వ్యాక్సిన్ వేసుకున్నా వైరల్ లోడ్.. డబుల్ డోస్..ఎంత సేఫ్?
posted on Jul 2, 2021 11:51AM
కొవిడ్ నుంచి కాపాడే ఏకైక మార్గం వ్యాక్సిన్. సబ్బు నీళ్లకే చచ్చిపోయే వైరస్ నుంచి వ్యాక్సిన్ మినహా మరేదీ కాపాడలేదు. ఎంత సురక్షితంగా ఉన్నా.. కరోనా ప్రమాదం పొంచే ఉంటుంది. అందుకే, ప్రస్తుత పరిస్థితుల్లో టీకాయే శ్రీరామ రక్ష. అందుకే, భారత్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. జనాల్లో కొన్ని అపోహలు ఉన్నా.. వ్యాక్సిన్ పనితీరు బ్రహ్మాండంగా ఉంది. అయితే, వ్యాక్సిన్ విషయంలో మరింత క్లారిటీ ఇస్తున్నారు అంతర్జాతీయ సైంటిస్టులు.
వ్యాక్సిన్ వేసుకుంటే వైరస్ సోకకపోవడం అంటూ ఏమీ ఉండదు. కాకపోతే.. మన శరీరంలో వైరల్ లోడు చాలా తక్కువగా ఉంటుంది. ప్రాణానికి ప్రమాదం లేకుండా చేస్తుంది. ఎందుకంటే, ఏ వ్యాక్సిన్ కూడా 100శాతం సురక్షితం కాదు. కాబట్టి, టీకా తీసుకున్నా.. వైరస్ సోకితే భయపడాల్సిన పనిలేదు. వ్యాక్సిన్ వేసుకున్న వారిలో వైరల్ లోడ్ విస్తరించకుండా.. చాలా తక్కువ స్థాయికే కట్డడి చేస్తుంది.
టీకా పొందాక కూడా కొవిడ్-19 బారిన పడిన వారిలో.. వైరల్ లోడు చాలా తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. అమెరికాలో ఇస్తున్న రెండు ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లపై నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ఈ అంశాన్ని నిర్ధారించారు. అన్నిరకాల కరోనా టీకాలు ఇన్‌ఫెక్షన్‌ను అడ్డుకోవడంలో సమర్థంగానే పనిచేస్తున్నాయి. అయితే, ఏ టీకాకూ వంద శాతం సమర్థత ఉండదు. వ్యాక్సిన్ పొందాక కూడా ఇన్‌ఫెక్షన్లు రావొచ్చు.
‘‘టీకా వల్ల దాదాపు 90 శాతం మేర కొవిడ్‌కు అడ్డుకట్ట పడుతుంది. ఒకవేళ ఆ వ్యక్తి ఇన్‌ఫెక్షన్ బారినపడినా.. అతడిలో వైరస్ తక్కువగానే ఉంటుంది. వ్యాధి తీవ్రత కూడా ఒక మోస్తరుగానే ఉంటుంది’’ అని ఆరిజోనా విశ్వవిద్యాలయ పరిశోధకుడు జెఫ్ బర్జెస్ తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 14 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 10 వరకూ అమెరికాలో 3,975 మందిపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. వీరిలో పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ పొందిన ఐదుగురికి.. పాక్షికంగా టీకా పొందిన 11 మందికి.., వ్యాక్సిన్ అసలే తీసుకోని 156 మందికి కొవిడ్ సోకింది.
టీకా పొందని వారితో పోలిస్తే.. పాక్షికంగా లేదా పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ పొందిన వారిలో వైరల్ లోడు 40శాతం తక్కువగా ఉంటున్నట్లు తేల్చారు. వ్యాక్సిన్ వేసుకున్నవారిలో కొవిడ్‌తో పాటు జ్వరం వచ్చే అవకాశం 58శాతం తక్కువని తేలింది. రెండు డోసులు పొందిన వారికి కరోనా నుంచి 91 శాతం, ఒకే డోసుతో 81శాతం మేర రక్షణ లభిస్తున్నట్లు అమెరికన్ సైంటిస్టులు తేల్చారు. అయితే, ఇండియా విషయానికి వచ్చే సరికి ఈ లెక్కలు కాస్త మారే అవకాశం ఉంది. మన దగ్గర అందుబాటులో ఉన్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాల సామర్థ్యం సుమారు 75శాతమే. సో, వ్యాక్సిన్ వేసుకున్నా వైరస్ బారిన పడే ప్రమాదం అమెరికాతో పోలిస్తే మన దగ్గర కాస్త ఎక్కువేనని చెప్పాలి. అందుకే, రెండు డోసులు తీసుకున్న వారు మరింత సురక్షితంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి, వ్యాక్సిన్‌ను అందరూ తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఒక్క డోసు మాత్రమే వేసుకుంటే.. వైరస్ ప్రమాదం పొంచే ఉంటుంది. టీకా అస్సలు తీసుకోకపోవడం మరింత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు సైంటిస్టులు.