్రీనివాస్, సాంబిరెడ్డి, సాగర్ రెడ్డి, శ్రీనాథ్ తదితరులు 2011 ఏప్రిల్ 17వ తారీఖున డిట్రాయిట్ లో ఎన్.ఆర్.ఐ. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పతాకావిష్కరణతో ఘనంగా ప్రారంభించారు.
కడప పార్లమెంట్, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగనున్న ఉపఎన్నికలలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టాలని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని అవహేళన చేసిన సోనియాగాంధీకి జ్ఞానోదయం అయ్యేలా తీర్పు ఇవ్వాలని ఆయా నియోజకవర్గ ప్రజలను కోరారు.
వై.ఎస్.ఆర్. అడుగుజాడల్లో నడుస్తున్న వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని, వై.ఎస్.ఆర్. ఆశయాల్ని, ప్రజాప్రయోజన కార్యక్రమాలని ముందుకు నడిపే సారథి జగన్ మాత్రమేనని అన్నారు. ఇటీవల అమెరికా వచ్చినసందర్భంలో వై.ఎస్.వివేకానంద రెడ్డి తమతో మాట్లాడుతూ ప్రజలందరూ జగన్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని, వై.ఎస్.ఆర్. కి అసలైన వారసుడు జగనేనని అన్నారని ఇప్పుడు వివేకానందరెడ్డి మనసు ఎందుకు మార్చుకున్నారో తెలియడంలేదని అన్నారు.
ఎన్.ఆర్.ఐ. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున డిట్రాయిట్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను, సహాయకార్యక్రమాలను చేపట్టాలని తీర్మానించారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ విజయానికి, విస్తృతంగా ప్రచారం చేయడానికి, కడపకు చెందిన ఆంద్రులు వారి ఓటును సద్వినియోగ పరచుకోవడానికి అమెరికా నుండి పలువురు కడపకు వెళ్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు