పూల టీలతో భలే ఆరోగ్యం..
posted on Oct 24, 2024 9:30AM
పువ్వులు మనసుకు చాలా ఆహ్లాదాన్ని ఇస్తాయి. చాలామంది పువ్వులను ఇంటి అలంకరణ కోసం, దేవుడి పూజ కోసం వాడతారు. ఇక ఆడవాళ్లకు పూలు తెచ్చిపెట్టే అందం అంతా ఇంతా కాదు.. అయితే పువ్వులు మగువల అందాన్ని, ఇంటి అందాన్ని, దేవతామూర్తుల చెంత చేరి దేవతామూర్తుల రూపాన్ని మెరిపించడమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా చేకూరుస్తాయి. జపనీస్, చైనా ప్రజలు పువ్వులను ఆరోగ్యం కోసం ఉపయోగించడం ఎప్పటి నుండో వాడుకలో ఉంది. భారతీయ ఆయుర్వేదంలో కూడా చాలా రకాల పువ్వుల ను ఔషదంగా వాడతారు. అయితే కొన్ని రకాల పువ్వలతో టీ చేసుకుని తాగితే ఆరోగ్యం భేష్ గా ఉంటుంది. ఇంతకీ ఆరోగ్యం చేకూర్చే ఆ టీలు ఏవో తెలుసుకుంటే..
మందార టీ..
మందారలో ఫ్లేవనాయిడ్స్, బీటా కెరోటిన్, విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ యొక్క ఆక్సీకరణను నిరోధిస్తాయి. చాలా అధ్యయనాలలో మందార సిస్టోలిక్ రక్తపోటును తగ్గిస్తుందని తేలింది. ఇప్పటికే యాంటీ హైపర్‌టెన్సివ్ డ్రగ్స్‌లో ఉన్నవారు మందార టీని తీసుకునే ముందు వైద్యులను సంప్రదించాలి.
చమోమిలే టీ..
ఎండిన చమోమిలే లేదా చేమంతి పువ్వులను వేడి నీటిలో వేసి చమోమిలే టీని తయారుచేస్తారు. ఫలితంగా సున్నితమైన రుచితో సువాసన కలిగిన టీ చాలా ప్రశాంతతను ఇస్తుంది. చమోమిలే టీ మంచి నిద్రను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. "కెఫిన్ టీలకు బదులు చమోమిలే రాత్రిపూట తీసుకుంటే మంచి నిద్ర సొంతమవుతుంది.
బ్లూ టీ..
బ్లూ టీని శంఖు పుష్పాలతో తయారుచేస్తారు. దీని కోసం తాజా శంఖు పుష్పాలు అయినా వాడవచ్చు లేదా.. ఎండిన శంఖు పుష్పాలు అయినా ఉపయోగించవచ్చు. బ్లూ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని లోపలి నుండి యవ్వనంగా మారుస్తాయి. బ్లూ టీలో ఉండే ప్లేవనాయిడ్లు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. బ్లూ టీలో ఉండే క్యాటెచిన్స్ బరువు తగ్గడంలో సహాయపడతాయి.
రోజ్ టీ..
సాధారణంగా వాడే టీలో ఎండిన గులాబీ రేకులను జోడించుకోవచ్చు. లేదంటే తాజా గులాబీ రేకులను కూడా ఉపయోగించవచ్చు. గులాబీ రేకులను నేరుగా సాధారణ నీటిలో ఉడకబెట్టడం ద్వారా గులాబీ టీని తయారు చేసుకోవచ్చు. గులాబీ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటీ గుణాలు ఉంటాయి. రోజ్ టీ కూడా జీర్ణప్రక్రియను ప్రోత్సహిస్తుంది.
లావెండర్ టీ..
లావెండర్ టీ సాధారణంగా సోపులు, పెర్ప్యూమ, ఎయిర్ ఫ్రెషనర్ మొదలైన వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ లావెండర్ టీ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. లావెండర్ మానసిక స్థితిని మెరుగు పరచడంలో సహాయపడుతుంది. నరాలకు స్వాంతన చేకూరుస్తుంది. మంచి నిద్రకు, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది.
*రూపశ్రీ.