బీఆర్ఎస్ లాగే వైసీపీకీ బిగ్ షాక్ తప్పదా?

వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో రాష్ట్రంలో అభివృద్ధిని ప‌ట్టించుకోని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. ప్ర‌తీ జిల్లాలో పార్టీ కార్యాల‌యాల‌ను నిర్మించేందుకు మాత్రం కోట్లు ఖ‌ర్చు చేశారు. మైసూరు రాజ‌మ‌హ‌ల్ ను త‌ల‌ద‌న్నేలా కార్యాల‌యాల భ‌వ‌నాల‌ను నిర్మించ త‌ల‌పెట్టారు. కొన్ని జిల్లాల్లో పార్టీ భ‌వ‌న నిర్మాణాలు పూర్తికాగా.. మ‌రికొన్ని జిల్లాల్లో పునాదుల ద‌శ‌ల్లో, మ‌రికొన్ని జిల్లాల్లో స్లాబ్ ద‌శ‌ల్లో ఉన్నాయి. పార్టీ కార్యాల‌యాల నిర్మాణం పేరుతో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్ర‌తీ జిల్లాలోనూ ప్ర‌భుత్వ భూముల అధికారిక క‌బ్జాకు తెబ‌డ్డారు.  33ఏళ్ల లీజు ముసుగులో కోట్ల రూపాయ‌ల విలువైన ప్ర‌భుత్వ భూముల‌కు టెండ‌ర్ పెట్టారు. చేతిలో అధికారం ఉంద‌ని చెల‌రేగిపోయారు. అత్యంత విలువైన ప్రైవేట్‌ భూముల్ని చెర‌బ‌ట్టారు. త‌ద్వారా న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల న‌డిబొడ్డున, జాతీయ ర‌హ‌దారుల‌కు ప‌క్క‌న అత్యంత ఖ‌రీదైన భూముల‌ను కార్యాల‌యాల‌కు  కేటాయించేసుకున్నారు.

సామాజిక‌, సంస్థాగ‌త అవ‌స‌రాల‌కోసం గ‌తంలో వివిధ విభాగాల సంస్థ‌ల‌కు కేటాయించిన భూముల‌ను బ‌ల‌వంతంగా లాక్కొని పార్టీ కార్యాల‌యాల నిర్మాణాలు చేప‌ట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కోట్ల రూపాయల విలువైన భూముల‌ను ఏడాదికి ఎక‌రానికి వెయ్యి రూపాయ‌ల చొప్పున లీజుకు పార్టీ కార్యాల‌యాల కోసం అంటూ ప్ర‌భుత్వం క‌ట్ట‌బెట్టింది. దీనికి తోడు అనుమ‌తి లేకుండానే పార్టీ కార్యాల‌యాల భ‌వ‌న నిర్మాణాలు చేప‌ట్టారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే అనుమ‌తి లేకుండా పార్టీ కార్యాల‌యాలు నిర్మించ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అనుమతులు తీసుకోకుండా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసుల‌కు స్పందించ‌క‌పోతే కూల్చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

ప్ర‌తి జిల్లా కేంద్రంలో వైసీపీ కార్యాల‌యం నిర్మాణంకోసం ఎక‌రం నుంచి రెండు ఎక‌రాల చొప్పున భూములను అప్ప‌టి ప్ర‌భుత్వం కేటాయించింది. దీంతో 26 జిల్లాల్లో42.24 ఎక‌రాలు కేటాయించ‌గా.. వాటి విలువ రూ. 688 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అనుమ‌తులు లేకుండా పార్టీ కార్యాల‌యాలు నిర్మాణం చేస్తున్నారంటూ రాష్ట్ర వ్యాప్తంగా 21 చోట్ల నోటీ సులు జారీ చేసింది. అనుమ‌తులు లేకుండా నిర్మిస్తున్న భ‌వ‌నాల‌ను ఎందుకు తొలిగించకూడదంటూ నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. వీటి పై వైసీపీ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాము నిబంధనలు అతిక్రమించలేదని వైసీపీ కోర్టులో వాదించింది. విచార‌ణ అనంత‌రం పార్టీ కార్యాల‌యాల కూల్చివేతల  విషయంలో చట్ట నిబంధనలు పాటించాలని హైకోర్టు ఏపీ ప్ర‌భుత్వానికి స్పష్టం చేసింది. రెండు నెలల సమయంలో భవనాల అనుమతుల రికార్డులను అధికారులకు ఇవ్వాలని వైసీపీకి హైకోర్టు సూచించింది.

కోర్టు తీర్పుతో ఇప్ప‌టికే గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం దగ్గర నిర్మిస్తున్న వైఎస్సా ర్‌సీపీ కార్యాలయాన్ని అధికారులు కూల్చివేశారు. ఈ స్థలం జలవనరుల శాఖకు చెందిన‌ది. అయితే అక్కడ అక్రమంగా వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు గుర్తించిన అధికారులు వైసీపీ నిర్మిస్తున్న భవనాన్ని కూల్చివేశారు. రెండు నెల‌ల క్రితం హైకోర్టు ఇచ్చిన తీర్పులో భాగంగా ఇచ్చిన గ‌డువు పూర్త‌వుతున్నది. ఈ నేప‌థ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యం  విష‌యంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు వైసీపీ శ్రేణుల్లో ఆందోళ‌న క‌లిగిస్తోంది. 

నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చి వేయాలని హైకోర్టు తాజా ఆదేశించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నల్లగొండ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ స్థలంలో పార్టీ కార్యాలయాన్ని కట్టింది. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రభుత్వ స్థలంలో నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని  ప్ర‌య‌త్నాలు చేయ‌గా.. నల్లగొండ బీఆర్ఎస్ నేతలు మాత్రం అనుమతుల కోసం మున్సిపల్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నామని, అయినా మునిసిపల్ అధికారులు అనుమతులు ఇవ్వలేదని అవసరమైతే ఎల్ఆర్ఎస్ ప్రకారం ఎంతైనా బిల్లును కట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దీనికి తోడు పార్టీ కార్యాల‌యాన్ని కూల్చ‌కుండా ఆదేశాలు ఇవ్వాల‌ని  హైకోర్టును ఆశ్రయించారు. వాదోపవాదాలు విన్న హైకోర్టు.. భవనాన్ని నిర్మించే ముందు అనుమతులు తీసుకోవాలి.. కానీ, నిర్మించాక ఎలా తీసుకుంటారని ప్రశ్నించింది. ఇది సమంజసం కాదని పేర్కొంటూ  15 రోజులలోగా బిల్డింగును కూల్చివేయాలని మున్సిపల్ కమిషనర్ ను హైకోర్టు ఆదేశించింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టు బిగ్ షాకిచ్చిన‌ట్ల‌యింది. 

నల్లగొండ బీఆర్ఎస్ ఆఫీసును కూల్చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో .. వైసీపీకి కూడా గుండెల్లో రాయి పడింది. బీఆర్ఎస్ పార్టీ నిర్మించుకున్న కార్యాలయాలలో నల్గొండ భవనానికి మాత్రమే అనుమతుల్లేవేమో కానీ ఏపీలో వైసీపీకి చెందిన ఒక్క  ఆఫీసుకు తప్ప మరి  దేనికీ అనుమతుల్లేవు. అన్నింటినీ ప్రస్తుతానికి కోర్టుకెళ్లి ఆపుకున్నారు. ఆ గడువు కూడా ముగిసిపోతున్నది. ఆ తర్వాత అయినా కూల్చివేయక తప్పదు. ఏ కోర్టు అయినా అనుమతి లేని భవనాలను రెగ్యులరైజ్ చేయమని ఆదేశించదు. నల్లగొండలో అదే జరిగింది.  కట్టేసిన భవనాలకు అనుమతి ఇప్పించాలని కోరుతూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.    ఏపీలో కూడా  వైసీపీ కార్యాలయాలకూ అదే పరిస్థితి. వాటన్నిటినీ  ఇవాళ కాకపోతే రేపు నేలమట్టం చేయాల్సిందే.