శ‌భాష్ శిరీష‌.. అంతరిక్షంలోకి తెలుగుతేజం..

క‌ల్ప‌నా చావ్లా.. సునీతా విలియ‌మ్స్.. అంత‌రిక్షయానం చేసిన ఎన్నారైలు. భార‌తీయ కీర్తిప‌తాకాన్ని స్పేస్‌లో ఎగ‌రేసిన ధీర‌వ‌నిత‌లు. తాజాగా, ఓ తెలుగమ్మాయి తొలిసారి అంత‌రిక్షంలో అడుగుపెట్ట‌బోతున్నారు. స్పేస్‌లో తెలుగు సంత‌కం చేయ‌బోతున్నారు. ఆమె పేరు శిరీషా బండ్ల‌. మ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ అమ్మాయే. ఏపీలోనే పుట్టిన శిరీష‌.. ఆ తర్వాత కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లి వాషింగ్ట‌న్‌లో స్థిరపడ్డారు. తెలుగు నేల‌పై జ‌న్మించినా.. అమెరికా గ‌డ్డ‌పై చ‌దువుల్లో రాణించారు. ఉన్న‌త శిఖ‌రాల‌కు ఎదిగారు. తాజాగా, ఏకంగా అంత‌రిక్షంలోకి ఎగిరిపోతున్నారు. తెలుగు మూలాలున్న మ‌హిళ అంత‌రిక్ష‌యానం చేయ‌బోతుండ‌టం.. తెలుగు వారిగా మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం.

జులై 11న అమెరికాకు చెందిన వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ అంతరిక్ష వాహక నౌకను ప్రయోగించనుంది. తొలిసారిగా నలుగురు ప్రయాణికులతో వెళ్లనున్న వాహకనౌకలో భారత సంతతికి చెందిన శిరీష బండ్ల ఒక‌రు. వర్జిన్‌ గెలాక్టిక్‌ ప్రభుత్వ వ్యవహారాల ఉపాధ్యక్షురాలి హోదాలో ఆమె అంతరిక్ష యానం చేయనున్నారు.  అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు వర్జిన్‌ గెలాక్టిక్ ఈ ప్రయోగం చేపట్టింది.

జులై 11న న్యూ మెక్సికో నుంచి స్పేస్‌ఫ్లైట్‌ బయల్దేరనుంది. వర్జిన్‌ గెలాక్టిక్‌ చేపడుతున్న నాలుగో అంతరిక్షయానం ఇది. ప్రయాణికులను తీసుకెళ్లడం మాత్రం ఇదే తొలిసారి. వాహక నౌకలో ఇద్దరు పైలట్లతో పాటు వర్జిన్‌ గెలాక్టిక్‌ అధిపతి రిచర్డ్‌ బ్రాన్సస్‌, మరో ముగ్గురు కంపెనీ ప్రతినిధులు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. శిరీష బండ్లతో పాటు.. చీఫ్‌ ఆస్ట్రోనాట్‌ ఇన్‌స్ట్రక్టర్‌ బెత్‌ మోసెస్‌, లీడ్‌ ఆపరేషన్స్‌ ఇంజినీర్‌ కాలిన్‌ బెన్నెట్‌ అంతరిక్ష యానం చేయబోతున్నారు.  

అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్ త్వ‌ర‌లో చేయ‌నున్న‌ అంతరిక్ష యాత్ర‌కు పోటీగా వర్జిన్‌ గెలాక్టిక్ ఈ స్పేస్ టూర్‌కు ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. జులై 20న జెఫ్ బెజోస్‌.. తన సంస్థ బ్లూ ఆరిజిన్‌ ప్రయోగించే వాహక నౌకతో స్పేస్ జ‌ర్నీ చేసేందుకు రెడీ అవుతున్నారు. బెజోస్‌కు పోటీగా.. ఆయ‌న‌కంటే 9 రోజులు ముందుగానే వర్జిన్‌ గెలాక్టిక్ స్పేస్ ఫ్లైట్ అంత‌రిక్షంలోని ఎగిరిపోనుంది. అందులో, మ‌న తెలుగుతేజం శిరీష బండ్ల కూడా ఉండ‌టం విశేషం. తెలుగుజాతికే గ‌ర్వ‌కార‌ణం.