పార్లమెంట్ శాతాకాల సమావేశాల్లో ఐదు కొత్త బిల్లులు!
posted on Nov 23, 2024 2:51PM
పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం (నవంబర్ 25) నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకూ జరిగే ఈ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు సహా మొత్తం 16 బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వీటిలో ఐదు కొత్త బిల్లులు ఉన్నాయి. అయితే అందరి దృష్టీ వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుపైనే ఉంది.
ఈ బిల్లును గతంలోనే అంటే వర్షా కాల సమావేశాలలోనే కేంద్రం సభలో ప్రవేశ పెట్టింది. అయితే విపక్ష సభ్యుల అభ్యంతరాల నేపథ్యంలో దీనిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపింది. జేపీసీ నివేదిక తరువాత ఈ బిల్లును మరోసారి పార్లమెంటులో ప్రవేశ పెట్టడానికి కేంద్రం నిర్ణయించింది. వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీసీ శీతాకాల సమావేశాల మొదటి వారంలో పార్లమెంటుకు సమర్పించే అవకాశం ఉంది. అయితే ఈ జేపీసీ గడువు పొడిగించాలని విపక్ష సభ్యులు పట్టుపడుతున్నారు. ఈ విషయంలో సభలో ప్రతిష్ఠంభన నెలకొనేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
అలాగే మరో కీలక బిల్లు ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లును ను కూడా ఈ సమావేశాలలోనే ప్రవేశపెట్టాలని కేంద్రం భావించింది. అయితే కారణాలేమైనా ఈ సమావేశాలలో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాలో అది లేదు. ఈ శీతాకాల సమావేశాలలో పెండింగులో ఉన్న పాత బిల్లులు 11 సహా ఐదు కొత్త బిల్లులను ప్రవేశ పెట్టేందుకు కేంద్రం నిర్ణయించింది. కొత్త బిల్లులలో సహకార యూనివర్సిటీల ఏర్పాటు, పంజాబ్ కోర్టుల సవరణ బిల్లు, మర్చంట్ షిప్పింగ్ బిల్లు, కోస్టల్ షిప్పింగ్ బిల్లు, ఇండియన్ పోర్టుల బిల్లు ఉన్నాయి.