మీ మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నాలుగు అలవాట్లు మానేయాల్సిందే...
posted on Jul 22, 2023 9:30AM
మెదడు మన మొత్తం శరీరానికి నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుంది. ఇది మానసిక, శారీరక ఆలోచనలు, వాటి పరిస్థితులను, భావోద్వేగాలను నియంత్రిస్తుంది. మనం చదువుతున్నా, తింటున్నా, ఏదైనా చెప్పాలని అనుకున్నా, కోపం, సంతోషం, బాధ వంటివి ఎక్స్ఫెస్ చేసినా అవన్నీ మెదడు ద్వారా మాత్రమే జరుగుతున్నాయి. దీని ద్వారా అర్థం చేసుకోవాల్సిందేమిటంటే మెదడు అనేది చాలా కీలకమైన అంశం. మెదడు ఆరోగ్యంగా లేకపోతే మనిషి శరీరం ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంలోకి చాలా సులువుగా జారిపోతుంది. కాబట్టి మనిషి మెదడు ఆరోగ్యంగా ఉండటం ప్రతి ఒక్కరికి అవసరం. కానీ రోజువారీ అలవాట్లలో కొన్ని మనిషి మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వీటిలో కూడా నాలుగు అలవాట్లు మెదడు మీద ఒత్తిడి పెంచి దాని సామర్థ్యం కోల్పోయోలా చేస్తాయి. ఆ నాలుగు అలవాట్లు ఏంటో తెలుసుకుని వాటికి దూరంగా ఉండటం చాలా మంచింది.
జీవనశైలి, పర్యావరణ కారకాలు, కొన్ని రకాల ఆరోగ్య సమస్యల కారణంగా మెదడు సంబంధిత వ్యాధుల ప్రమాదం కాలక్రమేణా పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మెదడు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం, నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జూలై 22న వరల్డ్ బ్రెయిన్ డే జరుపుకుంటారు. ఈ సందర్భంగా మెదడు ఆరోగ్యంగా ఉండటానికి దూరం పెట్టాల్సిన నాలుగు అలవాట్లు తెలుసుకుంటే..
ధూమపానం..
ధూమపానం అనేది మెదడుకు మాత్రమే కాకుండా మొత్తం శరీరానికి అత్యంత హానికరమైన అలవాట్లలో ఒకటి. ధూమపానం చేసే అలవాటున్న వ్యక్తులకు సాధారణ వ్యక్తుల మెదడు ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ధూమపానం రక్త నాళాలను దెబ్బతీస్తుంది. దీర్ఘకాలిక మంటను కలిగిస్తుంది, ఇది స్ట్రోక్, అభిజ్ఞా క్షీణతకు దారితీస్తుంది. మెదడు కణాలు ఆరోగ్యంగా ఉండటానికి, మెదడు సరిగ్గా పనిచేయడానికి, మీరు ఈ అలవాటును వెంటనే వదిలివేయాలి.
తగినంత నిద్ర లేకపోవడం..
మన మెదడుకు అత్యంత ప్రమాదకరంగా భావించే అలవాట్లలో, నిద్రలేమి సమస్య కూడా ప్రముఖమైనది. తగినంత నిద్ర లేకపోవడం మెదడుకు అనేక రకాల సమస్యలను పెంచుతుంది. తగినంత నిద్ర లేనప్పుడు, మెదడుకు అవసరమైన విశ్రాంతి లభించదు. ఇది అభిజ్ఞా క్షీణత, జ్ఞాపకశక్తి కోల్పోవడం, మానసిక స్థితి మార్పులు వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. నిద్ర లేకపోవడం వల్ల డిమెన్షియా వంటి వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది.
ఒంటరితనం..
చాలా మందికి ఒంటరిగా ఉండటం ఇష్టం. ఒంటరిగా ఉండటం, ఎవరినైనా కలవడానికి, ఎవరితో అయినా మాట్లాడటానికి అసక్తి చూపకపోవడం వంటి అలవాట్లు ఉంటే వారికి నిరాశ, అల్జీమర్స్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. ఒంటరితనం కాలక్రమేణా మేధో సామర్థ్యాలలో క్షీణతకు కారణమవుతుంది. ఒంటరితనం ఉన్నవారి మెదడు పనితీరు సాధారణ వ్యక్తుల కంటే చాలా తొందరగా సామర్థ్యాన్ని కోల్పోతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
అతిగా కూర్చోవడం..
నేటి జీవన శైలిలో ఎక్కువగా కూర్చునే ఉండటం కామన్ అయిపోయింది. ఒకే చోట గంటలు గంటలు కూర్చోవడం, కదలకుండా పనిచేసుకోవడం, ఉద్యోగాలు చేయడం మొదలయినవి శరీరానికి హానికరం. ఇది మెదడుపై దుష్ప్రభావాలను కలిగిస్తుంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల జ్ఞాపకశక్తికి సంబంధించిన మెదడులోని ముఖ్యమైన భాగం దెబ్బతింటుంది. తక్కువ చురుకుగా ఉన్నవారికి మెదడు వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
*నిశ్శబ్ద.