వాగ్దానాల అమలులో లోకేష్ ప్రోగ్రస్!

లోకేష్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంత బాధ్యతగా పని చేశారో.. ఇప్పుడు అధికారం వచ్చిన తరువాత, మంత్రిగా అంతే బాధ్యతతో పని చేస్తున్నారు. ఇచ్చిన మాట నెరవేర్చడానికి ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నారు. హామీలను నెరవేర్చేదిశగా ఒక్కో అడుగూ వేస్తున్నారు. 

ప్రతిపక్షంలో ఉండగా నారా లోకేష్ సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను, ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసి, వారి నుంచి స్వయంగా విని తెలుసుకున్నారు. ఆ సందర్భంగా ఆయన పలు హామీలను ఇచ్చారు. వాటిని ఒక్కొక్కటిగా ఇప్పుడు అమలు చేస్తున్నారు.  తాను ఇచ్చిన మాటకు కట్టుబడతాననీ, చేసిన వాగ్దానాలను నెరవేరుస్తాననీ  నారా లోకేష్ పాదయాత్ర సమయంలోనే ప్రజలలో నమ్మకం కలిగించారు. తన పాదయాత్ర సందర్భంగా ప్రతి వంద కిలోమీటర్లకూ ఒక శిలాఫలకం వేసి, దానిపై అప్పటి వరకూ తాను ఇచ్చిన హామీలను వాటిపై పొందుపరిచారు.

అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని నెరవేరుస్తానని గట్టిగా చెప్పారు. అందులో భాగంగానే బంగారుపాల్యం లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి వంద రోజులు పూర్తి కాకుండానే డయాలసిస్ సెంటర్ హామీని నెరవేర్చిన నారా లోకేష్.. తాజాగా మాజీ సైనికులకు ఇఛ్చిన హామీని నెరవేర్చారు. మాజీ సైనికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పాదయాత్ర సందర్భంగా తాను శిలాఫలకం వేసి మరీ ఇచ్చిన ప్రతి హమీనీ ఏడాది కాలవ్యవధిలో నెరవేరుస్తానన్న మాటకు కట్టుబడి ఉన్నానని లోకేష్ చెబుతున్నారు.