ఏపీకి చంద్రబాబే బ్రాండ్.. క్యూ కడుతున్న బడా కంపెనీలు!

ఏపీకి గ్ర‌హ‌ణం వీడింది. ప్ర‌పంచంలోని ప్ర‌ముఖ కంపెనీలు అమ‌రావ‌తి, విశాఖలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తి చూపుతున్నాయి. సీఎం చంద్ర‌బాబు చొర‌వ‌తో ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌లు ఏపీకి క్యూ క‌డుతున్నారు. వైసీపీ హ‌యాంలో రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు కంపెనీల ప్ర‌తినిధులు వ‌ణికిపోయారు. చంద్ర‌బాబు హ‌యాంలో పెట్టుబ‌డులు పెట్టిన కంపెనీలు వైసీపీ ప్ర‌భుత్వ ఇబ్బందుల‌ను త‌ట్టుకోలేక రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయి.  ఏపీకి ఓ దండం, జగన్ కు రెండు దండాలు అంటూ రాష్ట్రం వదిలి తెలంగాణ, ఇత‌ర రాష్ట్రాల్లో త‌మ కంపెనీల‌ను ఏర్పాటు చేసుకున్నాయి. అంటే ఏపీలో పెట్టుబ‌డులు పెట్టాలంటేనే కంపెనీల యాజమాన్యాలు బెదిరి పారిపోయే ప‌రిస్థితి వైసీపీ ప్ర‌భుత్వం క‌ల్పించింది.

ఫ‌లితంగా గ‌త ఐదేళ్ల వైసీపీ హ‌యాంలో ఒక్క చెప్పుకోద‌గ్గ కంపెనీకూడా ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు రాలేదు. ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వచ్చింది.  సీఎంగా చంద్ర‌బాబు నాయుడు  పదవీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. సీఎం అయిన త‌రువాత పారిశ్రామిక వేత్త‌ల‌తో చంద్ర‌బాబు మాట్లాడారు. ఆ స‌మ‌యంలో ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు వారు పెద్దగా ఆస‌క్తి చూప‌లేదు. దీనికి కార‌ణంగా వైసీపీ ప్ర‌భుత్వ నిర్వాక‌మే.

అపార పాల‌నా అనుభ‌వం క‌లిగిన చంద్ర‌బాబు నాయుడు మ‌ళ్లీ పారిశ్రామిక వేత్త‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రిపి.. రాబోయే కాలంలో వారికి ఇబ్బందులు ఎదుర‌వ్వ‌కుండా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. దీంతో ఏపీలో పెట్టుబడులు పెడితే బెటరన్న ఆలోచనలకు పెట్టుబడిదారులు వస్తున్నారు. తాజాగా.. గుజరాత్ లోని గాంధీ నగర్ లో  జరిగిన పెట్టుబడుల సదస్సులో చంద్రబాబు ఇచ్చిన ప్రజెంటేషన్ పారిశ్రామికవేత్తల్ని అబ్బుర పరిచింది.  అ ప్రజెంటేషన్   బడా కంపెనీలను ఏపీ వైపు లాక్కొస్తోంది.  అది సోషల్ మీడియాలో వారి స్పందనను బట్టే తెలియచేస్తోంది. దీంతో రాష్ట్రానికి మ‌ళ్లీ మంచి రోజులు వ‌చ్చాయంటూ  ప్ర‌జ‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. పారిశ్రామిక వేత్తలకు ఏ రాజకీయ నాయకుడిపైనా అభిమానం లేదా కోపం ఉండదు. వారికి తమ  వ్యాపారాలు ముఖ్యం. ఎవరు ప్రోత్సహిస్తే వారి వద్దకు వెళ్తారు. అమ్మో జగన్ అని ఎందుకు అంటారంటే.. ఆయనకు కావాల్సింది రాష్ట్రం కాదు.. సొంత ప్రయోజనాలు. పెట్టుబడుల్లో కమిషన్లు కోరుకుంటారు. అప్పనంగా వాటాలు కోరుకుంటారు. ప్రభుత్వ పరంగా కల్పించే సౌకర్యాలకు తనకు ప్రయోజనం కల్పించాలంటారు. గతంలో అంటే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో జగన్ క్విడ్ ప్రో కో లో జరిగింది అదే.  ఆ తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ సీఎంగానూ  అదే  చేశారు. కాబట్టే పారిశ్రామిక వేత్తలు పరారయ్యారు.  

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం విడిపోయిన త‌రువాత 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏపీలో తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది. సీఎం చంద్ర‌బాబు నాయుడుపై ఉన్న న‌మ్మ‌కంతో ప్ర‌పంచ వ్యాప్తంగా పేరున్న ప‌లు కంపెనీలు ఏపీలో పెట్టుబ‌డులు పెట్టాయి. రాష్ట్ర రాజ‌ధానితోపాటు క‌ర్నూలు, తిరుప‌తి, విశాఖ‌ప‌ట్ట‌ణంతో పాటు ప‌లు ప్ర‌ముఖ న‌గ‌రాల్లో ప‌లు కంపెనీల కార్య‌క‌లాపాల‌ను మొద‌లు పెట్టాయి. అయితే, 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి రావ‌డంతో సీఎంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్ట‌కుండా ఐదేళ్లు అరాక పాల‌న సాగించారు.

చంద్ర‌బాబు హ‌యాంలో రాష్ట్రంలో  పెట్టుబ‌డులు పెట్టిన కంపెనీలను  వైసీపీ ప్ర‌భుత్వం బెదిరిం పుల‌కు గురిచేసింది. ప‌లు కంపెనీల్లో వాటాలు కావాల‌ని లేదంటే మీ కంపెనీ కార్య‌క‌లాపాలు ఏపీలో కొన‌సాగ‌నివ్వ‌మ‌ని స్వ‌యంగా వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులే బెదిరింపుల‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న‌లు అప్ప‌ట్లో వెలుగులోకి వ‌చ్చాయి. దీంతో పారిశ్రామిక వేత్త‌లు వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు అడిగినంత‌ వాటాలు ఇవ్వ‌లేక రాష్ట్రం వ‌దిలి వెళ్లిపోయారు. మ‌రికొంద‌రు పారిశ్రామిక వేత్త‌లు జ‌గ‌న్ ప్ర‌భుత్వం బెదిరింపుల‌తో ఏపీ నుంచి దుకాణం స‌ర్దేశారు. వీటిలో ల‌లూ, అదానీ, టెంపుల్ట‌న్ తోపాటు ప‌లు కంపెనీలు ఉన్నాయి. ఇక సొంత రాష్ట్రానికి చెందిన ప్రపంచ స్థాయి కంపెనీ అమరరాజాను మూసేసి వెళ్లిపోవాలని వైసీపీ ప్ర‌భుత్వం వేధించింది. దీంతో  అమరరాబా బ్యాటరీస్ ఇక్క‌డ దుకాణం బంద్ చేసి తెలంగాణ‌లోని మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో కంపెనీని త‌మ కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తున్నది.  

ఇక ఇప్పుడు చంద్ర‌బాబు నాయుడు సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత ప‌లు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ప్ర‌భుత్వం ప‌రంగా అన్నివిధాల‌ అండ‌గా ఉంటామ‌న్న భ‌రోసాకు తోడు.. పెట్టుబ‌డుల‌కు సుల‌భంగా అనుమ‌తులిచ్చేందుకు చంద్ర‌బాబు సానుకూలంగా ఉండ‌టంతో ఒక్కో కంపెనీ ఏపీకి వ‌చ్చేందుకు మొగ్గు చూపుతొంది. ఇప్ప‌టికే టాటా, గోద్రెజ్ కంపెనీల‌తోపాటు ప‌లు కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టేందుకు రెడీగా ఉన్నాయి. అమ‌రావ‌తితో పాటు విశాఖ‌ప‌ట్నంలో త‌మ కంపెనీ 2,800కోట్ల పెట్టుబ‌డి పెట్టేందుకు ఆస‌క్తిగా ఉన్న‌ట్లు గోద్రెజ్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. గోద్రెజ్ సీఎండీ నాదిర్ గోద్రేజ్ సీఎం చంద్ర‌బాబును క‌లిశారు. అగ్రి, ఆక్వా, రియ‌ల్ ఎస్టేట్ రంగాల్లో ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు గోద్రెజ్‌ సంసిద్ధ‌త వ్య‌క్తం చేసింది. అయితే, తొలి విడ‌త‌లో రూ.500 కోట్లు పెట్టుబ‌డులు పెట్ట‌నుండ‌గా.. మిగిలిన 2,300 కోట్లు విడ‌త‌ల వారిగా ఏపీలో ప‌లు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు గోద్రెజ్ కంపెనీ అంగీకారం తెలిపింది. ఏపీకి కొత్త‌గా రాబోతున్న కంపెనీల‌న్నీ ఒక్క ప్రాంతానికే ప‌రిమితం కాకుండా… అమ‌రావ‌తితో పాటు విశాఖ‌లోనూ త‌మ కార్య‌క‌లాపాలు ప్రారంభించేందుకు ముందుకు రావ‌టం శుభ‌ప‌రిణామంగా ప్ర‌భుత్వ వ‌ర్గాలు భావిస్తున్నాయి. త‌ద్వారా అభివృద్ధి స‌మ‌తుల్య‌త‌తో పాటు అన్ని ప్రాంతాలూ అభివృద్ది చెందుతాయి. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు పాల‌న‌లో పారిశ్రామిక వేత్త‌లు ఏపీకి క్యూక‌డుతుండ‌టంతో మ‌ళ్లీ రాష్ట్రానికి మంచిరోజులు వ‌చ్చాయంటూ జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు.