‘దక్షిణ తెలంగాణ’ ఉద్యమం రాజుకుంటోంది
posted on Nov 22, 2014 3:22PM
విడిపోవడం ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని, మనకంటూ సొంత రాష్ట్రం వుంటేనే ఆత్మగౌరవం నిలబడుతుందని ప్రత్యేక తెలంగాణ ఉద్యమం గొంతెత్తి చాటింది. వారి ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ అవే ప్రాతిపదికల మీద ‘దక్షిణ తెలంగాణ’ ఉద్యమం రాజుకుంటోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం దక్షిణ తెలంగాణను చిన్నచూపు చూస్తోందని, త్వరలో ‘దక్షిణ తెలంగాణ’ ఉద్యమం రాక తప్పదని దక్షిణ తెలంగాణకే చెందిన టీడీపీ నాయకుడు రేవంత్‌రెడ్డి కొద్ది నెలల క్రితమే చెప్పారు. అలాగే కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ కూడా ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తం చేశారు. కేవలం రెండు మూడు నెలల క్రితం మొదలైన ఈ అభిప్రాయాలు ఇప్పుడు ఉద్యమం రూపాన్ని సంతరించుకుంటున్నాయి. ఉత్తర తెలంగాణతో కలసి వుండటం తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, తెలంగాణ రాష్ట్రం నుంచి విడిపోయి దక్షిణ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం అనివార్యమని ఆ ప్రాంత నాయకులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అంతా దక్షిణ తెలంగాణలో వుంటే ఆధిపత్యం మాత్రం ఉత్తర తెలంగాణ వారి చేతిలో వుండటాన్ని ఈ ప్రాంతం వారు భరించలేకపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించినప్పుడు డీకే అరుణతో సహా పలువురు దక్షిణ తెలంగాణ వారు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. అసలు దక్షిణ తెలంగాణలో బతుకమ్మకి అంతగా ప్రాధాన్యం ఇవ్వరు. అక్కడ బోనాలు వైభవంగా జరుపుకుంటారు. అలాంటిది బతుకమ్మను దక్షిణ తెలంగాణ మీద బలవంతంగా రుద్దుతున్నారన్న భావన ఆ ప్రాంతంలో వ్యాపించింది. దీనికితోడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన చెరువుల పూడిక తీత కార్యక్రమానికి ‘మిషన్ కాకతీయ’ అంటూ కాకతీయుల పేరు పెట్టారు. దీనిని దక్షిణ తెలంగాణలోని నాయకులు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాకతీయులు ఉత్తర తెలంగాణను మాత్రమే పరిపాలించారు. సంస్థానాధీశులు దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని పాలించారు. దక్షిణ తెలంగాణకు ఉన్నత చరిత్ర వుంది. ఉన్నత సంస్కృతి వుంది. అయితే తమ ప్రాంతానికి ఎలాంటి సంబంధం లేని కాకతీయులను తమమీద రుద్దడం మీద దక్షిణ తెలంగాణ వాదులు నిరసనను వ్యక్తం చేస్తున్నారు. తమ చరిత్రను, సంస్కృతిని కాపాడుకోవాలని భావిస్తున్నారు.
ఇప్పుడంటే కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి నాయకుడైపోయారుగానీ, తెలంగాణలో మొట్టమొదట ఉద్యమాన్ని రగిల్చిన వ్యక్తి కాంగ్రెస్ నాయకుడు చిన్నారెడ్డి. దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆయన ఇప్పుడు మళ్ళీ దక్షిణ తెలంగాణకు జరుగుతున్న అవమానాలు చూసి ‘దక్షిణ తెలంగాణ’ ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలన్న ఆలోచనలో వున్నట్టు తెలుస్తోంది. చిన్నారెడ్డికి అండగా డీకే అరుణ లాంటి మంచి నాయకురాలు నిలుస్తున్నట్టు సమాచారం. దక్షిణ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం ప్రారంభించడానికి వీరితోపాటు ఆ ప్రాంతంలోని అనేకమంది నాయకులు సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.