మోడీతో ముగిసిన పవన్ భేటీ.. ఏం మాట్లాడారంటే?
posted on Nov 27, 2024 2:00PM
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మోడీతో భేటీ అయ్యారు. వీరిరువురి మధ్యా దాదాపు అరగంట పాటు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో జల జీవన్ మిషన్ కొనసాగింపుపై మోడీతో పవన్ మాట్లాడారని అంటున్నారు. ఇప్పుడు ఏపీలో తాగు నీటి సరఫరా శాఖ మంత్రి కూడా అయిన పవన్ తన ఎన్నికల ప్రచారంలో ఇంటింటికీ కుళాయిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జల జీవన్ మిషన్ ద్వారా ఈ కుళాయిల ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నారు. అందుకే ఈ పథకాన్ని రాష్ట్రంలో కొనసాగించాలని ప్రధాని మోడీని పవన్ కల్యాణ్ కోరారని చెబుతున్నారు.
ఈ అంశంతో పాటు రాష్ట్రానికి రావలసిన నిధులు, పథకాలపై పవన్ కల్యాణ్ మోడీకి వివరించారని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి కొలువుదీరిన తరువాత పవన్ కల్యాణ్ ప్రధానితో భేటీ కావడం ఇదే మొదటి సారి. గతంలో కూడా పవన్ ఉప ముఖ్యమంత్రి హోదాలో హస్తినలో పర్యటించినప్పటికీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కొందరు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు కానీ మోడీతో సమావేశమైంది లేదు. దీంతో వీరిరువురి మధ్యా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మోడీతో భేటీ ముగిసిన తరువాత పవన్ కల్యాణ్ తో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి భేటీ అయ్యారు. ఆ తరువాత తెలుగుదేశం ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయులు, మాగుంట శ్రీనివాసుల రెడ్డిలు పవన్ కల్యాణ్ ను కలిసి వివిధ అంశాలపై చర్చించారు.