ఏక్ నాథ్ షిండే వెనక్కు తగ్గారా?

మహారాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో ప్రతిష్ఠంభనకు తెరపడిందా అంటే తాజాగా శివసేన(షిండే) అధినేత ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలను బట్టి ఔనన్న సమాధానమే వస్తుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని మహాయతి కూటమి తిరుగులేని విజయాన్ని సాధించింది. ఎవరూ ఊహించని విధంగా ఈ ఎన్నికలలో కూటమిలోని అన్ని పార్టీల కంటే బీజేపీకి సొంతంగా అత్యధిక స్థానాలు వచ్చాయి. అదీ ఎంతగా కంటే కూటమి భాగస్వామ్య పార్టీల మద్దతు లేకుండా సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థానాలకు బీజేపీ స్వయంగా సాధించింది.

దీంతో ఎన్నికల ముందు ఒప్పందాన్ని తోసి రాజని ముఖ్యమంత్రి పీఠం తమ పార్టీకే దక్కాలని కమలనాథులు భీష్మించుకు కూర్చున్నారు. సహజంగానే ఇది శివసేన(షిండే) వర్గానికి నచ్చలేదు. సిట్టింగ్ ముఖ్యమంత్రిగా కూటమిని రాష్ట్రంలో విజయపథంలో నడిపించిన షిండేకే ముఖ్యమంత్రి పీఠం దక్కాలని పట్టుబట్టింది. దీంతో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.

ఎట్టకేలకు ఏక్ నాథ్ షిండే ఒక అడుగు వెనక్కు వేసి బంతిని బీజేపీ కోర్టులోకి నెట్టేశారు. కొద్ది సేపటి కిందట ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ హై కమాండ్ ఎవరిని నిర్ణయిస్తే వారికే తన పూర్తి మద్దతు ఇస్తానని చెప్పారు. తన వల్ల కూటమి ప్రభుత్వ ఏర్పాటులో ఎటువంటి సమస్యా తలెత్తదని చెప్పేయడం ద్వారా తాను సీఎం రేసునుంచి తప్పుకుంటున్నట్లు చెప్పకనే చెప్పేశారు. సో.. ఇహనో ఇప్పుడో ఫడ్నవీస్ ను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ హైకమాండ్ ప్రకటించే అవకాశం ఉంది.