తెరాస వైకాపాల మధ్య ఉన్నదీ దోస్తీయా...కుస్తీయా?
posted on Nov 22, 2014 2:51PM
ప్రస్తుతం తెలంగాణాలో తెరాస ఒక్కటీ ఒక్కవైపు, కాంగ్రెస్, తెదేపా, బీజేపీలు మరో వైపు నిలిచి యుద్ధం చేస్తుండటం అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వైకాపా వంటి ఆప్తమిత్రుడు అండగా ఉంటే బాగుండునని తెరాస భావిస్తే తప్పులేదు. ఎందుకంటే తెరాస, వైకాపాల మధ్య ఉన్న మంచి అనుబంధం సంగతి ఎవరికీ తెలియంది కాదు. దాని గురించి పవన్ కళ్యాణ్ తో సహా చాలా మంది డౌట్లు వ్యక్తం చేసారు. కానీ ఆ రెండు పార్టీలు ఇంతవరకు నేరుగా జవాబు చెప్పలేదు. అందువల్ల ఆ రెండు పార్టీలు ఒకటీ అరా విమర్శలు చేసుకొన్నా వారి స్నేహం ఇంకా కొనసాగుతూనే ఉందని భావించవలసి ఉంటుంది. పోలవరం, విద్యార్ధుల ఫీజ్ రీ-ఇంబర్స్ మెంటు, నీళ్ళు, విద్యుత్, ఇంటర్ పరీక్షలు వంటి అనేక అంశాలపై కేసీఆర్, ఆయన మంత్రులు ఎంతగా గొడవ చేస్తున్నా వైకాపా నోరు మెదపకపోవడమే అందుకు చక్కటి నిదర్శనం.
ప్రస్తుతం తెలంగాణాలో రెండు జాతీయ పార్టీలను, త్వరలో జాతీయ పార్టీగా మారబోతున్న తెదేపాను డ్డీ కొని ఒంటరిపోరాటం చేస్తున్న తెరాసకు వైకాపా వంటి స్నేహితుడి మద్దతు చాలా అవసరం కనుక వచ్చే ఎన్నికలలో వారిని నిలువరించేందుకే బహుశః వైకాపాను తెరాసయే ఆహ్వానించి ఉన్నా ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే తనకంటే బలవంతుడయిన వాడితో స్నేహం చేస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది కనుకనే తెలంగాణాలో ఏ మాత్రం బలం లేని వైకాపాను ఆహ్వానించి ఉండవచ్చును. ఉదాహరణకు సోనియాగాంధీ తను ఎప్పుడు దిగిపోమంటే అప్పుడు ప్రధాన మంత్రి కుర్చీలో నుండి దిగిపోయే డా. మన్మోహన్ సింగుకి అవకాశం ఇచ్చింది తప్ప ఆ కుర్చీలో కూర్చొని దేశాన్ని ఏలేయాలని ఆశపడిన చిదంబరాన్ని కూర్చోనీలేదు. అదేవిధంగా తెలంగాణాపై ఆసక్తిలేని వైకాపాను పక్కనబెట్టుకోవడం వల్ల ఎటువంటి నష్టమూ ఉండదు కనుకనే ఆ పార్టీ తెలంగాణాలో రీ-ఎంట్రీ ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా అందరూ నోరు మెదపడం లేదని భావించాల్సి ఉంటుంది.
అందువల్ల వైకాపా కూడా తెలంగాణాలో బలం పెంచుకొనే ప్రయత్నాలు గట్టిగా చేయకపోవచ్చును. ఆ పార్టీ తెలంగాణాలో తెలంగాణాలో తన ఉనికిని చాటుకోవడానికే పరిమితమవవచ్చును. దాని వలన వైకాపాకు ఏమి ప్రయోజనం అంటే తమ ఉమ్మడి శత్రువు తెదేపాపై ఇరువురూ కలిసి పోరాడి తెలంగాణాలో దానిని పూర్తిగా బలహీనపరచవచ్చును. అంతేకాదు...జాతీయ పార్టీగా మారాలని భావిస్తున్న వైకాపా తెలంగాణాలో కూడా పోటీ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. కనుక మళ్ళీ ఎన్నికల వరకు ప్రజలను మభ్యపెట్టేందుకు తెరాస, వైకాపాలు ఒకదానిపై కత్తులు దూసుకొంటూ కాలక్షేపం చేయవచ్చును.