జగన్ నిర్వాకం.. ఏపీ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం.. కేంద్రం తీరు ఆక్షేపణీయం!

జగన్ ఆర్థిక అరాచకత్వం కారణంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారిన సంగతి తెలిసిందే.  జగన్ ఆర్థిక అరాచకత్వం కారణంగా రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని, ఉద్యోగులకు జీతాలకు కూడా నిధులు వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడిందనీ చెప్పారు. సరిగ్గా వంద రోజుల కిందట రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. నెమ్మది నెమ్మదిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు అన్ని చర్యలూ తీసుకుంటోంది. మూడు నెలలుగా ఉద్యోగులకు మొదటి తేదీనే ప్రభుత్వం వేతనాలు చెల్లించింది. అలాగే సామాజిక పింఛన్లను కూడా ఠంచనుగా ఒకటో తేదీనే చెల్లించింది. అయితే నాలుగో నెల వేతనాలు, పింఛన్లకు ఇంకా పది రోజుల సమయం ఉండగానే చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టే పనిలో ఉండగానే    బుడమేరు ముంపు ఉపద్రవం వచ్చిపడింది.  సీఎం చంద్రబాబు  తొమ్మిది రోజులు నిరంతరంగా వరద బాధితులను ఆదుకోవడానికి శాయశక్తులా కష్టపడ్డారు. విజయవాడ కోలుకున్న తరువాత రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు భారీగా నష్టపరిహారం ప్రకటించి పంపిణీలు ప్రారంభించింది. 

వరద బాధితులకు 179 గ్రామాల్లో నష్టపరిహారం చెల్లిస్తామని,విజయవాడలో ఇళ్లయజమానులకు ,చిరు వ్యాపారులకు, దెబ్బ తిన్న వాహనాలకు,ఆటోలకు,రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు. కేంద్రం నుంచి ఎంత వస్తుందో తెలియదు.అప్పటివరకూ బాధితులకు సహాయం అందించకుండా ఆపే పరిస్థితి లేదు. అలా ఆపడం సమంజసం కూడా కాదు. వరద బాధితుల సహాయార్థం విరాళాలు వస్తున్నా.. నష్టం లక్షల కోట్లలో ఉండటంతో అది ఏమూలకూ సరిపోదు.  ఏ శాఖ అకౌంట్ లోనూ చిల్లిగవ్వ కూడా  లేని పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్దడం అంత తేలిక కాదు అనడంలో సందేహం లేదు. ఇదే విషయాన్ని చంద్రబాబు చెప్పారు. 

సామాజిక పింఛన్లు,ఉద్యోగులు జీతాలు చెల్లించడానికి ఇంకా 10రోజులు సమయం ఉండడంతో సీఎం ఏదోరకంగా వారికి కావాల్సిన నిధులు సమకుర్చే ఆలోచన చేస్తారు అందులో సందేహం లేదు. రిజర్వ్ బ్యాంక్ నుంచి అడ్వాన్స్ లేదా ఇతర మార్గాల ద్వారా  నిధులు సేకరించే అవకాశం ఉంది.  అయినా చంద్రబాబు జీతాలు ఇచ్చేందుకు కూడా వెతుక్కోవలసిన పరిస్థితి ఉందని చెప్పడం అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బ్లాక్ అండ్ వైట్ లో ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే అని భావించాల్సి ఉంటుంది. 

ఇదిలా ఉండగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బిగ్ టాస్క్ ఒకటి ప్రభుత్వం ముందు ఉంది.  సామాజికపింఛన్లు మినహా మరే హామీ పై చంద్రబాబు ఇప్పటి వరకూ నిర్ణయం తీసుకోలేదు. అందుకు కారణం రాష్ట్ర ఆర్థిక పరిస్థితే అనడంలో సందేహం లేదు.  వాస్తవానికి  రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం, అమరావతి, పోలవరం,వరద బాధితులకు సహాయ పునరావాస కార్యక్రమాలు వంటి వాటితో చంద్రబాబు బిజీగా ఉన్నారు. వీటన్నిటినీ సరిదిద్ది రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలిగే సామర్థ్యం అనుభవం చంద్రబాబుకు ఉన్నాయి. అయితే అందుకు కొంత సమయం అవసరం.

అలాగే కేంద్రం నుంచీ ఇతోథిక సహకారం అందాల్సి ఉంది. అయితే కేంద్రం రాష్ట్రానికి సహాయం అందించడం విషయాన్ని పక్కన పెడితే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంలో వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రభుత్వానికి చిక్కులు తెచ్చిపెట్టేదిగా ఉంటున్నది. కేంద్రంలో ప్రభుత్వం మనుగడ సాగించాలంటే భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం మద్దతు తప్పని సరి. అయినా కూడా కేంద్రం విశాఖ ఉక్కు విషయంలో అనుసరిస్తున్న తీరు ఆక్షేపణీయంగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం నుంచి ఒక స్పష్టమైన నిర్దుష్టమైన ప్రకటన వచ్చేలా చంద్రబాబు ప్రయత్నించాల్సి ఉంది.