మంత్రులకు వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్.. జగన్‌పై వైసీపీ ఎంపీ విమర్శలు..
posted on Jul 2, 2021 12:35PM
జల జగడం మిత్రులను శత్రువులుగా చేస్తోంది. ఇన్నాళ్లూ కలిసున్న నేతలను.. ఇప్పుడు కత్తులు దూసేలా ప్రేరేపిస్తోంది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. మంత్రులు పరస్పరం తిట్ల దండకం అందుకుంటున్నారు. తాజాగా, ఆ కేటగిరిలో రోజా కూడా చేరారు.
ఎమ్మెల్యే రోజా. ఏపీ పాలిటిక్స్‌లో ఫైర్‌బ్రాండ్ లీడర్. ప్రత్యర్థులపై విమర్శలు చేయడంలో ఎక్స్‌పర్ట్. ఆకట్టుకునేలా మాట్లాడటం.. సూటిగా, వాడి, వేడిగా విమర్శించడంలో ఆమెకు ఆమే సాటి. వైసీపీలో యాక్టివ్‌గా ఉండే రోజా.. తెలంగాణ నేతలతోనూ సామరస్యంగా ఉంటారు. కేసీఆర్-రోజాల మధ్య మంచి స్నేహపూరిత బంధం ఉంది. గతంలో తిరుపతి వెళ్లినప్పుడు సీఎం కేసీఆర్, వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లారు. ఇటీవల రోజాకు రెండు మేజర్ సర్జరీలు జరిగితే కూడా కేసీఆర్ ఫోన్ చేసి ఆమెను పరామర్శించారు. వారిద్దరి మధ్య అంత స్నేహం ఉన్నా.. ఫ్రెండ్‌షిప్ ఫ్రెండ్‌షిప్పే.. పాలిటిక్స్ పాలిటిక్సే అన్నట్టుగా మారింది పరిస్థితి. తాను ఎంతో అభిమానించే జగనన్నతో పాటు వైఎస్సార్‌ను తెలంగాణ మంత్రులు అంతగా తిడుతుంటే.. వింటూ ఊరుకోలేకపోయారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే మర్యాదగా ఉండదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని విమర్శిస్తే తెలంగాణ నాయకులకు మర్యాద ఉండదని వైసీపీ ఎమ్మెల్యే రోజా హెచ్చరించారు. తెలంగాణ అక్రమంగా నీటి జలాలను వాడుకోవడం ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చెయ్యడమే అన్నారు. ఏపీకీ అన్యాయం చేస్తే సీఎం జగన్‌తో పాటు తాము కూడా సహించమని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన నీటి వివాదాన్ని పరిష్కరించి...తమ వాటాను తమకు కేటాయించాలని మోదీ, షేకావత్‌కు సీఎం జగన్ లేఖ రాశారని చెప్పారు. ఏపీ నీటిని వినియోగిస్తూ చేస్తున్న విద్యుత్ ఉత్పాదన కృష్ణా నీటి బోర్డు నిర్ణయానికి వ్యతిరేకమని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వంతో ఫ్రెండ్లీగా ఉండే ఎమ్మెల్యే రోజా.. ఇలా ఫైర్ అవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
ఇటు వైసీపీ ఎమ్మెల్యే రోజా తెలంగాణ మంత్రులకు వార్నింగ్ ఇస్తే.. అటు వైసీపీ ఎంపీ మాత్రం జగన్‌పైనే విమర్శలు సంధించారు. జగన్, కేసీఆర్‌లు రాజకీయ అవసరాల కోసం రెండు రాష్ట్రాల మధ్య నీటి గొడవలు పెంచి పెద్దవి చేయొద్దని వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. నవసూచనల పేరిట ఏపీ సీఎం జగన్‌కు మరో లేఖ రాశారు. నదీ జలాల అంశంలో సీఎం చేసిన వ్యాఖ్యలపై ఇరు రాష్ట్రాల ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయన్నారు. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు నెరపడం వల్ల ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవచ్చని తెలిపిన జగన్.. జల వివాదాలను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని రఘురామ ప్రశ్నించారు. తెలంగాణలోని ఆంధ్రా వారి గురించి సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రధానికి లేఖలు రాయడం వల్ల సత్వర పరిష్కారం ఉండదన్న సంగతి జగన్‌కు తెలియంది కాదని.. తక్షణం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై వీలైనంత త్వరగా జలవివాదాలను పరిష్కరించాలని రఘురామకృష్ణరాజు సూచించారు.
వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీల విమర్శలు ఇలా ఉంటే.. జల వివాదంపై ఏపీ సైతం దూకుడు పెంచింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జల వివాదాల నేపథ్యంలో శ్రీశైలం జలాశయం దగ్గర ఏపీ పోలీసులు సైతం బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి కొనసాగిస్తోంది. దీంతో ఎడమగట్టు విద్యుత్ కేంద్రం దగ్గర తెలంగాణ పోలీసులు.. శ్రీశైలం డ్యాం దగ్గర ఏపీ పోలీసులు మోహరించడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.
తెలంగాణ ప్రభుత్వం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తిని కొనసాగించడంతో రోజూ 4 టీఎంసీల నీరు దిగువకు వెళుతోంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. శ్రీశైలంలో 854 అడుగుల కంటే ఎక్కువ నీరు ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ జిల్లాలకు నీటిని తరలించే అవకాశం ఉంటుందని.. లేదంటే సీమ ప్రాంతం ఎడారి అవుతుందనేది ఏపీ ప్రభుత్వ అభ్యంతరం. ఇరు రాష్ట్రాల జల వివాదాల నేపథ్యంలో జూరాల, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల దగ్గర పోలీసు బందోబస్తు కొనసాగుతుండటంతో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. నీళ్లలో మంట రాజుకుంటోంది.