వస్తున్నాయ్.. వస్తున్నాయ్.. చంద్రబాబు శ్వేతపత్రాలు!

ఏపీలో గ‌డిచిన ఐదేళ్ల కాలంలో వైసీపీ  ప్ర‌భుత్వం కీల‌క రంగాల్ని నిర్లక్ష్యం చేసి వాటి పరిస్థితిని అధ్వానంగా మార్చేసింది. ల్యాండ్‌, ఇసుక‌, మైనింగ్ మాఫియాలు రెచ్చిపోయాయి. కొంద‌రు మాజీ మంత్రులు, వైసీపీ నేత‌లే మాఫియాల‌ను వెన‌కుండి న‌డిపించారు. దీంతో ప‌లు రంగాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేత‌ల దోపిడీ ఐదేళ్లలో తారస్థాయిలో కొన‌సాగింది. ప్ర‌శ్నించిన వారిపై దాడులు చేయ‌డంతోపాటు, ప‌లు ప్రాంతాల్లో హ‌త్య‌ల‌కు సైతం తెగ‌బ‌డ్డారు. దీంతో వైసీపీ ప్ర‌భుత్వంలో అవినీతిపై  ప్ర‌శ్నించేందుకు ప్ర‌జ‌లు వెన‌క‌డుగు వేశారు. ప్ర‌స్తుతం తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో.. వైసీపీ బాధితులు బ‌య‌ట‌కొచ్చి గ‌త ఐదేళ్లలో  త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని తెలియ‌జేస్తున్నారు. దీనికితోడు అనేక కీల‌క రంగాల్లో మాజీ మంత్రులు, వైసీపీ నేత‌ల దోపిడీ ప‌ర్వం విచ్చ‌ల‌విడిగా కొన‌సాగింది. కీల‌క రంగాల్లో ప్ర‌స్తుత ప‌రిస్థితిపై శ్వేత‌ప‌త్రాలు విడుద‌ల చేసేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వ్వ‌డంతో మాజీ మంత్రులు, వైసీపీ నేత‌ల్లో కేసుల భ‌యం మొద‌లైంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే కొంద‌రు మంత్రులు, వైసీపీ నేత‌లు తప్పించుకునే మార్గాలను వెతుక్కునే పనిలో పడినట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.

ఏపీ కేబినెట్ తొలి స‌మావేశం ఇటీవ‌ల జ‌రిగింది. సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క అంశాల‌పై మంత్రి వ‌ర్గం చ‌ర్చించింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు ఇచ్చిన ఐదు హామీల అమ‌లుకు మంత్రివ‌ర్గం ఆమోదం వేసిన విష‌యం తెలిసిందే. ఇదే స‌మ‌యంలో వైసీపీ ప్ర‌భుత్వం కీల‌క రంగాల్ని ఎంత‌టి దారుణ ప‌రిస్థితుల్లోకి నెట్టేసిందో ప్ర‌జ‌ల‌కు తెలిపేందుకు వీలుగా మొత్తం ఏడు శ్వేత‌ప‌త్రాలు విడుద‌ల చేయాల‌ని మంత్రివ‌ర్గం నిర్ణ‌యించింది.  పోల‌వ‌రం, అమ‌రావ‌తి, విద్యుత్‌, ప‌ర్యావ‌ర‌ణం (ల్యాండ్‌, ఇసుక‌, మైనింగ్‌, త‌దిత‌ర రంగాల్లో దోపిడీ), ఎక్సైజ్ (మ‌ద్యం), శాంతిభ‌ద్ర‌త‌లు, ఆర్థిక శాఖ‌ల‌పై శ్వేత‌ప‌త్రాలు విడుద‌ల చేయాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింది. ఈనెల 28 నుంచి జూలై 18వ‌ర‌కు రెండు, మూడు రోజుల‌కొక‌టి చొప్పున ఈ శ్వేత‌ప‌త్రాల‌ను సీఎం చంద్ర‌బాబు నాయుడు విడుద‌ల చేయ‌నున్నారు. దీంతో శ్వేతపత్రాలు విడుదల తర్వాత ఎవరెవరికి ముప్పు ఉంటుందనే అంశంపై రాష్ట్ర రాజ‌కీయాల్లో విస్తృత చర్చ జ‌రుగుతుంది.

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను తవ్వితీసే పనిని కూట‌మి ప్ర‌భుత్వం మొదలుపెట్టింది. ముఖ్యంగా ఎక్సైజ్‌, ప‌ర్యావ‌ర‌ణం, విద్యుత్‌, ఆర్థిక శాఖ‌ల్లో గ‌త ఐదేళ్ల‌లో జ‌రిగిన అక్ర‌మాల‌పై ప్ర‌ధానంగా దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. కూటమిలోని మూడు పార్టీలు ఒకే లక్ష్యంతో పనిచేస్తుండ‌టంతో.. శ్వేత‌ప‌త్రాల విడుద‌ల త‌రువాత‌ ఎప్పుడు ఏం జరుగుతుందనే టెన్ష‌న్ వైసీపీ నేత‌ల్లో నెల‌కొంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయక ముందే గనులు, భూగర్భశాఖ కార్యాలయంతోపాటు ఎక్సైజ్‌శాఖ కార్యాలయాన్ని  సీఐడీ అధికారులు సీజ్‌ చేసి త‌మ‌ అధీనంలోకి తీసుకున్నారు. గత ఐదేళ్లలో అడ్డగోలు ఇసుక తవ్వకాలతోపాటు మైనింగ్‌ లీజుల్లో అక్రమాలు జరిగాయని అనుమానిస్తున్న కూటమి ప్రభుత్వం..  ఆ డిపార్ట్‌మ్మెంట్‌లో ఏం జరిగిందో వివరించేందుకు శ్వేతప‌త్రం సిద్ధం చేస్తోంది. వైసీపీ హయాంలో గనులశాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహరించారు. దీంతో ఆయన చుట్టూ ఉచ్చుబిగిస్తున్నట్లు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. 

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన మద్యం పాలసీలో బ్రాండెడ్‌ మద్యం అందుబాటులో లేకుండా పోయింది. నాసిరకం మద్యమే ప్రజలు తాగాల్సి వచ్చింది. ఈ వ్యవహారంలో పెద్ద స్కాం ఉందని అనుమానిస్తున్న ప్రభుత్వం… ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే బెవరేజేస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై సీఐడీ కేసు నమోదు చేయ‌గా.. ఈ కేసులో ఆయన్ను ఏ క్షణంలోనైనా అరెస్టుచేసే అవ‌కాశముంది.. ఇదే జరిగితే సంబంధిత శాఖ చూసిన వైసీపీ సీనియర్‌ నేత నారాయణస్వామి చిక్కుల్లో పడినట్లేనని రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. ఆర్థిక రంగంలో అస్తవ్యస్త విధానాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చేశారని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి నాలుగు శ్వేతపత్రాలను సిద్ధం చేస్తోంది. కాంట్రాక్టర్లకు ఇష్టానుసారంగా బిల్లులు చెల్లించారని, కొన్ని పనులు చేయకుండానే కోట్లు కుమ్మరించారని అనుమానిస్తున్న ప్రభుత్వం.. పక్కా ఆధారాల సేకరణతో శ్వేతపత్రాలు విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మైంది. రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించిన సంబంధిత శాఖ మాజీ మంత్రి రోజా, అనుమతులిచ్చేలా జీవోలు జారీ చేసిన పర్యాటక, మున్సిపల్‌ అధికారులపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి గ‌త ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో ప‌లు రంగాల్లో జ‌రిగిన అవినీతి అక్ర‌మాల‌ను వెలికితీసేందుకు కూట‌మి ప్ర‌భుత్వం శ్వేత‌ప‌త్రాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌టంతో.. ఎప్పుడు ఎవ‌రి అరెస్ట్ ఉంటుందోన‌ని మాజీ మంత్రులు, వైసీపీ నేత‌లు భ‌య‌ప‌డుతున్నార‌ట‌.