టోల్‌ప్లాజాపై లగడపాటి జవాబు చెప్పాలి

గట్టు భీమవరం దగ్గర టోల్‌ప్లాజా ఏర్పాటు విషయంలో విజయవాడ ఎంపీ నియోజకవర్గ ప్రజలకు ఎంపీ లగడపాటి రాజగోపాల్ సమాధానం చెప్పి తీరాలని అర్బన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వల్లభనేని వంశీమోహన్ అన్నారు. టోల్‌ప్లాజాపై తాము చేపట్టిన దీక్షలకు మద్దతుగా స్థానికంగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వచ్చి పాల్గొంటున్నా లగడపాటి రాజగోపాల్ తప్పించుకు తిరగటం భావ్యం కాదన్నారు.


 

హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే జాతీయరహదారిపై నందిగామ సమీపంలో కీసర దగ్గర ఇప్పిటికే ఒక టోల్‌ప్లాజా ఏర్పాటై ఉందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా 25 కిలోమీటర్ల దూరంలో వత్సవాయి మండలం గట్టు భీమవరంలో జీఎంఆర్ సంస్థ మళ్లీ టోల్‌ప్లాజా ఏర్పాటు చేస్తోందన్నారు. హైవే నిబంధనల ప్రకారం 60 కిలోమీటర్ల దూరంలో మాత్రమే టోల్‌ప్లాజా ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. 25 కిలోమీటర్ల స్వల్ప దూరంలోనే మరో టోల్‌గేటు ఏర్పాటు చేయటం ద్వారా జగ్గయ్యపేట నుంచి విజయవాడ వచ్చే వారికి పెనుభారంగా మారిందన్నారు.