లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం తిరుపతి చేరుకున్న స్వతంత్ర సిట్ బృందం

జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు ఎంత భంగం కలిగించాలో అంతా కలిగించారు. తిరుమల కొండపై పారిశుద్ధ్యం అధ్వానంగా మార్చేశారు, ఆధ్యాత్మిక వాతావరణాన్ని నాశనం చేశారు. కలియుగ వైకుంఠంగా భక్తులు భావించే తిరుమలలో జగన్ హయాంలో ఎన్ని అరాచకాలు జరగాలో అన్ని అరాచకాలూ జరిగాయి.  అన్యమత ప్రచారం నుంచి మాంసం, మద్యం వినియోగం వరకూ అన్నీ జరిగాయి. 
ప్రసాదం ధర మొదలు వసతి గదుల అద్దెల వరకూ దొరికినంత దోచుకో  పద్దతిలో అప్పట్లో టీటీడీ దోపిడీకి పాల్పడిందన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు విచారణలో ఆ విమర్శలన్నీ వాస్తవాలే అన్న విషయం వెలుగులోకి వస్తోంది.  చివరాఖరికి లడ్డూ ప్రసాదం కూడా జగన్ హయాంలో అపవిత్రమైపోయింది.  వైసీపీ అధికారంలో ఉండగా తిరుపతి లడ్డూ ప్రసాదం నాణ్యత నాసిరకంగా తరాయైందని  భక్తులు అప్పట్లోనే పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అయితే లడ్డూ ప్రసాదం నాణ్యత ఎందుకు నాసిరకంగా మారిపోయిందో.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. జగన్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో టీటీడీ అధికారులు నాసిరకం, జంతు కొవ్వుతో కల్తీయిన నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించారనీ, అందుకే ప్రసాదం నాణ్యత లేకుండా పోయిందనీ చంద్రబాబు కొద్ది కాలం కిందట ఒక సమావేశంలో వెల్లడించారు.  

దీంతో దేశ వ్యాప్తంగా గత జగన్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. లడ్డూ ప్రసాదం నాణ్యత నాసిరకంగా ఉండటానికి కారణమైన వారినీ, ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వాడకానికి కారణమైన వారినీ, ఆ నెయ్యి సరఫరాదారులను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. అయితే ఈ విషయంపై సుప్రీం కోర్టు సీబీఐ పర్యవేక్షణలతో స్వతంత్ర సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. ఇప్పుడా స్వతంత్ర సిట్ దర్యాప్తు ప్రారంభించింది. 

శుక్రవారం (నవంబర్ 22) స్వతంత్ర సిట్ దర్యాప్తు బృందం తిరుపతి చేరుకుంది. తిరుపతిలోని భూదేవీ కాంప్లెక్స్ లో సిట్ కోసం తత్కాలిక కార్యాలయం కూడా ఏర్పాటైంది. ఈ సిట్ బృందంలో నలుగురు డీఎస్పీలు నాలుగు బృందాలుగా ఏర్పడి తిరుపతి, తిరుమలలో దర్యాప్తు చేయనున్నారు. తమ దర్యాప్తు నివేదికను సీబీఐకు సమర్పిస్తారు.  నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్‌తో పాటు తిరుమలలో లడ్డూ పోటు, విక్రయ కేంద్రాలు, ముడిసరుకు పరిశీలించనున్నారు. అలాగే లడ్డూ తయారీలో పాల్గొనే శ్రీవైష్ణవులను కూడా సిట్ బృందం ప్రశ్నించ నుంది.