ఉద్యోగులకు సంక్రాంతి కానుక ఉన్నట్లా లేనట్లా?
posted on Jan 8, 2025 12:37PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక ఉన్నట్లా లేనట్టా అన్న చర్చ జరుగుతోంది. ఈ సారి సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రెండు డీఏలను ప్రకటించే అవకాశం ఉందని విస్తృతంగా ప్రచారం జరిగింది. డీఏలు ప్రకటించే విషయంపై మంత్రివర్గం చర్చిస్తుందని ఉద్యోగులు భావించారు. అయితే ఈ నెల 2న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఉద్యోగుల డీఏలపై చర్చించలేదు. దానిపై ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. దీంతో ఈ సంక్రాంతికి ఉద్యోగులకు రెండు డిఏలు అందుతాయా లేదా అన్న అనుమానాలు ఉద్యోగులలో వ్యక్తం అవుతున్నాయి.
గత ఏడాది జరిగిన ఎన్నికలలో కూటమి ప్రభుత్వ ఘన విజయంలో ఉద్యోగుల పాత్రా కీలకంగా మారిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనంతగా ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా పెద్ద సంఖ్యలో ఓట్లు వేశారు. ఈ నేపథ్యంలోనే కూటమి సర్కార్ వారికి సంక్రాంతి కానుకగా డీఏలను ప్రకటించే అవకాశం ఉందని ఆశించారు. దీనిపై చంద్రబాబు నిర్ణయం ఏమిటన్నది వేచి చూడాల్సి ఉంది.