పాఠశాల స్థలంలో వైసీపీ కార్యాలయం!

జగన్ ఐదేళ్ల పాలన నిబంధనల ఉల్లంఘనలో కొత్త పుంతలు తొక్కింది. జగన్ హయాంలో స్కూళ్లు, గుడులు అన్న విచక్షణ లేదు. ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ అక్రమ నిర్మాణాలు వెలిసిపోయాయి. కొండలు, పర్యావరణం అన్న స్ఫృహే లేదు. రుషికొండకు కొట్టిన గుండే అందుకు నిదర్శనం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీ అక్రమాలు, అక్రమ నిర్మాణాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి.

ఆయా నిర్మాణాలను అక్రమ కట్టడాలుగా ప్రకటింంచి అధికారులు నోటీసులు ఇస్తున్నారు. తాజాగా మచిలీపట్నంలో వైసీపీ కార్యాలయ నిర్మాణం చేపట్టిన స్థలం విషయంలో జగన్ గ్యాంగ్ ఏ స్థాయిలో అరాచకానికి పాల్పడిందో వెలుగులోకి వచ్చింది. 
ఔను వైసీపీ యుక్తాయుక్త విచక్షణ లేకుండా, మంచి, చెడు అన్న  దానితో సంబంధం లేకుండా పార్టీ కార్యాలయాన్ని ఏకంగా పాఠశాల స్థలంలో నిర్మించేసింది. దాదాపు వెయ్యి చదరపు గజాల స్థలాన్ని అక్రమంగా ఆక్రమించేసి పార్టీ కార్యాలయాన్ని నిర్మించేసింది. ఈ నిర్మాణం కోసం మచిలీపట్నం అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ నుంచి అనుమతి తీసుకోలేదు. మునిసిపాలిటీ అనుమతులు కూడా లేవని అధికారులు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు  ఈ నిర్మాణం అక్రమమని పేర్కొంటూ నోటీసులు జారీ చేశారు. ఎలాంటి అనుమతులూ లేకుండా, స్కూలు స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన ఈ కట్టడాన్ని ఎందుకు కూల్చివేయరాదో చెప్పాలంటూ నోటీసులు ఇచ్చారు. కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎవరన్నది తెలియకపోవడంతో మునిసిపాలిటీ అధికారులు పార్టీ కార్యాలయ సిబ్బందికి నోటీసులు ఇచ్చారు. వారి వివరణను బట్టి భవిష్యత్ కార్యాచరణ అంటుందని అధికారులు చెబుతున్నారు.