రాష్ట్ర రహదారులకూ టోల్? ప్రజలను ఒప్పించగలరా?

జాతీయ రహదారుల తరహాలో రాష్ట్ర రహదారులను పిపిపి విధానంలో నిర్మించి టోల్ టాక్స్  వసూలు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు యోచిస్తున్నారు. జాతీయ రహదారులపై వసూలు చేసినట్లుగా ఇక రాష్ట్ర రహదారులపై కూడా టోల్ గేట్లు దర్శనమిస్తాయన్న మాట. అంటే జాతీయ రహరాదులపై ప్రయాణాలకు కట్టాల్సినట్లుగానే రాష్ట్ర రహదారులపై ప్రయాణానికీ ఇక నుంచి టోలు కట్టాల్సిందే. ఇది సహజంగానే ప్రజలకు ఆగ్రహాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు కారణమౌతుంది. నిరసనలు, ఆందోళనలు మొదలౌతాయి. అయితే రాష్ట్రంలో రహదారుల మరమ్మతు, కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టాలంటే ప్రభుత్వానికి సొమ్ములు ఎక్కడ నుంచి వస్తాయన్న విషయాన్ని జనం పట్టించుకోరు. పట్టించుకోవలసిన అవసరం కూడా లేదు. అసలు ఐదేళ్లుగా రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్న ఆగ్రహం కారణంగానే గ్రామీణ ప్రాంతాలలో జనం జగన్ ను వ్యతిరేకమయ్యారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో  రాష్ట్రంలో ఎక్కడా ఒక్కటంటే ఒక్క కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టిన దాఖలాలు లేవు. కొత్త రోడ్ల వరకూ ఎందుకు కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చ లేదు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో రోడ్లపై ప్రయాణం ఒక నరకంగా మారిపోయిందని జనం గగ్గోలు పెట్టారు.  ఏపీలో రోడ్లపై ప్రయాణం ఎంత దివ్యంగా ఉంటుందన్న దానిపై దేశ వ్యాప్తంగా చర్చ కూడా జరిగింది. అప్పట్లో తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ అవకాశం వచ్చినా, రాకపోయినా, సందర్భం అయినా కాకపోయినా తమ ప్రభుత్వం రాష్ట్రంలో ఎంత బ్రహ్మాండమైన పాలన సాగిస్తోందో చెప్పడానికి ఏపీలో రోడ్ల దుస్థితిని ఉదాహరణగా చూపేది. ముఖ్యంగా అప్పటి మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ఏపీ రోడ్లపై తరచూ వ్యంగ్యాస్త్రాలు సంధించేవారు. 

ఇప్పుడు తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో రహదారి ప్రయాణాన్ని సుఖవంతం చేసే లక్ష్యంతో రోడ్ల మరమ్మతులకు నడుం బిగించింది. అయితే గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యింది. అందిన చోటల్లా అప్పులు చేసి, అదీ చాలక ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి మరీ   జగన్ సర్కార్ అప్పట్లో చేసిన రుణగొణ ధ్వని దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. చివరాఖరికి వచ్చే పాతికేళ్ల మద్యం ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు చేసిన వైసీపీ సర్కార్ అధికారం దిగే సమయానికి ఏపీని దివాళీ ముంగిట నిలబెట్టింది. 

ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం రోడ్ల మరమ్మతులపై దృష్టి సారించింది. రాష్ట్రంలో   కొత్త రహరాదుల నిర్మాణం సంగతి పక్కన పెడితే కేవలం రోడ్లపై గుంతలు పూడ్చి మరమ్మతులు చేయడానికే ఎనిమిది వందల కోట్ల రూపాయలకు పైగా వ్యయం అవుతుందని ఒక అంచనా. ప్రస్తుత పరిస్థితుల్లో అంతటి ఖర్చుకు భరించే పరిస్థితి లేకపోవడంతో చంద్రబాబు అనివార్యంగా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించక తప్పలేదు. రోడ్ల మరమ్మతులకు  రూ.800 కోట్లు ఆదే సమయంలో రాష్ట్ర రహదారుల నిర్మాణం పిపిపి ( ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం) విధానంలో రెండు విడతలగా చేపట్టాలని నిర్ణయించారు.   జాతీయ రహదారుల తరహాలోనే రాష్ట్ర రహదారుల్ని కూడా దశల వారీగా పీపీపీ విధానంలో అభివృద్ది చేసి వాటిపై టోల్ వసూలు చేయాలని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనల మేరకు తొలి దశలో 18, రెండో దశలో 68 రోడ్లూ అభివృద్ధి చేసి టోల్ వసూలు చేస్తారు. 

ఏపీలో పెద్ద సంఖ్యలో రాష్ట్ర రహదారులు ఉన్నాయి. వాటి పరిస్ధితి గత ఐదేళ్లలో దారుణంగా మారిపోయింది. వీటిపై ప్రయాణం  నరకప్రాయమేనని జనం గగ్గోలు పెడుతున్నారు. దీంతో ప్రస్తుతానికి వాటిపై గుంతల్ని పూడ్చేందుకు ఉపక్రమించిన ప్రభుత్వం  త్వరలో వీటిని జాతీయ రహదారుల తరహాలోనే ప్రైవేట్ సంస్థలకు అప్పగించి వాటిని అభివృద్ధి చేయడంతో పాటు టోల్ ట్యాక్స్ కూడా వసూలు చేయాలని భావిస్తోంది.  అయితే ఇందుకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాకుండా ఉండాలంటే.. పీపీపీ విధానంలో రోడ్ల అభివృద్ధి వల్ల చేకూరే ప్రయోజనాలపై ప్రజలలో అవగాహన కల్పించాలి. అదే సమయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రోడ్లు ఉంటే.. రాష్ట్ర ప్రగతికి అవకాశం లేకపోవడంతో పాటు జనం ఆర్థికంగా కూడా ఎంత నష్టపోతారో వివరించాల్సి ఉంటుంది. ప్రజలకు పీపీపీ విధానంలో రోడ్ల అభివృద్ధి వల్ల ఒనగూరే ప్రయోజనాల పట్ల అవగాహన కల్పించి ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా అవసరమైనచర్యలు తీసుకోవలసి ఉంది. అదే విధంగా మండలం యూనిట్ గా టోల్ గేట్లు పెట్టడం కాకుండా జిల్లా యూనిట్ గా తీసుకుని టోల్ వసూలు చేయడానికి నిర్ణయిస్తే ప్రజల నుంచి పెద్ద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండదు. ఆ దిశగా యోచన చేయాలి. మొత్తం మీద రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులను తలదన్నే విధంగా ఉంటాయన్న హామీతో ప్రజలను టోల్ చెల్లింపునకు ఆంగకరింప చేయాలి.