జమిలికి బీఆర్ఎస్ జై!?

జమిలి ఎన్నికల తేనెతుట్టెను కేంద్రం తాజాగా మరోసారి కదిపింది. దేశంలో అసెంబ్లీ, లోక్ సభకు ఒకే సారి ఎన్నికల ప్రతిపాదనను గత పదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ వల్లె వేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో మరో సారి ఈ అంశంపై దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. అన్ని రాజకీయ పార్టీల చర్చలకూ ఇదే కేంద్ర బిందువు అయ్యింది. న్యాయనిపుణులు జమిలి ఎన్నికల సాధ్యానాధ్యాలపై చర్చోపచర్చలు చేస్తున్నారు. పలు రాజకీయ పార్టీలు జమిలికి ససేమిరా అంటున్నాయి. జమిలి ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగ సవరణలు కూడా చేయాల్సి ఉంది. లోక్ సభలో సొంతంగా బలం లేని బీజేపీ ఈ సవరణలకు ఆమోదముద్ర పొందగలుగుతుందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు జమిలికి సై అంటాయన్న నమ్మకం లేదు.

ఈ పరిస్థితుల్లో అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ జమిలికి సై అంది. తెలంగాణలో బీఆర్ఎస్ అధకారంలో ఉన్నంత కాలం బీజేపీతో ఆ పార్టీకి ఉప్పూ నిప్పు సంబంధమే ఉంది. జమిలి ఎన్నికలకు ససేమిరా అన్న పార్టీలలో బీఆర్ఎస్ కూడా ఒకటి. అయితే ఇప్పుడు ఆ పార్టీ తెలంగాణలో  అధికారంలో  లేదు. విపక్షంలో ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీ అధిష్ఠానం ఇప్పటికే జమిలిని నో చెప్పేసింది. ఈ నేపథ్యంలో అధికారానికి దూరంగా ఐదేళ్ల పాటు విపక్షంలో కూర్చునే ఓపిక లేని బీఆర్ఎస్ జమిలి ప్రతిపాదనకు రెండో ఆలోచన లేకుండా సై అనేసింది.

ఆ పార్టీ సై అన్నంత మాత్రాన జమిలి ఎన్నికలకు లైన్ క్లియర్ అయిపోయిందని కాదు కానీ,  ఆ పార్టీ సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు జరగాలని కోరుకుంటోందన్న విషయం బయటపడిపోయింది. అందుకే ఆ పార్టీ జమిలికి సై అంటోంది. అయితే జమిలిని ఓకే అని బాహాటంగా చెప్పకుండా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమే అంటూ చెబుతోంది. అయితే ఆ పార్టీ ఎన్నికలకు రెడీ అన్న మాటలు.. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అన్న కాంగ్రెస్ వాదనకు బలం చేకూర్చిందని పరిశీలకులు అంటున్నారు.