చిరు పరపతీ మసకబారిందా?

పుష్ప2 సినిమా ప్రదర్శన సందర్భంగా సంధ్యా థియోటర్ వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటన నిస్సందేహంలో అల్లు అర్జున్ ను చిక్కుల్లో పడేసింది. సంఘటన జరిగిన తీరు, దానిపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందన అతని హీరో ఇమేజ్ ను మసకబార్చాయి. ఆటిట్యూడ్ కారణంగా ఆయన పట్ల సామాన్య ప్రేక్షకులలో సైతం వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.  సంధ్యా ధియోటర్ తొక్కిసలాట సంఘటన తరువాత అల్లు అర్జున్ వ్యవహార శైలి ఆయనకు ప్రేక్షకుల ప్రాణాల కంటే.. తన సినిమా ప్రమోషనే ముఖ్యం అన్నట్లుగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. తొక్కిసలాటలో ఒక మహిళ దుర్మరణం పాలైందని తెలిసిన తరువాత అయితే పుష్ప2 హిట్ అంటూ అల్లు అర్జున్ వ్యాఖ్యానించినట్లుగా తనకు తెలిసిందంటూ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్య, అలాగే అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి సంధ్యా ధియోటర్ తొక్కిసలాట వివరాలను వెల్లడిస్తూ అల్లు అర్జున్ పై విమర్శలు గుప్పించిన తీరు నిస్సందేహంగా అల్లు అర్జున్ ప్రతిష్ఠను మసకబరిచాయి. 

సంధ్య థియేటర్ తొక్కిసలాట సమస్య తర్వాత అల్లు అర్జున్ ఊహించని విధంగా ఇబ్బందుల్లో పడ్డాడు. ప్రభుత్వ యంత్రాంగం అంతా ఆ నటుడికి వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపిస్తోంది.  నటుడితో పాటు, అతనికి మద్దతు ఇచ్చిన ఇండస్ట్రీ పెద్దలందరూ ఇప్పుడు నష్ట నివారణకు తీసుకోవలసి చర్యలేమిటని మల్లగుల్లాలు పడుతున్నారు. త్వరలో సీఎంను కలస వివరణ ఇచ్చుకోవాలన్న ఉద్దేశంలో ఉన్నారు. అన్నిటికీ మించి అల్లు అర్జున్ యాటిట్యూడ్ కారణంగా మొత్తం చిత్ర పరిశ్రమ ఇబ్బందుల్లో పడింది. అల్లు అర్జున్ రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన గంటల వ్యవధిలోనే  ఇకపై తెలంగాణలో సినిమాల రిలీజ్ సందర్భంగా స్పెషల్ షోలు, టికెట్ల పెంపునకు అనుమతించేదే లేదని ప్రభుత్వం ప్రకటించింది.  అలాగే అల్లు అర్జున్ తొక్కిసలాట సమాచారం తనకు పోలీసులు ఇవ్వలేదనడం, పోలీసులే తాను సంధ్యా ధియోటర్ కు వచ్చిన సందర్భంగా ట్రాఫిక్ కంట్రోల్ చేశారని చెప్పడంతో  పోలీసు వ్యవస్థ సైతం అల్లు అర్జున్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంధ్యా ధియోటర్ వద్ద అల్లు అర్జున్ ర్యాలీ, ధియోటర్ నుంచి పోలీసు ఉన్నతాధికారులే అల్లు అర్జున్ ను బయటకు తీసుకువస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలను విడుదల చేసి పుష్ఫ హీరో గాలి తీసేశారు. 

ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ వద్ద మెగాస్టార్ చిరంజీవి పరపతి కూడా మసకబారిందా అన్న అనచ్చ మొదలైంది.  చిరంజీవికి ఇటు పరిశ్రమ, అటు రాజకీయవర్గాలతో సత్సంబంధాలు ఉన్నాయి. అందరూ ఆయనను గౌరవిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం పలు సందర్భాలలో చిరంజీవి పట్ల తనకు గౌరవం ఉందన్న విషయాన్ని చాటారు. అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాట విషయంలో అల్లు అర్జున్ కు మద్దతుగా చిరంజీవి ముందుకు రాలేదా? వచ్చినా ఆయన మాటకు రేవంత్ సర్కార్ విలువ ఇవ్వలేదా అన్న చర్చ జోరుగా సాగుతోంది. అల్లు అర్జున్ అరెస్టు వరకూ వెళ్లకుండా చిరు మాటసాయం పని చేయలేదా అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా చిరంజీవి మౌనం వహించారన్న వాదనా తెరపైకి వచ్చింది.  

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. దాంతో అప్పటి నుంచి అల్లు, మెగా కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే.  అయితే ఆ ప్రచారాన్ని పూర్వపక్షం చేస్తూ చిరంజీవి అల్లు అర్జున్ అరెస్టైన సమయంలో స్వయంగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. అలాగే జైలు నుంచి విడుదలై వచ్చిన తరువాత  అల్లు అర్జున్ కూడా చిరంజీవి నివాసానికి వెళ్లి తనకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ణతలు తెలిపారు. అయితే ఆ తరువాత వరుసగా జరిగిన పరిణామాల నేపథ్యంలో చిరు మాట, పలుకుబడి రేవంత్ సర్కార్ వద్ద పని చేయలేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

తెలంగాణ ప్రభుత్వం కొత్త సినిమాల రిలీజ్ సందర్భంగా టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి లేదని ప్రకటించడం వల్ల వెంటనే ఎఫెక్ట్ పడేది చిరంజీవి కుమారుడు, హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ పైనే అనడంలో సందేహం లేదు.  ఎందుకంటే త్వరలో గేమ్ ఛేంజర్ సినిమా విడుదల కానుంది. ఇక మరీ ముఖ్యంగా చెప్పుకోవలసిన సంగతేంటంటే.. అల్లు అర్జున్ పుష్ప2 వివాదం విషయంలో ఇప్పటి వరకూ  రామ్ చరణ్ స్పందించకపోవడం కూడా చిరు అల్లు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారానికి బలం చేకూరుస్తోందని పరిశీలకులు అంటున్నారు.