జగన్ విషాద యోగం.. వైసీపీ ఎమ్మెల్సీలు జంప్?

జగన్ తన పార్టీ పరాజయం తరువాత అసెంబ్లీలో బలం లేకపోయినా తమకు శాసనమండలిలో బలం ఉందనీ, ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామనీ ధీమాగా మాట్లాడారు. అయితే రోజుల వ్యవధిలోనే జగన్ లో ఆ ధీమా మాయమైపోయింది. పరాజయం తరువాత పులివెందుల, అక్కడ నుంచి బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లి విశ్రాంతి తీసుకుని ఏపీకి తిరిగి వచ్చిన తరువాత ఆయన తాడేపల్లి ప్యాలెస్ లోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో భేటీ అయ్యారు.

ఆ సందర్భంగా ఆయనే స్వయంగా రాజ్యసభలో మనకు ఇప్పుడు బలం ఉన్నా ముందు ముందు వారిలో ఎందరు తమ పార్టీలో ఉంటారో? ఎందరు పార్టీని వీడతారో క్లారిటీ లేదని చెప్పారు. ఎమ్మెల్సీలు మాత్రమే కాదు.. అసలు పార్టీలో ఎందరు ఉంటారు? ఎందరు గోడ దూకేస్తారు? అన్నది తనకు అర్ధం కావడం లేదంటూ జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మండలిలో ఉన్నబలంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఇరుకునపెడదామన్న జగన్ ఆశలు ఆవిరి అయిపోయినట్లు ఆయన మాటలే తేటతెల్లం చేస్తున్నాయి. 

జగన్ ఆవేదన ఇక్కడితో ఆగలేదు.. పార్టీ నుంచి వెళ్లేవాళ్లు వెడతారు. అటువంటి వారిని నిలువరించడం సాధ్యం కాదని, వారెవరూ చెప్పినా వినే పరిస్థితి లేదు. మనమేం చేయలేం.. వెళ్ళేవారు వెళ్ళనివ్వండి.. నిలబడాలనుకునే వారు నాతో ఉంటారంటూ జగన్ పార్టీ నుంచి వలసలను నిలువరించడం తన వల్ల కాదు..  తన మాట వినేవారెవరూ లేరని చెబుతూ చేతులెత్తేశారు. జగన్ ప్రసంగం విన్న పార్టీ నేతలు విస్తుపోయారు. సమావేశం తరువాత అంతర్గత సంభాషణల్లో తమ దారి తాము చూసుకోవడమే మేలు, జగన్ రెడ్డి కూడా అదే చెబుతున్నారని చర్చించుకున్నారు. జగన్ అక్కడితో ఆగలేదు. పార్టీ పెట్టినప్పుడు అమ్మా, తానూ మాత్రమే ఉన్నామని, అయినా ఇంత దూరం వచ్చాం. మళ్లీ మొదటి నుంచీ ప్రారంభిద్దాం అని కూడా అన్నారు.

అయితే ఇప్పుడు అమ్మ కూడా నీతో లేదుగా జగన్ అని పార్టీ వర్గాల నుంచే సెటైర్లు పేలుతున్నాయి.   జగన్ పార్టీలోనే కొనసాగుదామనుకునే ఎమ్మెల్సీలు సైతం మండలిలో  అమరావతి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటి కీలక బిల్లులను వ్యతిరేకించి తమ రాజకీయ భవిష్యత్ ను మరింత అంధకారబంధురమౌతుందని భయపడుతున్నారు.  సరే మొత్తం మీద జగన్ ప్రసంగం మండలిలో కూడా బలం ఉండే అవకాశం లేదని తేటతెల్లం చేసేసింది.  అయితే  ఎంతమంది వైసీపీ ఎమ్మెల్సీలు గోడదూకేస్తారు, వారిలో ఎంత మంది తెలుగుదేశం గూటికి చేరతారు అన్న స్పష్టత లేదు. కానీ వైసీపీ వర్గాలు మాత్రం మండలిలో వైసీపీ పక్షాన్ని టీడీపీలో విలీనం విలీనం అయ్యే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయంటున్నారు.