ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గానే తిరుమల దర్శనాల దందాకు తెరలేపిన రోజా!

రోజా అక్రమాలు, అవినీతి అంటూ వచ్చిన ఆరోపణలు, విమర్శలు అన్నీ కూడా ఆమె మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత నుంచే అని అంతా  భావిస్తున్నారు. ఔను ఆమె మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆమె తీరు పూర్తిగా మారిపోయింది. మంత్రి పదవి కోసం చకోరపక్షిలా వేచి చూసిన రోజాకు ఎట్టకేలకు వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తరువాత జగన్ తన కేబిన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా టూరిజం శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు అప్పగించారు. అంతకు ముందు కూడా ఆమెనేమీ తీసి పక్కన పెట్టలేదు. ఆమెకు  ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా కీలక బాధ్యతలు అప్పగించారు. 

అప్పుడు ఆమె ఏమీ సుద్దపూసలా వ్యవహరించలేదు. ఆ హోదాలో కూడా ఆమె  ముడుపుల మూటల వ్యవహరాంలో ఎలాంటి ముఖమాటాలకూ పోలేదు.   ఆ విషయానికి వచ్చే ముందు మంత్రిగా ఆమెకు ఆమె పార్టీ వారే ఇచ్చిన బిరుదు ఏమిటంటే కలెక్షన్ క్వీన్.  మంత్రి పదవి రాగానే, ముడుపులు ముట్ట రాదు, లంచాలు పుచ్చుకోరాదు అని రూలు ఏమైనా  ఉందా అన్నట్లుగా ఆమె మంత్రిపదవి చేపట్టిన వంద రోజులకే క్యాష్  కౌంటర్ ఓపెన్ చేసి ఓపెన్ గా ముడుపులు స్వీకరించడం మొదలు పెట్టేశారని వైసీపీ వర్గాల నుంచే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.   మినిస్టర్ రోజా.. అప్పాయింట్మెంట్ కే రూ. 50 వేలు తీసుకుంటారనీ, పోస్టింగులకు ఇంత అన్నట్లుగా ఆమె అందివచ్చిన ఏ అవకాశాన్నీ విడవకుండా రేట్ల కట్టి మరీ ముడుపులు తీసుకున్నారన్న విమర్శలూ ఉన్నాయి. 

సరే ఇప్పుడు విషయానికి వస్తే ఆమె మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడానికి చాలా ముందు నుంచే అంటే ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా ఉన్నప్పుడు కూడా అడ్డగోలు సంపాదన కోసం అర్రులు చాచారని ఇప్పడు వెలుగులోనికి వస్తుంది. మంత్రిగా ఆమె వారం వారం వందల మందితో చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలు పెద్ద కుంభకోణమని, తిరుమలేశుని దర్శనం పేరిట ఆమె కోట్లు దండుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఈ వీఐపీ బ్రేక్ దర్శనాల దందా ఆమె ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా ఉన్నప్పుడే మొదలు పెట్టారని ఇప్పుడు వెల్లడైంది. ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా ఉన్న సమయంలోనే ఆమె ఒకే  సిఫారసు లేఖ మీద 20 మందికి వీఐపీ బ్రేక్ దర్శనం చేయించినట్లు ఆధారాలతో సహా తేలింది. ఒక లేఖపై ఆరు లేదా ఏడుగురికి మించి బ్రేక్ దర్శనానికి అనుమతిలేదని టీటీడీ నిబంధనలు పేర్కొంటాయి. అయితే రోజా సిఫారసు లేఖ ఉంటే నిబంధనలు బేఖాతరే అని టీటీడీ ఆచరణలో చూపింది. ఆనం వెంకట్రామరెడ్డి వీఐపీ బ్రేక్ దర్శనాల పేర రోజా కోట్లలో దండుకున్నారని చేసిన ఆరోపణలకు బలం చేకూర్చేదిగా ఆమె ఒకే లేఖలో పదుల సంఖ్యలో బ్రేక్ దర్శనాలకు సిఫారసు చేయడం నిలుస్తోంది.