రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే ఏం జరుగుతుంది?

 


శరీరం ఆరోగ్యంగా ఉండడానికి అన్ని అవయవాలకు మెరుగైన రక్త ప్రసరణ అవసరం.  చాలామందికి శరీరంలో రక్తం తక్కువ ఉందని అంటుంటారు. నిజానికి రక్తం తక్కువ ఉండటం అంటూ ఏమీ ఉండదు. కానీ రక్తంలో హిమెగ్లోబిన్ స్థాయిలు తక్కువ ఉంటాయి.    రక్తంలో హిమోగ్లోబిన్ లేకపోవడాన్ని రక్తహీనత అంటారు.   రక్తహీనత అనేది ఒక సాధారణ సమస్య. ముఖ్యంగా మగవారిలో కంటే ఆడవారిలోనే ఈ సమస్య ఎక్కువ.  భారతదేశంలో అధిక శాతం మహిళలు రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారని వైద్య పరిశోధనలు, సర్వేలు  వెల్లడిస్తున్నాయి. అందుకే రక్తహీనత ప్రమాదం భారతీయ మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. హిమోగ్లోబిన్ అనేది మన ఎర్ర రక్త కణాలలో ఉండే ప్రోటీన్. దాని లోపం కారణంగా అవయవాలకు ఆక్సిజన్ ప్రసరణ లోపిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్  దీర్ఘకాలంగా లోపిస్తే  రక్తహీనతకు కారణమవుతుంది, ఇది వివిధ రకాల ఆరోగ్య దుష్ప్రభావాలను కలిగిస్తుంది.

శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఆహారంలో పోషకాలు లేకపోవడం, కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు, మహిళల్లో రుతుక్రమం వంటి కారణాల వల్ల కూడా  హిమెగ్లోబిన్ తగ్గడానికి కారణం అవుతుంది. అయితే హీమోగ్లోబిన్ స్థాయిలు సాధారణం కంటే తక్కువగా ఉంటే ఏం జరుగుతుందంటే..

హిమోగ్లోబిన్ లెవల్..

పురుషులు,  స్త్రీలలో హిమోగ్లోబిన్  సాధారణ స్థాయి భిన్నంగా ఉంటుంది. పురుషులకు 14.0 నుండి 17.5 గ్రా/డిఎల్ మధ్య ఉండాలి.  మహిళలకు  12.3 నుండి 15.3 గ్రా/డిఎల్ మధ్య ఉండాలి. పురుషులలో 13 గ్రా/డిఎల్ కంటే తక్కువ హిమోగ్లోబిన్ ఉన్నా,  మహిళల్లో 12 గ్రా/డిఎల్ కంటే తక్కువగా ఉన్నా  హానికరంగా పరిగణిస్తారు.

శరీరంలో హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల అలసట, బలహీనత,  తలనొప్పి సమస్య తరచుగా ఉంటుంది. రాత్రి బాగా నిద్రపోయిన తర్వాత కూడా  అలసిపోయినట్లు,  బలహీనంగా ఉన్నట్లు  అనిపించవచ్చు. తేలికపాటి శారీరక శ్రమ చేసినా  బలహీనంగా అనిపిస్తుంది. రక్తహీనత ఉన్నవారిలో    తలనొప్పి చాలా  సాధారణ సమస్యగా ఉంటుంది. ఇవి దీర్ఘకాలం ఉండటం ప్రమాదం.

శరీరంలోని కణజాలాలకు,  అవయవాలకు ఆక్సిజన్‌ను అందించడంలో,  కార్బన్ డయాక్సైడ్‌ను బయటకు పంపడంలో హిమోగ్లోబిన్  ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది . శరీరంలో హిమోగ్లోబిన్ సాధారణం కంటే తక్కువగా ఉండటం వలన గుండె ఆరోగ్యం  ప్రభావితమవుతుంది. హిమోగ్లోబిన్ లోపంతో బాధపడుతున్న వ్యక్తులు హృదయ స్పందన రేటు సక్రమంగా లేకపోవడం, హృదయ స్పందనలు సాధారణం కంటే ఎక్కువ లేదా తక్కువగా ఉండటం వంటి సమస్యను ఎదుర్కొంటారు. హృదయ స్పందన రేటు సక్రమంగా లేకుంటే అది అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల ఆక్సిజన్ శరీరంలోని కణజాలాలకు అవయవాలకు సరిగా చేరదు. వాస్తవానికి, తక్కువ స్థాయి హిమోగ్లోబిన్ కారణంగా ఆక్సిజన్‌ను తీసుకువెళ్ళే  సామర్థ్యం తగ్గుతుంది. దీని కారణంగా ఏ కొద్దిగా పనిచేసినా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. చాలా మందికి రక్తహీనత కారణంగా విశ్రాంతి సమయంలో కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఊపిరి ఆడకపోవటం వంటి సమస్యలు ఉంటాయి.

ఇవన్నీ కేవలం శరీరంలో రక్తహీనత కారణంగానే సంభవిస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ అప్పుడప్పుడు హిమోగ్లోబిన్ పరీక్షను చేయించుకుంటూ ఉండాలి. రక్తంలో తగినంత హిమోగ్లోబిన్ లేకపోతే హిమోగ్లోబిన్ పెంచే ఆహారాలు తీసుకోవాలి. వైద్యుల సలహా మేరకు ఐరన్ ట్యాబెట్లు,  సిరప్ లు కూడా తీసుకోవచ్చు.


                                                         *రూపశ్రీ.